తిరుమల భూములతో TTD మాస్టర్ ప్లాన్.. ICAIతో కలిసి ఏం చేయబోతోంది?
తిరుమల వెంకన్న అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది దర్శనం, లడ్డూ, హుండీ. అయితే కార్వనిర్వాహక వర్గానికి మాత్రం మరొకటి గుర్తు వస్తాయి. అవే ఈ సంస్ద ఈ ఆలయం వెనుక ఉన్న ఆస్తుల లెక్కలు మాత్రం ఊహించలేం. భక్తులు ఏళ్ల తరబడి స్వామివారికి ఇచ్చిన విరాళాల్లో నగలు, బంగారం మాత్రమే కాదు.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూములు, ఇళ్లు, ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఆస్తుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక కొత్త ఆలోచన చేస్తోంది.
ఆ ఆలోచన ఏమిటి
భూమిని అమ్మేయకుండా.. దాని నుంచే ఆదాయం వచ్చేలా చేయొచ్చా? అన్నదే ఆ ఆలోచన. ఇందుకోసం Real Estate Investment Trusts (REITs) విధానాన్ని పరిశీలిస్తోంది.
అసలు REIT ఏమిటి?
ఉదాహరణకి.. మీ దగ్గర చాలా విలువైన భూమి ఉంది. దాన్ని అమ్మేస్తే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. కానీ అమ్మేసిన తర్వాత ఆ ఆస్తి మీ చేతిలో ఉండదు. మరి అదే భూమిని అలాగే ఉంచి, దాని మీద వచ్చే ఆదాయాన్ని మాత్రం క్రమం తప్పకుండా పొందగలిగితే?
REIT ఆలోచన వెనుక ఉన్న బేసిక్ కాన్సెప్ట్ ఇదే.
అంటే TTD దగ్గర ఉన్న భూములను మొత్తం అమ్మేయకుండా, వాటిని ఆదాయం తెచ్చే ఆస్తులుగా ఎలా ఉపయోగించుకోవచ్చో పరిశీలిస్తున్నారన్నమాట. ముఖ్యంగా భక్తులు సమర్పించిన భూముల విషయంలో ఎలా ముందుకు వెళ్ళవచ్చో చూస్తున్నారట.
TTD దగ్గర ఉన్న భూమి విలువ ఎంతో తెలుసా?
2022లో చేసిన ఒక అంచనా ప్రకారం TTDకి దేశవ్యాప్తంగా 960 ఆస్తులు ఉన్నాయి. వీటి పరిధిలో 7,100 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ఆస్తుల విలువను అప్పట్లో సుమారు రూ.85,705 కోట్లుగా అంచనా వేశారు.
అంటే ఇది ఒక చిన్న ట్రస్ట్ దగ్గర ఉన్న కొన్ని భూముల విషయం కాదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న భారీ స్థాయి ఆస్తుల వ్యవస్థ.
వీటిలో చాలావరకు భక్తులు దశాబ్దాలుగా విరాళంగా ఇచ్చినవే. కాలం గడిచేకొద్దీ వాటి విలువ కూడా పెరిగి ఉండొచ్చు. అందుకే ఇప్పుడు వాటిని కేవలం భూములుగా చూడకుండా, దీర్ఘకాలిక ఆదాయాన్ని తీసుకురాగల ఆస్తులుగా ఎలా నిర్వహించాలనే దానిపై దృష్టి పడుతోంది.
ఇవి కూడా చదవండి
ఇంత పెద్ద ఆస్తులు ఉన్నప్పుడు వాటి లెక్కలు ఎలా నిర్వహిస్తున్నారు?
TTDలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న అకౌంటింగ్ మాన్యువల్ 30 ఏళ్లకు పైబడినది. అంటే ప్రపంచం మొత్తం డిజిటల్ అకౌంటింగ్, ఆధునిక ఆస్తుల నిర్వహణ, కొత్త ఆర్థిక ప్రమాణాల వైపు వెళ్లిపోయిన సమయంలో.. TTDలోని కీలకమైన ఆర్థిక వ్యవస్థలో కొంత భాగం మూడు దశాబ్దాల నాటి విధానాల ఆధారంగా కొనసాగుతోంది.
ఇప్పుడు Institute of Chartered Accountants of India (ICAI) TTDతో కలిసి ఈ వ్యవస్థను పూర్తిగా మార్చే పనిలో ఉంది.
కేవలం లెక్కల పుస్తకం మార్చడం కాదు..అలాగే ఇది “పాత మాన్యువల్ తీసేసి కొత్తది పెట్టడం” అనే చిన్న పని కాదు. TTDకి వచ్చే డబ్బు నుంచి మొదలుపెట్టి, చేసే చెల్లింపులు, బ్యాలెన్స్షీట్లో చూపించే ఆస్తులు, భూముల విలువ, ఇతర ఆర్థిక అంశాల వరకు మొత్తం వ్యవస్థను ఒకసారి తిరిగి పరిశీలించే ప్రయత్నం జరుగుతోంది.
ప్రస్తుత కాలానికి సరిపోయే అకౌంటింగ్ ప్రమాణాలతో పాటు, సంబంధిత కంపెనీల చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థను మార్చే పనిలో ICAI ఉంది. ఇందుకోసం ICAIకి చెందిన ప్రత్యేక టీమ్ ఆగస్టులో తిరుపతికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి, ఆర్థిక సమాచారాన్ని సేకరించింది.
బంగారం లెక్క తేల్చడం కూడా అంత ఈజీ కాదు!
తిరుమల ఆస్తులు అంటే భూములతో కథ అయిపోలేదు. శతాబ్దాలుగా భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారు నగలు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు కూడా TTD వద్ద ఉన్నాయి. వీటి పరిమాణం, స్వచ్ఛత, విలువను ఖచ్చితంగా నిర్ధారించడం కూడా ఒక పెద్ద ప్రక్రియ. తరతరాలుగా భక్తులు సమర్పించిన ఆభరణాలు, వాటి రికార్డులు, వాటి ప్రస్తుత విలువ.. ఇవన్నీ ఒక వ్యవస్థలోకి తీసుకురావడం ఎంత పెద్ద పని ఉంటుందో అర్థమవుతుంది.
అందుకే ICAI ఈ బంగారం విషయంలో కూడా వెరిఫికేషన్, వాల్యుయేషన్ విధానాలపై TTDకి సలహాలు ఇస్తోంది.
తిరుమల ప్రయోగం.. మిగతా ఆలయాలకు మోడల్?
TTD కోసం రూపొందించే కొత్త అకౌంటింగ్, ఆస్తుల నిర్వహణ విధానం కేవలం తిరుమలకే పరిమితం కాకపోవచ్చు. దేశంలోని ఇతర పెద్ద ఆలయ ట్రస్టులకు కూడా ఇది ఒక మోడల్‌గా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఆలయాల దగ్గర కూడా భక్తులు ఇచ్చిన భూములు, భవనాలు, బంగారం, ఇతర ఆస్తులు ఉన్నాయి. వాటి విలువ కాలంతో పాటు పెరుగుతున్నా, వాటిని ఆధునిక పద్ధతుల్లో నిర్వహించడం ప్రతి చోటా సులభమైన పని కాదు.
TTD లాంటి భారీ వ్యవస్థలో ఒకసారి కొత్త విధానం ఏర్పడితే.. దాన్ని ఇతర ఆలయ ట్రస్టులు కూడా అనుసరించే అవకాశం ఉంటుంది.
ఫైనల్ గా..
ప్రస్తుతం TTD…వేల ఎకరాల భూమిని అమ్మకుండా ఉంచి, అదే ఆస్తి నుంచి భవిష్యత్తులో ఆదాయం ఎలా సృష్టించాలి? భక్తులు ఇచ్చిన ఆస్తుల విలువను ఎలా కాపాడాలి? వాటి లెక్కలను మరింత పారదర్శకంగా, ఆధునికంగా ఎలా నిర్వహించాలి? అనే ప్రక్రియే ఇప్పుడు TTDలో మొదలైనట్టు కనిపిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








