వేదాల్లోని ‘ఋతం’ కాన్సెప్ట్ ఏమిటి? పాటిస్తే జీవితమే మారిపోతుందా?
ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒక చిన్న అబద్ధం చెప్పి, ఆ తర్వాత మనలో మనమే— “ఛా! అలా చెప్పకుండా ఉంటే బాగుండేదేమో…” అని అనుకున్న సందర్భం మన జీవితంలో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. విశేషమేమిటంటే, అక్కడ మనల్ని ఎవరూ పట్టుకోలేదు, అసలు ఎవరూ ప్రశ్నించనేలేదు! అయినా సరే లోపల ఒక రకమైన అశాంతి కలవరపెడుతుంది. అదే సమయంలో, మనకు ఎంతో ఇబ్బంది కలిగించే ఒక చేదు నిజాన్ని ధైర్యంచేసి చెప్పేసినప్పుడు.. పరిస్థితి కాస్త క్లిష్టంగా మారినా, లోపల మాత్రం భారం దిగిపోయి మనసు తేలికపడుతుంది. “ఏం జరిగినా పర్లేదు, కనీసం మనస్సాక్షికి నిజాయితీగా ఉన్నాను” అనే ఒక ప్రశాంతత లభిస్తుంది.
సాధారణంగా మనం దీనిని మనసుకు సంబంధించిన గిల్ట్ (Guilt) లేదా రిలీఫ్ (Relief) అనుకుంటాం. కానీ వేల ఏళ్ల క్రితమే భారతీయ తత్వంలో ఈ అనుభూతిని ఒక విశ్వ నియమంతో ముడిపెట్టి చూశారు. మనిషి మాత్రమే కాదు, ఈ మొత్తం సృష్టి ఒక అద్భుతమైన క్రమంలో నడుస్తోందని గమనించారు. ఆ క్రమానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెనక్కి తిరిగి, కారణం వెతుక్కుని ప్రశ్నించి, సరిచేసుకునే క్రమంలోనే అన్ని తిరిగి వాటి స్ధానాల్లోకి అవి వస్తాయిని చెప్పారు. ఆ భావన ‘ఋతం’.
అసలు ‘ఋతం’ అంటే ఏమిటి? ఇది ప్రకృతిని ఎలా నడిపిస్తోంది?
మన చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. సూర్యుడు తనకిష్టమొచ్చినప్పుడు ఉదయించడు, ఋతువులు మన ప్లానింగ్ ప్రకారం మారవు, వర్షాలు మనం కోరుకున్న ముహూర్తానికే పడవు. నది తన ఇష్టారాజ్యంగా కాకుండా సహజ సిద్ధమైన పల్లం వైపు మాత్రమే ప్రవహిస్తుంది. అంటే ఈ విశ్వానికి, ప్రకృతికి ఒక అంతర్లీనమైన క్రమం ఉంది.
వేద ఋషులు ఈ విశ్వాన్ని లోతుగా పరిశీలించి, సృష్టి అంతా ఒక ప్రాథమికమైన నియమానికి లోబడి “సరిగ్గా నడుస్తోంది” అని గ్రహించారు. ఆ నిశ్శబ్ద నియమాన్నే వారు ‘ఋతం’ అని పిలిచారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే..ఋతం అనేది ఎవరో ఒక దేవుడో లేదా వ్యవస్థో కూర్చొని రాసిన రాజ్యాంగమో, నియమాల పుస్తకమో కాదు. బయటి నుంచి వచ్చిన ఆదేశం అంతకంటే కాదు. ఈ ప్రపంచం తన సహజ స్వభావానికి అనుగుణంగా నడుచుకునే ఒక అంతర్లీన ధర్మం అది. సృష్టిలోని ఈ ప్రకృతి క్రమంలో భాగమైన మనిషి ఆలోచనలు, మాటలు, చేతలు కూడా ఆ విశ్వ క్రమానికి అనుగుణంగా ఉన్నప్పుడే జీవితంలో సంతోషం, శాంతి నిలుస్తాయి చెప్పటమే అంతరార్ధం.
ఋగ్వేదం నిజంగా ఏం చెప్పింది?
ఋగ్వేదంలో ‘ఋతం’ అనే భావన పదేపదే కనిపిస్తుంది. దానికి సంరక్షకుడిగా ముఖ్యంగా వరుణుడు కనిపిస్తాడు. ఆకాశం, జలాలు, విశ్వ క్రమంతో అనుబంధం ఉన్న వరుణుడిని ఉద్దేశించి రాసిన కొన్ని సూక్తులు ప్రాచీన సంస్కృత సాహిత్యంలో అత్యంత అంతర్మథనంతో కూడిన భాగాలుగా కనిపిస్తాయి.
అక్కడ మనిషి తన తప్పును ఒప్పుకుంటాడు. “నేను ఏ తప్పు చేశాను? వరుణుడు నాపై ఎందుకు కోపంగా ఉన్నాడు? తెలిసీ తెలియక నేను ఈ విశ్వ క్రమాన్ని ఎక్కడైనా దాటానా?” అనే ఆందోళన కనిపిస్తుంది.
ఋగ్వేదంలోని 7.86 సూక్తంలో కవి వరుణుడిని నేరుగా ప్రశ్నిస్తాడు. తనపై ఏ తప్పు పడిందో తెలుసుకోవాలని అడుగుతాడు. తన అపరాధం నుంచి తనను విడిపించాలని కోరుకుంటాడు. దూడను తాడుతో కట్టినట్టుగా తనను బంధించిన పాపబంధం నుంచి విడిపించమని ప్రార్థిస్తాడు.
ప్రపంచానికి ఒక అంతర్లీన స్వభావం ఉంది. దానికి విరుద్ధంగా నడిచినప్పుడు కలిగే బాధే ఇక్కడ ప్రధానమైనది. ఆ అంతర్లీన క్రమమే ఋతం.
‘నిజం చెప్పడం’ వేరు.. ‘ఋతం’లో జీవించడం వేరు!
మనం సాధారణంగా “ఋతం అంటే నిజం మాట్లాడటం” అని సరిపెట్టేస్తుంటాం. కానీ నిజానికి అది చాలా చిన్న వివరణ మాత్రమే! నిజం చెప్పడం ఒక పని అయితే, ఋతం అనేది ఒక సమగ్రమైన జీవన స్థితి (Alignment). ఉదాహరణకు, మీ స్నేహితుడు ఒక కొత్త షర్ట్ వేసుకుని “ఎలా ఉంది?” అని అడిగినప్పుడు, మీకు నచ్చకపోయినా అతన్ని సంతోషపెట్టడానికి “చాలా బాగుంది” అనడం ఒక చిన్న అబద్ధం. మరొక సందర్భంలో, మీకు ఒక ఉద్యోగం నచ్చడం లేదని లోపల స్పష్టంగా తెలుసు. కానీ సమాజం దృష్టిలో అది చాలా గొప్ప ఉద్యోగం కావడంతో, బయటకు గొప్పలు చెప్పుకుంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. ఇక్కడ మీరు ఎవరికీ నేరుగా అబద్ధం చెప్పకపోవచ్చు, కానీ మీలోని వాస్తవాన్ని మీరు అంగీకరించడం లేదు. నిజం చెప్పడం అంటే మనకు తెలిసిన విషయానికి అబద్ధాల రంగు పూయకుండా చెప్పడం.
కానీ ఋతం అంటే…మీలోని వాస్తవం, మీ ఆలోచన, మీ మాట, మీ ప్రవర్తన, చివరికి మీ మొత్తం జీవితం ఒకదానికొకటి ఎంతవరకు పొంతన కలిగి ఉన్నాయి అని ప్రశ్నించుకోవడం! మనసులో ఒకటి, మాటలో ఇంకొకటి, చేతల్లో వేరొకటి ఉన్నప్పుడు మనలో అసహజమైన కలత మొదలవుతుంది. ఈ మూడూ ఒకే త్రాటిపైకి వచ్చినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసమే ఋతం.
ఇన్స్టాగ్రామ్, AI, ఫేక్ న్యూస్ యుగంలో ‘ఋతం’ అవసరం ఉందా?
వేల ఏళ్ల నాటి ఈ భావన ఈరోజు సోషల్ మీడియా యుగానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తుంది? అందమైన ప్రయాణాలు, లగ్జరీ కార్లు, కెరీర్ సక్సెస్, గ్రాండ్ పార్టీలు.. ఒకరి జీవితంలో అత్యంత సంతోషకరమైన 5 శాతం క్షణాలు మాత్రమే! ఇవి అబద్ధాలు కాకపోవచ్చు, కానీ ఇది మొత్తం వాస్తవమా అంటే ఖచ్చితంగా కాదు!
ఎదుటివారి జీవితంలోని ఆ చిన్న భాగాన్ని చూసి, అదే వారి మొత్తం జీవితం అనుకుంటే అక్కడ వాస్తవానికి, మన ఊహకు మధ్య పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. “నువ్వు చూస్తున్నది ఒక చిన్న తునక మాత్రమే, దాన్నే పూర్తి నిజంగా భావించకు” అని ఋతం మనల్ని హెచ్చరిస్తుంది.
దీనికితోడు AI, డీప్‌ఫేక్స్, ఫేక్ న్యూస్ రాజ్యం ఏలుతున్న ఈ డిజిటల్ యుగంలో ఒకరు మాట్లాడని మాటలను మాట్లాడించినట్లు, లేని ఫోటోలను ఉన్నట్లు సృష్టించడం చాలా సులువైపోయింది. ఇలాంటి రోజుల్లో “ఏది నిజం? ఏది నిలకడైన వాస్తవం?” అని గుర్తించడమే ఒక పెద్ద సవాలు. “ముందు వాస్తవాన్ని సరిగ్గా తెలుసుకో, ఆపై దానికి అనుగుణంగా జీవించు” అని ఋతం మనకు మార్గదర్శనం చేస్తుంది.
సోషల్ మీడియా జీవితం నుండి అసలైన జీవితం వైపు..
నేటి డిజిటల్ కాలంలో మనం ఇతరుల జీవితాలను చూడటమే కాదు, మన జీవితాన్ని కూడా నిరంతరం ప్రదర్శిస్తున్నాం. పది ఫోటోలు తీసి, ఒకదాన్ని ఎడిట్ చేసి, క్యాప్షన్ రాసి పోస్ట్ చేస్తాం. ప్రపంచానికి చూపించే వర్షన్ ఒకటైతే, లోపల నిజంగా జీవిస్తున్న వర్షన్ మరొకటి అవుతుంది. బయట “Living my best life” అని పెట్టి, లోపల “నా జీవితం ఎటు వెళ్తోందో అర్థం కావట్లేదు” అని కుమిలిపోతుంటారు. ఇలాంటి సమయంలో ఋతం మన ముందు ఒక విస్పష్టమైన అద్దంలా నిలబడుతుంది.
“నువ్వు ప్రపంచానికి ప్రదర్శిస్తున్న జీవితం, నువ్వు నిజంగా జీవిస్తున్న అంతరంగ జీవితానికి ఎంత దగ్గరగా ఉంది?” అని గట్టిగా నిలదీస్తుంది. మన జీవితంలోని సగం సమస్యలు నిజమైన కష్టాల వల్ల రావు, వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం వల్లనే వస్తాయి! ఉద్యోగం నచ్చకపోయినా, బంధం బలహీనపడినా, మనసుకు విశ్రాంతి కావలసి వచ్చినా.. “నాకేం కాలేదు, అంతా బాగుంది” అని మనల్ని మేమే మోసం చేసుకున్నంత కాలం ఆ దూరం పెరుగుతూనే ఉంటుంది. ఆ రాంగ్ అలైన్‌మెంట్‌ను సరిచేసి, వాస్తవంతో రాజీపడటమే ఋతం.
ఋతం పాటిస్తే నిజంగా జీవితం మారిపోతుందా?
ఋతం పాటించగానే ఒక్కసారిగా అద్భుతాలు జరిగిపోవు, చేతిలోకి కోట్లు వచ్చిపడవు, లేదా కష్టాలన్నీ మాయమైపోవు. కానీ మీలో ఒక విపరీతమైన స్పష్టత వస్తుంది! నీకు నచ్చిన భ్రమల కంటే, కంటిముందు ఉన్న నిజమైన పరిస్థితిని చూడటం మొదలుపెడతావు. ఎప్పుడైతే వాస్తవాన్ని అంగీకరిస్తావో, అప్పుడు నీ నిర్ణయాలు, నీ బంధాలు, నీతో నువ్వు మాట్లాడే విధానం పూర్తిగా మారిపోతాయి. మనసులో ఒకటి, మాటలో మరొకటి, జీవితంలో ఇంకొకటి ఉండే ఆ మానసిక నలిగింపు నశిస్తుంది.
నేటి వేగవంతమైన డిజిటల్ ప్రపంచంలో ఋతాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే… “నిజాన్ని మాట్లాడు, అంతటితో ఆగకుండా ముందు నిజాన్ని గమనించు. నీకు నచ్చకపోయినా ఆ వాస్తవాన్ని అంగీకరించు, ఆ నిజానికి తగ్గట్టే నీ మాటలను, చేతలను మార్చుకో.”
ఋతం అనేది ఒక మోటివేషనల్ కోట్ కాదు, ఒక మంత్రం అంతకంటే కాదు. అది ప్రతీ క్షణం నిన్ను మేల్కొలిపే ఒక ప్రశ్న: “నువ్వు నిజంగా ఉన్న ప్రపంచంతో కలిసి జీవిస్తున్నావా? లేక నీ చుట్టూ అల్లుకున్న ఊహా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నావా?” సోషల్ మీడియా ఫిల్టర్ల వెనుక, AI సృష్టించే భ్రమల వెనుక పరుగులు తీస్తున్న ఆధునిక మనిషికి.. వేల ఏళ్ల నాటి వేదాల నుంచి అందుతున్న అత్యంత శక్తివంతమైన మైండ్-ఫుల్నెస్ పాఠం ఇదే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








