‘డ్యూన్ 2’ మేకింగ్ లో AI పాత్ర ఏమిటి? ఆ నీలి కళ్ల వెనుక అసలైన కథ ఇదే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
సినిమా ఆఫీస్ …
కంప్యూటర్ ముందు ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు.
“ఒక ఎడారి చూపించు.” అంతే క్షణాల్లో AI ఎడారి సృష్టిస్తుంది.
“వేల మంది సైన్యాన్ని పంపించు.” అంటే క్షణాల్లో సైన్యం వచ్చేస్తుంది.
“ఈ నటుడి ముఖం మార్చు.” అంతే AI ఒక క్లిక్‌తో మనకు కావాల్సినట్లు మార్చేస్తుంది.
ఇదీ మనం సినిమాల్లో AI గురించి ఊహించుకునే విషయం. AI అనేది బటన్ నొక్కితే సినిమాని క్షణాల్లో తయారు చేసే యంత్రం. కానీ నిజం మాత్రం వేరే ఉంది.ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే… AIకి సినిమా తీయడం ఇంకా నేర్పించ లేదు. ప్రస్తుతం నేర్చుకుంటోంది.
పని నేర్పే ప్రాసెస్ లో దానికి సినిమా పరిశ్రమ ఒక చిన్న పని ఇస్తోంది. మళ్లీ మళ్లీ అదే పని చేయిస్తోంది. అవసరమైతే దాని తప్పులు సరిదిద్దుతోంది. తర్వాత మళ్లీ పని అప్పగిస్తోంది. అంతెందుకు సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘డ్యూన్: పార్ట్ టూ’లో జరిగినది కూడా దాదాపు ఇదే. ఆ సినిమాకు AI పనిచేసింది. అయితే ఏం పని చేసింది?
ఎడారి మధ్య మరో ప్రపంచం
‘డ్యూన్: పార్ట్ టూ’ ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఎందుకంటే రెగ్యులర్ సాదా సీదా సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు.ఎడారితో నిండిపోయిన అరాకిస్ అనే గ్రహం. దాని కోసం పోరాడుతున్న శక్తివంతమైన సామ్రాజ్యాలు. ఎడారిలో జీవించడం నేర్చుకున్న ఫ్రీమెన్ ప్రజలు. వారి మధ్యకు వచ్చిన పాల్ అట్రైడీస్. అతని చుట్టూ తిరిగే అధికారం, ప్రతీకారం, ప్రేమ, యుద్ధం.ఇదంతా ‘డ్యూన్’ ప్రపంచం.ఇంత పెద్ద ప్రపంచాన్ని తెరపైకి తీసుకొచ్చిన దర్శకుడు డెనిస్ విల్నేవ్.
భారీ విజువల్స్‌తో అదిరిపోయేలా, ప్రేక్షకుడిని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో పేరున్న ఆయన, ‘డ్యూన్’ను ఒక భారీ సినీ ఎక్సపీరియన్స్ గా మార్చారు. అందరం ఎంజాయ్ చేసాం. అయితే ఈ ఎడారి ప్రపంచాన్ని వెంటనే గుర్తు చేసే,మన కంటికి వెంటనే పడే ఒక ప్రత్యేకమైన విషయం ఉంది.అదేంటో గుర్తు వచ్చిందా..అవే ఫ్రీమెన్ కళ్ళు.అవి నీలి కళ్లు.
ఫ్రీమెన్ పాత్రల కళ్లలో కనిపించే ప్రత్యేకమైన నీలి రంగు ‘డ్యూన్’ ప్రపంచంలో ముఖ్యమైన గుర్తు. తెరపై అది అందంగా కనిపించడం ,ప్రత్యేకంగా కనిపించింది. అయితే ఒకసారి రెండు సార్లు కానీ ప్రతి షాట్లో ఒకే విధంగా కనిపించేలా చేయడం ఎంత కష్టం.
ఎందుకంటే నటులు కదులుతారు. తల తిప్పుతారు.లైటింగ్ మారుతుంది. కొన్నిసార్లు ముఖాలు నీడలోకి వెళ్తాయి. ఇసుక ఎగురుతుంది. కెమెరా యాంగిల్స్ మారుతాయి. ఈ మార్పులన్నింటి మధ్య కూడా కళ్ల రంగు సహజంగా, ఒకే విధంగా కనిపించాలి.
‘డ్యూన్’ఫస్ట్ పార్ట్ లో ఈ పని ప్రధానంగా VFX ఆర్టిస్ట్ లు చేశారు. కానీ రెండో భాగానికి వచ్చేసరికి పని భారీగా పెరిగింది. ఎందుకంటే ఫ్రీమెన్ పాత్రలు పెరిగాయి. వారి కళ్లపై పని చేయాల్సిన షాట్లు కూడా పెరిగాయి. చివరికి దాదాపు వెయ్యి షాట్లలో ఆ నీలి కళ్లను ఒకేలా ఉంచాల్సి వచ్చింది. అప్పుడు VFX టీమ్ ముందు ఒక సమస్య ఎదురైంది.
ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కి చేసిన పనిని మళ్లీ మొదటి నుంచి చేయాలా? దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే AI కనిపించింది. కానీ AI కు ఆ పని చేతకాదు. దాంతో మొదట AI కు పని నేర్పి, ఫలానా పని చేయాలని చెప్తేనే అది పూర్తి చేస్తుంది.
AIకి ఫస్ట్ పార్టే పాఠ్యపుస్తకమైంది
దర్శక,నిర్మాతలు అప్పుడు AI కే పని అప్పచెప్పాలిని ఫిక్స్ అయ్యారు. అందుకోసం మొదటి ‘డ్యూన్’ సినిమాలో ఆర్టిస్ట్ లు ఇప్పటికే ఫ్రీమెన్ కళ్లపై చేసిన VFX పనిని తీసుకున్నారు. ఒకవైపు అసలు షాట్. మరోవైపు VFX ఆర్టిస్ట్ లు రూపొందించిన సరైన కంటి మ్యాట్. ఈ రెండింటినీ AIకి చూపించారు.
మరింత ఈజీగా చెప్పాలంటే “ఈ షాట్ ఇలా ఉంది.”, “మేం దీన్ని ఇలా సరిచేశాం., “ఇప్పుడు ఈ పద్ధతిని నేర్చుకో.” అలా మొదటి సినిమాలో మనుషులు చేసిన పని… రెండో సినిమాలో AI ట్రైనింగ్‌కు డేటాగా మారింది. దీనికోసం Nukeలోని CopyCat అనే మెషిన్ లెర్నింగ్ టూల్‌ను ఉపయోగించారు.
AIకి కూడా ట్రైనింగ్ అవసరమా, అది సొంతంగా చేయలేదా
AIకి కొన్ని ఉదాహరణలు చూపించగానే అది ప్రతి పరిస్థితిలో సరిగ్గా పనిచేయదు. వెలుతురు మారినప్పుడు.నటుడు వేగంగా కదిలినప్పుడు. కళ్లు పూర్తిగా కనిపించనప్పుడు. ప్రతి షాట్ ఒక కొత్త ఛాలెంజ్ గా మారుతుంది. అందుకే AI చేసిన పనిని మళ్లీ VFX ఆర్టిస్ట్ లు పరిశీలించారు. సమస్య ఉన్న చోట సరిచేశారు. ఆ సరిచేసిన ఉదాహరణలను తిరిగి ట్రైనింగ్ ప్రక్రియలో ఉపయోగించారు. అంటే AI ఒకసారి నేర్చుకుని పని ప్రారంభించలేదు. పని చేస్తూనే మెరుగుపడింది.
AI చేసిన పని ఎంతవరకు ఉపయోగపడింది?
ఈ విధానాన్ని దాదాపు వెయ్యి షాట్లలో ఉపయోగించారు.
అయితే AI చేసిన ప్రతి షాట్ పర్ఫెక్ట్గా ఉండలేదు. అవసరమైన చోట ఆర్టిస్ట్ లు మాన్యువల్‌గా సవరణలు చేశారు. దాదాపు 40 శాతం AI-ట్రైన్డ్ షాట్లకు అదనపు క్లీనప్ అవసరం కాలేదు. అంటే ఆ షాట్లలో AI ఇచ్చిన రిజల్ట్ డైరెక్ట్ గా ఉపయోగించగలిగే స్థాయిలో ఉంది.
అంటే దీన్ని బట్టి అర్దం అయ్యేదేమిటి…AI మనుషుల స్థానాన్ని పూర్తిగా తీసుకోలేదు. నుషులు పదే పదే చేయాల్సిన ఒక ప్రత్యేకమైన పనిని స్పీడుగా చేయగలదు అంతే.
ఫైనల్ గా..
‘డ్యూన్: పార్ట్ టూ’ చూస్తున్న ప్రేక్షకుడుకి ఇవేమీ తెలియకపోవచ్చు. ముఖ్యంగా ఆ కళ్ల వెనుక AI పనిచేసిందని అతనికి తెలియకపోవచ్చు. అదే బహుశా ఈ టెక్నాలజీ సక్సెస్ కి అసలు గుర్తు. AI చేసిన పని ప్రేక్షకుడిని ఆశ్చర్యపరచడానికి కాదు. సినిమా చూస్తున్నప్పుడు అతనికి ఎలాంటి లోపం కనిపించకుండా చేయడానికి. ప్రస్తుతం హాలీవుడ్లో జరుగుతున్న అసలైన AI విప్లవం ఇదే.








