“ఇచ్చట నష్టాలు అమ్మబడును” అమెరికాలో కొత్త Tax Business!
ఒక్కసారి మీరు ఓ విచిత్రమైన షాపు ఊహించుకోండి. బయట పెద్ద బోర్డు ఉంటుంది—“ఇచ్చట నష్టాలు అమ్మబడును.” ఎంత కావాలి? లక్ష నష్టమా? పది లక్షల నష్టామా? లేక కోటి రూపాయల నష్టాలా? అని అడిగితే ఎలా ఉంటుంది? వినడానికి కామెడీగా ఉంది కదా!
నమ్మడానికి వింతగా అనిపించినా, అమెరికాలో బాగా డబ్బున్న పెట్టుబడిదారుల పన్ను భారాన్ని తగ్గించేందుకు ఓ కొత్త మార్గం ఎంచుకున్నారు. అదీ మరీ కొత్త మార్గం అని చెప్పలేం. కానీ ప్రస్తుతానికి కొత్తదే. అది ‘నష్టాలను సృష్టించే’ పెట్టుబడి వ్యూహం. ఇప్పుడు అదే ఒక పెద్ద బిజినెస్‌గా మారుతోంది. కాకపోతే అక్కడ నష్టాలను సంచుల్లో పెట్టి అమ్మరు. పెట్టుబడులను నష్టాలు చూపించేలా డిజైన్ చేస్తారు… ఎవరికి ఎంత కావాలో అంత…అవసరమైనప్పుడు పన్ను లెక్కల్లో ఉపయోగపడేంత నష్టం కనిపించేలా.
“అయ్యా, నాకు లాభాలు బాగానే వచ్చాయి. కానీ టాక్స్ తగ్గించుకోవడానికి నష్టాలు లేవు” అని ఒక మిలియనీర్ అంటే… దానికి కూడా ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ సొల్యూషన్ ఉంది. ఇదే అమెరికాలో వేగంగా పెరుగుతున్న కొత్త Tax Business.
అసలు ధనవంతులకు వచ్చిన సమస్య ఏంటి?
మనకు సాధారణంగా స్టాక్ మార్కెట్ పెరిగితే ఆనందమే. షేర్ల విలువ పెరుగుతుంది. పెట్టుబడి పెడితే డబ్బు పెరుగుతుంది. అంతే కదా? కానీ మీ దగ్గర కోట్లాది డాలర్ల విలువైన షేర్లు ఉంటే లెక్క కొంచెం మారుతుంది.
ఒక టెక్ కంపెనీలో మీరు చాలా ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టారని అనుకుందాం. అప్పట్లో మీ షేర్ల విలువ $10 లక్షలు. ఇప్పుడు ఆ కంపెనీ దూసుకుపోయింది. మీ షేర్ల విలువ $30 లక్షలకు చేరింది. మీకు $20 లక్షల లాభం వచ్చింది. “సూపర్!” అనుకుంటారు. అయితే మీరు ఆ షేర్లను అమ్మి ఆ లాభాన్ని నిజమైన డబ్బుగా మార్చుకోవాలంటే మరో వ్యక్తి మీ పక్కన ప్రత్యక్షమవుతాడు. అతనే Taxman. “లాభం వచ్చిందా? సరే… అందులో నా వాటా ఎంత?” అంటాడు.
అక్కడే సంపన్న పెట్టుబడిదారుల అసలు లెక్క మొదలవుతుంది. ఇక్కడే ‘నష్టం’ విలువ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా పన్ను వ్యవస్థలో ఉన్న ఒక పద్ధతి సంపన్న పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది. పెట్టుబడుల్లో వచ్చిన కొన్ని నష్టాలను, అర్హత ఉన్న పరిస్థితుల్లో, ఇతర పెట్టుబడుల లాభాలతో offset చేసుకోవచ్చు. దీన్నే Tax-Loss Harvesting అంటారు.
పేరు వింటే పెద్ద ఆర్థిక సిద్ధాంతంలా అనిపిస్తుంది. కానీ ఆలోచన మాత్రం చాలా సింపుల్. ఒక పెట్టుబడిలో మీకు $1 లక్ష లాభం వచ్చింది. మరో పెట్టుబడిలో $40 వేల నష్టం వచ్చింది అనుకుందాం. వర్తించే పన్ను నిబంధనల ప్రకారం ఆ నష్టాన్ని లాభానికి వ్యతిరేకంగా ఉపయోగించగలిగితే, పన్ను లెక్క తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇది పెట్టుబడి ప్రపంచంలో తెలిసిన వ్యూహమే.
నష్టాలు దొరకాలి కదా!
మార్కెట్ అంతలా పెరిగితే నష్టాలు ఎక్కడ దొరుకుతాయి?. ఇదే ఈ కథలో అసలు మెలిక. గత కొన్నేళ్లుగా అమెరికా స్టాక్ మార్కెట్ బలంగా పెరిగింది. ముఖ్యంగా టెక్ కంపెనీల షేర్లతో అనేక మంది ఫౌండర్లు, ప్రారంభ ఉద్యోగులు, సంపన్న పెట్టుబడిదారుల సంపద భారీగా పెరిగింది. అంటే వాళ్ల దగ్గర లాభాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే అదే సమయంలో నష్టాల్లో ఉన్న పెట్టుబడులు తక్కువగా ఉన్నాయి.
ఒక సంపన్నుడి దగ్గర ఒకటే పెద్ద టెక్ కంపెనీ షేర్ ఉందనుకోండి. అది విపరీతంగా పెరిగింది. అతని సంపద పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ లాభాల్లో కొంత భాగాన్ని అమ్ముకోవాలంటే పన్ను వస్తుంది.
“ఏదైనా నష్టంలో ఉన్న షేర్ ఉంటే దానితో ఈ లాభాన్ని కొంతవరకు offset చేసుకునేవాడిని” అనుకుంటాడు. కానీ అతని పోర్ట్‌ఫోలియోలో అలాంటి నష్టం లేదు. ఇదే సమస్యను ఒక బిజినెస్ అవకాశంగా ఎవరో చూశారు.
‘నష్టాలు’ కావాలా? ఒక వ్యూహం ఉంది!
ఆ వ్యూహాన్నే Long-Short Tax-Aware Strategy అంటారు. పేరు వింటేనే భయపడాల్సిన పని లేదు. దీన్ని చాలా సింపుల్‌గా చూస్తే… పెట్టుబడిదారుడి డబ్బును కేవలం “షేర్లు పెరుగుతాయా?” అనే ఒక్క ఆలోచనతో పెట్టరు. షేర్లు పెరిగినా, పడిపోయినా పోర్ట్‌ఫోలియో ఎలా పనిచేయాలి? దాంతోపాటు పన్నుల ప్రభావం ఎలా ఉండాలి? అన్నదీ లెక్కలోకి తీసుకుంటారు. వందలాది, కొన్నిసార్లు వేలాది స్టాక్ పొజిషన్లు తీసుకుంటారు.
కొన్ని షేర్లను కొంటారు. కొన్ని షేర్లలో Short Positions తీసుకుంటారు. అంటే కొన్ని షేర్ల ధర పడిపోయినా ఆ కదలిక ద్వారా రాబడి లేదా నష్టం ఏర్పడేలా వ్యూహం రూపొందిస్తారు. దీంతో పోర్ట్‌ఫోలియోలో లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ నష్టాలను, పన్ను నిబంధనలు అనుమతించే మేరకు, ఇతర లాభాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. పెట్టుబడిదారుడి ప్రధాన డబ్బు మార్కెట్లోనే ఉంటుంది. అదే సమయంలో పన్ను లెక్కలకు ఉపయోగపడే నష్టాలను కూడా సృష్టించేలా మరో పొరలో పెట్టుబడి వ్యూహం నడుస్తుంది. అందుకే దీన్ని సాధారణ Tax Saving Trickగా చూడటం కంటే, ఒక ప్రత్యేక Investment Strategyగా చూడాలి.
ఇప్పుడు ఈ బిజినెస్ ఎంత పెద్దదైందంటే…
ఈ స్ట్రాటజీ కొంతమంది ధనవంతులు చేసుకునే చిన్నపాటి పద్ధతి కదా?” అనుకుంటే పొరపాటే. ఈ Long-Short Tax-Aware Strategiesలోకి వచ్చిన మొత్తం ఆస్తులు ఇప్పుడు దాదాపు $200 బిలియన్లకు చేరువలో ఉన్నాయని Forbes కథనం చెబుతోంది.
ఐదేళ్ల క్రితం ఈ రంగంలో ఉన్న ఆస్తులు కొన్ని బిలియన్ డాలర్ల స్థాయిలో మాత్రమే. అంటే చాలా తక్కువ సమయంలోనే ఇది ఒక భారీ ఫైనాన్షియల్ మార్కెట్‌గా మారింది. BlackRock, Nuveen, Franklin Templeton వంటి భారీ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు ఇలాంటి ఉత్పత్తులను ప్రారంభించాయి లేదా పరిశీలిస్తున్నాయి. Two Sigma, WorldQuant వంటి క్వాంట్ సంస్థలు కూడా ఈ రంగంపై దృష్టి పెట్టాయి.
అయితే ‘నష్టాలు అమ్మడం’ నిజంగా ఏంటి?
ఇక్కడ ఒక చిన్న క్లారిటీ అవసరం. ఎవరూ నిజంగా “నష్టాలను” ఒక వస్తువులా అమ్మడం లేదు. పెట్టుబడి వ్యూహాన్ని అలా రూపొందిస్తున్నారు. మీ డబ్బుతో అనేక రకాల స్టాక్ పొజిషన్లు తీసుకుంటారు. వాటిలో కొన్ని లాభాలు ఇవ్వొచ్చు. మరికొన్ని నష్టాలు ఇవ్వొచ్చు. ఆ నష్టాలను పన్ను నిబంధనలు అనుమతించే సందర్భాల్లో Tax-Loss Harvesting కోసం ఉపయోగించుకోవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








