మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ లోకార్పణం!
ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు డా. గజల్ శ్రీనివాస్ రూపొందించిన “శ్రీమద్భగవద్గీత – ఆంగ్ల ఆడియో ఆల్బమ్”ను మారిషస్ రాష్ట్రపతి శ్రీ ధరమ్‌బీర్ గోకుల్ దంపతులు మారిషస్‌లోని శ్రీ హరిహర దేవస్థానం – కళాజ్యోతి ప్రాంగణంలో ఘనంగా లోకార్పణం చేశారు.
ఆల్బమ్ ప్రత్యేకతలు…
ఈ ఆడియో ఆల్బమ్‌లో శ్రీమద్భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలను డా. గజల్ శ్రీనివాస్ స్వరపరచి గానం చేశారు.
కోల్‌కతాలోని అద్వైత ఆశ్రమానికి చెందిన శ్రీ స్వామి స్వరూపానంద అందించిన ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా తీసుకోగా, గీతా తాత్పర్యాలకు శ్రీ ఎన్. పార్థసారథి ఆంగ్లంలో స్వరాన్ని అందించారు.
శ్రీమద్భగవద్గీతను ప్రపంచంలోని 100 భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో డా. గజల్ శ్రీనివాస్ చేపట్టిన పవిత్రమైన గ్లోబల్ గీతా ఉద్యమాన్ని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ బృందావన పార్థసారథి సమన్వయం చేసి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న రోడ్లు భవనాల శాఖా మంత్రి శ్రీ అజయ్ గున్నెస్, ఆర్థిక శాఖా మంత్రి శ్రీమతి జ్యోతి జీతన్, దేశ ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ సీబాలక్ తదితరులకు మారిషస్ రాష్ట్రపతి శ్రీ ధరమ్‌బీర్ గోకుల్ శ్రీమద్భగవద్గీత ఆడియో పెన్‌డ్రైవ్‌లను అందజేశారు.
భారతీయ ఆధ్యాత్మిక సంపద తన గానం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో డా. గజల్ శ్రీనివాస్ చేపట్టిన గ్లోబల్ గీతా మిషన్‌లో ఈ ఆంగ్ల శ్రీమద్ భగవద్గీత ఆడియో ఆల్బమ్ లోకార్పణం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.








