కేసీఆర్ ఆస్తులపై రేవంత్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్!
తెలంగాణ రాజకీయాల్లో భూ వివాదం మరోసారి అగ్గి రాజేసింది. అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు, విచారణ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అబద్ధాల పుట్టగా అభివర్ణించారు. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రదర్శించిన లెక్కలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నటివరకు కేసీఆర్ ఫామ్‌హౌస్ వెయ్యి ఎకరాల్లో విస్తరించి ఉందని దుష్ప్రచారం చేసిన నోటితోనే, ఇప్పుడు కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాల భూమి మాత్రమే ఉందని సీఎం స్వయంగా అంగీకరించడాన్ని ఆయన ఎత్తిచూపారు. గతంలో ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు, బంగారు బాత్రూమ్లు ఉన్నాయంటూ చేసిన ప్రచారంలో ఎంతటి అసత్యం ఉందో, ప్రస్తుత భూముల ఆరోపణల్లోనూ అంతే డొల్లతనం ఉందని కొట్టిపారేశారు.
తమ కుటుంబ ఆస్తుల చరిత్రపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ తండ్రి కాలం నాటి నుంచే వందలాది ఎకరాల వ్యవసాయ భూమి ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ పుట్టినప్పుడే సొంత ఇల్లు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉండేదని, చింతమడకలోని ఆ చారిత్రక నివాసాన్ని సైతం ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి రాసిచ్చిన ఉదారత కేసీఆర్‌ది అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో భవంతులు నిర్మించుకున్న రేవంత్ రెడ్డికి.. మొదటి నుంచీ రైతు కుటుంబంగా ఉన్న కేసీఆర్ వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండటంపై ఎందుకు కడుపుమంట అని ప్రశ్నించారు. “కేసీఆర్‌ను దొర అంటావా? లేక ఈ మధ్యే ఆస్తులు సంపాదించుకున్నాడు అంటావా? ఏదో ఒకటి ముందు ఫిక్స్ అవ్వు” అంటూ సీఎంను నిలదీశారు.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీలో సమర్పించిన భూముల జాబితాపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తమకు ఎలాంటి రక్తసంబంధం, వ్యాపార సంబంధాలు లేని వ్యక్తుల ఆస్తులను కూడా కేసీఆర్ ఖాతాలో కలపడం కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయానికి నిదర్శనమన్నారు. కూకట్‌పల్లికి చెందిన కొండల్ రావు, నవీన్ రావు వంటి వారికి, కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి చుట్టరికం లేకపోయినా, కేవలం ఒకే కులానికి చెందినవారన్న కక్షతో వారి ఆస్తులను కూడా కేసీఆర్ లెక్కల్లో చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల సంతానం దాదాపు 300 మంది ఉంటారని, వారి వ్యక్తిగత ఆస్తులన్నింటినీ మాజీ సీఎం ఖాతాలో జమ చేయడం దిగజడు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు.
తన వ్యక్తిగత సంపాదనపై వస్తున్న విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. అమెరికాలో ఆరున్నరేళ్లు కష్టపడి సంపాదించుకున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు. గోడల మీద పెయింట్లు వేసుకుంటూ ఎదిగిన రేవంత్ రెడ్డి తన బతుకు గురించి మాట్లాడుతుంటే నూటొక్క జిల్లాలు దండం పెట్టాలని వ్యంగ్యంగా అన్నారు. ఏడేళ్లు డిగ్రీ చదివినా కనీస అవగాహన లేకపోవడం రేవంత్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న 67 ఎకరాల భూమి లెక్కను కొత్తగా కనిపెట్టినట్లు రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తమ కుటుంబం 1954 నుంచి చట్టప్రకారమే వ్యవసాయం చేసుకుంటోందని, కేసీఆర్ భూమిని దేవతలా పూజిస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన అబద్ధపు ఆరోపణలను బేషరతుగా వెనక్కి తీసుకుని కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీల మాదిరిగానే, రేవంత్ రెడ్డి భూముల ఆరోపణలు కూడా నీటిమూటలేనని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత ఘర్షణకు దారితీసేలా కనిపిస్తున్నాయి.








