ఇషాన్ కిషన్ టీమిండియా టెస్ట్ రీఎంట్రీ ఖాయం..?
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) డొమెస్టిక్ క్రికెట్లో తన క్లాస్ ఏంటో చూపిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న ఈ 28 ఏళ్ల బ్యాటర్, సంచలన ఆటతీరుతో తన ఫస్ట్-క్లాస్ కెరీర్లోనే మొట్టమొదటి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 270 బంతుల్లోనే 26 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ద్విశతకాన్ని అందుకున్న ఇషాన్.. ఆ తర్వాత మరింత వేగంగా ఆడి తదుపరి 50 పరుగులను కేవలం 31 బంతుల్లోనే బాదేశాడు.
మొత్తంగా 301 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 250 పరుగులు చేసిన తర్వాత తీవ్రమైన కండరాల నొప్పుల (Cramps) కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. ఇషాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించి పట్టు బిగించింది. ఒకవేళ ఇషాన్ కిషన్ కోలుకుని మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి మరో 50 పరుగులు చేస్తే.. దులీప్ ట్రోఫీ ఫైనల్ చరిత్రలోనే ట్రిపుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. గతంలో 1987లో రామన్ లంబా (320), 2001లో గగన్ ఖోడా (300) మాత్రమే ఈ ఘనత సాధించారు.
ప్రస్తుతం ఇషాన్ కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో హర్యానాపై 49 బంతుల్లోనే సెంచరీతో అదరగొట్టిన ఇషాన్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లోనూ 9 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులతో టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన టైటిల్ ఫైట్‌లో 54 పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే జోరును 2026 ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగిస్తూ 15 ఇన్నింగ్స్‌ల్లో 40.13 సగటుతో 6 హాఫ్ సెంచరీలతో కలిపి 602 పరుగులు సాధించాడు.
గతంలో కొన్ని వివాదాలు, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం వంటి ఒడిదొడుకులను ఎదుర్కొన్న ఇషాన్ కిషన్‌కు ఈ 250 పరుగుల ఇన్నింగ్స్ ఒక మైల్‌స్టోన్‌గా నిలవనుంది. సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేయడానికి తహతహలాడుతున్న అతనికి, ఈ పర్ఫార్మెన్స్ సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చినట్లయింది. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా పరుగులు సాధిస్తున్న ఇషాన్ కిషన్‌ను త్వరలోనే జాతీయ టెస్ట్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ క్రీడా వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి.








