ఏపీ పట్టణాలకు సరికొత్త కళ..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాల రూపురేఖలను మార్చేలా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.11,359 కోట్ల విలువైన పట్టణ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) మంగళవారం తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఈ భారీ పనులను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా చేపట్టబోతోంది.
ఈ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైవ్‌లో భాగంగా 123 మున్సిపాలిటీలలో రూ.7,469 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు జరగనుండగా, కేవలం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోనే రూ.3,890 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పట్టణ ప్రాంతాల్లో సుమారు 2,165 కిలోమీటర్ల మేర అత్యాధునిక సిమెంట్, తారు రహదారుల నిర్మాణం (రూ.4,656 కోట్లు), సెంట్రల్ మీడియన్ల ఆధునికీకరణ (రూ.88 కోట్లు), మెరుగైన వీధి దీపాల ఏర్పాటు (రూ.247 కోట్లు) మరియు పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని పంచేందుకు 502కు పైగా నూతన పార్కుల అభివృద్ధి (రూ.509 కోట్లు) చేపట్టనున్నారు.
శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు అధికారులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పట్టణ స్థానిక సంస్థల్లో గత కొన్ని ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాథమిక మౌలిక వసతులను రికార్డు సమయంలో పునరుద్ధరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్లానింగ్ ద్వారా ఏపీ పట్టణాలను క్లీన్ అండ్ గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దుతామని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండబోదని హామీ ఇచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా ఈ మెగా లాంచ్‌తో పాటు నియోజకవర్గంలో శాంతిపురం వద్ద హంద్రీనీవా కాలువకు ముఖ్యమంత్రి జలహారతి ఇవ్వడం విశేషం.








