కరెంట్ వాడినందుకు ఎదురు డబ్బులు! ఎందుకీ విచిత్ర పరిస్థితి?
కరెంట్ వాడితే డబ్బులు రావడమేంటి? ఇది వినగానే ఎవరికైనా మొదట కాస్త వింతగానే, సరదాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనమందరం నెల కాగానే కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో అని కంగారు పడతాం కానీ, కరెంట్ వాడినందుకు మనకే కంపెనీలు డబ్బులిచ్చే పరిస్థితి ఉంటుందని ఎప్పుడైనా ఊహించామా? కానీ ప్రపంచం మారుతోంది. ఇప్పుడు స్పెయిన్‌లో విద్యుత్ మార్కెట్లో సరిగ్గా ఇలాంటి విచిత్రమైన వాతావరణమే కనిపిస్తోంది.
ఎందుకిలా జరుగుతోంది
మధ్యాహ్న సమయంలో సూర్యుడు మండుతుంటే, వేలాది సోలార్ ప్యానెళ్లు ఒకేసారి టన్నుల కొద్దీ కరెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. తీరా చూస్తే అంత కరెంట్‌ను వాడేవాళ్లే అక్కడ ఉండటం లేదు. దాంతో విద్యుత్ ధర సున్నా కంటే కిందకు పడిపోతోంది. అంటే కరెంట్ కొనేవారికి రివర్స్‌లో డబ్బులు చెల్లించేంతగా మార్కెట్ పడిపోతోంది.
దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక ఊరికి మధ్యాహ్నం వేళ సరిగ్గా 100 యూనిట్ల కరెంట్ అవసరమనుకుందాం. కానీ అదే సమయంలో అక్కడున్న సోలార్, విండ్ మిల్స్, ఇతర పవర్ ప్లాంట్లు అన్నీ కలిపి ఏకంగా 130 యూనిట్లు తయారుచేశాయి. అంటే అక్కడ 30 యూనిట్ల కరెంట్ అదనంగా మిగిలిపోయింది.
కరెంట్ అనేది బియ్యం బస్తానో, ధాన్యమో కాదు కదా.. కావాల్సినప్పుడు వాడుకుని మిగిలింది గోదాములో దాచుకోవడానికి! తయారైన కరెంట్‌ను వెంటనే ఎవరో ఒకరు వాడాలి,లేదా భారీ బ్యాటరీలలో నిల్వ చేయాలి, అదీ కాకపోతే కరెంట్ కొరత ఉన్న మరో ప్రాంతానికి పంపించాలి. ఇవేవీ కుదరకపోతే ఉత్పత్తిని బలవంతంగా తగ్గించాల్సి వస్తుంది.
సోలార్ కరెంట్‌ను ఎవరు కొంటారు?
సోలార్ ప్లాంట్‌లో తయారైన విద్యుత్ నేరుగా ఇంటికి వెళ్లదు. అది wholesale electricity market లోకి వస్తుంది. అక్కడ విద్యుత్ కంపెనీలు, సరఫరాదారులు, పెద్ద వినియోగదారులు అవసరానికి తగ్గట్టు కరెంట్ కొంటారు.
కానీ ఒకరోజు మధ్యాహ్నం సోలార్ ప్లాంట్లు, విండ్ ఫార్మ్‌లు కలిపి అవసరానికి మించిన కరెంట్ తయారు చేశాయనుకోండి. కొనేవాళ్లు తక్కువ. అప్పుడు మార్కెట్లో విచిత్రమైన పరిస్థితి వస్తుంది. “మా కరెంట్ తీసుకోండి” అని అమ్మేవాళ్లు అడుగుతారు. “మాకు ఇంత అవసరం లేదు” అని కొనేవాళ్లు అంటారు.కొనేవాళ్లు లేకపోతే ధర సున్నాకి చేరుతుంది. అలాగని కరెంట్ ని దాచే పరిస్ధితి లేదు. దాంతో ఇంకా కరెంట్ మిగిలితే..“సరే.. మా కరెంట్ తీసుకుని వాడండి, మేమే మీకు డబ్బులు ఇస్తాం!” అంటారు. ఇదే negative electricity price.
ఎందుకిలా జరుగుతోంది
సాధారణ మార్కెట్లలో లాగే విద్యుత్ మార్కెట్లో కూడా కొనేవాళ్ల కంటే అమ్మేవాళ్లు ఎక్కువైపోతే ధరలు పడిపోతాయి. అందరూ ఒకేసారి తమ కరెంట్ అమ్మడానికి పోటీ పడటంతో ఒకప్పుడు 20 ఈరోలు ఉన్న యూనిట్ ధర, మెల్లగా 5 ఈరోలకు, ఆ తర్వాత సున్నాకి పడిపోతుంది.
ఇవి కూడా చదవండి
సరఫరా ఇంకా ఎక్కువైతే అది ఏకంగా మైనస్ 5 ఈరోలకు వెళ్తుంది. హోల్‌సేల్ మార్కెట్లో దీని అర్థం ఏమిటంటే.. “బాబోయ్, నా కరెంట్‌ను తీసేసుకోండి, దానికి బదులుగా నేనే మీకు కొంత డబ్బు చెల్లిస్తాను” అని ఉత్పత్తిదారులు అనడం అన్నమాట.
అంత కరెంట్ మిగిలిపోయిందంటే దాచేయొచ్చు కదా?
బియ్యం, బొగ్గు, పెట్రోల్‌ను గోదాములో నిల్వ చేయవచ్చు. కానీ విద్యుత్‌ను అలా నిల్వ చేయలేం. బ్యాటరీలు ఉన్నాయి. కానీ ఒక దేశం మొత్తం మధ్యాహ్నం తయారయ్యే భారీ surplusను నిల్వ చేయాలంటే భారీ స్థాయి storage capacity కావాలి. అది ఖరీదైనది, అంతా వెంటనే అందుబాటులో ఉండదు. అంటే battery capacity సరిపోదు. ఇబ్బంది వచ్చేస్తోంది.
అయితే సోలార్ ప్యానెళ్లను ఆపేయొచ్చు కదా?
కొన్నిసార్లు అదే జరుగుతుంది కూడా. దీనినే curtailment అంటారు. సూర్యుడు బాగా ఉన్నా, అవసరానికి మించిన విద్యుత్ వస్తే grid operator కొన్ని renewable generatorsను “మీ output తగ్గించండి.” అని ఆదేశించవచ్చు. అయితే ఓ సారి ఆపేసి, మళ్లీ మొదలెట్టడం ఇదంతా చాలా కష్టమైన వ్యవహారం. చాలా పెద్ద సమస్య. ఒక సోలార్ ప్లాంట్‌ను నిర్మించడానికి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాక ఆపమంటే వారు ఒప్పుకోరు.
సింపుల్ గా చెప్పాలంటే..
ఒక వ్యాపారి దగ్గర ఒక వస్తువు 100 రూపాయలకు ఉంది. కానీ దాన్ని నిల్వ చేయడం ఖరీదు. రేపటికి అది పనికిరాదు. కొనేవాళ్లు కూడా లేరు. అప్పుడు ఆ వ్యాపారి: “ఈ వస్తువు తీసుకెళ్లండి. 10 రూపాయలు కూడా ఇస్తాను.” అంటాడు.ఎవరూ పట్టుకెళ్లకపోతే ఫ్రీగా ఇస్తాం పట్టుకెళ్లండి అంటాడు గోదాము ఖాళీ చెయ్యటానికి అయినా. విద్యుత్ విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇదే లాజిక్.
కరెంట్‌ను ఉత్పత్తి చేయడం కంటే, surplus electricityని నిర్వహించడం పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే negative price అనేది చాలా ఇబ్బందికర విషయం.
సామాన్యుడి బిల్లులోకి ఈ డబ్బులు వస్తాయా?
అయితే ఈ డబ్బులు సామాన్యుడికి దగ్గరకి వెళ్తాయా? ఇది కేవలం పెద్ద పెద్ద విద్యుత్ ఉత్పత్తిదారులు, సప్లయర్లు, భారీ పరిశ్రమల మధ్య జరిగే హోల్‌సేల్ మార్కెట్ లావాదేవీలకే పరిమితం.అయితే పెద్ద వినియోగదారులకు ఈ చౌకైన ధరల వల్ల బిల్లు భారీగా తగ్గే అవకాశం మాత్రం లభిస్తుంది.
మన భారత్‌లో పరిస్ధితి ఏమిటి?
మన దేశంలో కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటు వేగంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో మన దగ్గర కూడా మధ్యాహ్నం వేళల్లో భారీగా సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఇక్కడా ఇలాంటి సమస్యే రావచ్చు.
ఫైనల్ గా..
ఈ పరిణామాలు సామాన్యుడి రోజువారీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాయి. ఇప్పటిదాకా మనకు ఒక యూనిట్ కరెంట్‌కు ఇంత ధర అని మాత్రమే తెలుసు. కానీ రాబోయే రోజుల్లో “కరెంట్‌ను ఎప్పుడు వాడుతున్నాం?” అనే దాన్ని బట్టి బిల్లు మారే ప్రమాదం ఉంది. మధ్యాహ్నం సోలార్ కరెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడితే చాలా చౌకగాను, సాయంత్రం అందరూ ఒకేసారి వాడే పీక్ అవర్స్‌లో వాడితే చాలా ఖరీదుగాను ఉండవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








