న్యూయార్క్ లో వైభవంగా నైటా గణేశ్ ఉత్సవాలు…
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ప్రెసిడెంట్ రవీందర్ కోడెల ఆధ్వర్యంలో న్యూయార్క్‌లోని అసమయి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు కుటుంబాలతో పాటు స్థానిక న్యూయార్క్ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని భారతీయ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలను ఆసక్తిగా వీక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలకు మరింత శోభ చేకూరింది. భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త, సంఘ శ్రేయోభిలాషి డా. పైళ్ళ మల్లారెడ్డి దంపతులతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు హాజరై వేడుకలను తిలకించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో అధ్యక్షుడు రవీందర్ కొడెలతో పాటు కార్యవర్గ సభ్యులు, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్, సలహాదారులు, వాలంటీర్లు విశేష కృషి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తూ, పూజా మరియు సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రవీందర్ కొడెలా, కార్యవర్గ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. న్యూయార్క్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, భవిష్యత్ తరాలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని వారు పేర్కొన్నారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తుల ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి.








