మన మాతృభాషను విదేశాంధ్రుల పిల్లలు నేర్చుకోవాలి.. వాషింగ్టన్ డీసీలో ఈనాడు సంపాదకులు మానుకొండ నాగేశ్వరరావు
అమెరికాలో ఉన్న లక్షలాది తెలుగు కుటుంబాల్లో ఈతరం చిన్నారులకు తెలుగు చదవడం, రాయడం, స్పష్టంగా మాట్లాడడం నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని, భావితరాలకు మాతృభాషను మరింత చేరువ చేయాలనే దృక్పథం అందరిలోనూ పెంపొందాలని ఈనాడు సంపాదకులు మానుకొండ నాగేశ్వరరావు వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
వాషింగ్టన్ డీసీలో మానుకొండ నాగేశ్వరరావుతో తెలుగు భాషాభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. “మాతృభూమి — మాతృభాష — మన బాధ్యత” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, అతిథులు ప్రసంగించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభమైంది. తానా–పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగునాట పత్రికా రంగంలో శిఖర సమానులైన రామోజీరావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాగేశ్వరరావు అన్నారు. పౌరులుగా సమాజాన్ని మరింత చైతన్యవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుకోవడంలో పత్రికా స్వేచ్ఛ, యువతలో ప్రజా చైతన్యం కీలక పాత్ర పోషిస్తాయి. యువత నైపుణ్యాభివృద్ధితో కూడిన ఉపాధి అవకాశాలు, స్వయం సమృద్ధి సాధించే దిశగా దృష్టి సారించాలి” అని నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఏ దేశంలో ఉన్నా వృత్తి, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న తెలుగు వారందరూ తమ పిల్లలకు తప్పనిసరిగా తెలుగు నేర్పించాలని అన్నారు. మాతృభాషను విస్మరించిన ఎన్నో జాతులు చరిత్రలో తమ ప్రత్యేకతను కోల్పోయాయని గుర్తుచేశారు. ఉపాధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ, మన కుటుంబ బంధాలకు, సంస్కృతికి మూలం మాతృభాషేనని పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న తానా పాఠశాలను ఆయన అభినందించారు.
తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, జిడబ్ల్యుటీసిఎస్ అధ్యక్షులు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ ప్రతి సందర్భంలోనూ మన మాతృభాష తెలుగు, తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తమ సంస్థల కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతాయని తెలిపారు. తానా–పాఠశాల వేదికను ప్రతి తెలుగు ఇంటి చిన్నారులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని వివరించారు. మాతృభాష పరిరక్షణ కోసం కట్టుబడి నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. తానా–పాఠశాల అధ్యక్షులు భానుప్రకాష్ మాగులూరి మాట్లాడుతూ…. “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న శ్రీకృష్ణదేవరాయల వారి నానుడిని సార్థకం చేస్తూ, మన ఘన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అది మాతృభాష తెలుగు పరిరక్షణ ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
అనంతరం పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ముఖ్య అతిథి మానుకొండ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. సన్మాన పత్రాన్ని చదివి, వారి జీవితంలోని పలు విశిష్ట పార్శ్వాలను సభికులకు పరిచయం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఒక చక్కని, ఆలోచనాత్మక సమావేశంలో పాల్గొన్నామనే తృప్తి కలిగిందని తానా కల్చరల్ కోఆర్డినేటర్ సాయిసుధ పాలడుగు, పారుపల్లి కోదండరామయ్య, సీతారామారావు ఎండూరి, తదితర సభికులు అభిప్రాయపడ్డారు. మాతృభాష తెలుగు ఆవశ్యకతను, దాని పరిరక్షణ బాధ్యతను ప్రతి తెలుగు ఇంటికీ తీసుకెళ్లాలని, ఈ దిశగా తమవంతు కృషి చేస్తామని వచ్చినవారందరూ ప్రతిజ్ఞ చేశారు.









