ఇలా ఆడితే సంజూ శాంసన్ ఎప్పటికీ ఫెయిల్ కాడు..!
అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తన విధ్వంసకర హాఫ్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించాడు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson). తొలి మ్యాచ్‌లో కేవలం 10 పరుగులకే అవుట్ కావడంతో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టి సంజూను ఆడించడంపై తీవ్ర చర్చ నడిచింది. అయితే, ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించి భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌పై స్పందించిన మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), సంజూ శాంసన్ కెరీర్ లో నిలకడకు సంబంధించి ఒక కీలకమైన సలహా ఇచ్చారు. రెండో టీ20లో సంజూ శాంసన్ అనుసరించిన సంయమన విధానాన్ని గవాస్కర్ ఎంతగానో అభినందించాడు. “ఈ మ్యాచ్‌లో సంజూ మొదట్లోనే బౌండరీలు కొట్టడానికి ప్రయత్నించకుండా, పిచ్‌పై కాసేపు సెట్ అయ్యాడు. ఆ తర్వాతే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఒకవేళ అతను ప్రతి మ్యాచ్‌లోనూ ఇదే వ్యూహాన్ని పాటిస్తే, కెరీర్లో ఎప్పటికీ ఫెయిల్ కాడు. నిలకడగా 50లు, 60లు బాదుతూనే ఉంటాడు” అని గవాస్కర్ విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి
190 లేదా 200 పరుగుల భారీ లక్ష్యాలను ఛేదించేటప్పుడు మాత్రమే మొదటి బంతి నుంచే భారీ షాట్లకు వెళ్లాల్సి ఉంటుందని, సాధారణ సమయాల్లో కాస్త ఆచితూచి ఆడటం సంజూ లాంటి ప్రతిభావంతుడికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సంపాదించింది. గవాస్కర్‌తో పాటు మాజీ క్రికెటర్లు మొహిత్ శర్మ, మహ్మద్ కైఫ్‌లు కూడా సంజూపై ప్రశంసల వర్షం కురిపించారు. “సంజూను తక్కువ అంచనా వేయడంలో మనమంతా చాలా వేగంగా స్పందిస్తాం, కానీ అతను బ్యాటింగ్ చేసిన తీరుతో తనపై జరుగుతున్న చర్చలన్నింటికీ స్వస్తి పలికాడు” అని మొహిత్ శర్మ వ్యాఖ్యానించారు.








