అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ మహిళలకు షాక్.. ట్రంప్ ప్రభుత్వం మరో ట్విస్ట్!
ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా వచ్చినప్పటి నుంచి అక్కడి వీసా వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఒక రూల్‌పై టెన్షన్ మొదలవుతుందో లేదో… అంతలోనే ఇంకో కొత్త నిర్ణయం తెరపైకి వస్తోంది.
ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు అయితే, ఈసారి ఇంకేం కొత్తగా మార్చబోతున్నారు?” అన్న భయం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే H-1B వీసాపై వరుసగా కఠిన నిర్ణయాలు తీసుకొస్తున్న ట్రంప్ ప్రభుత్వం… ఇప్పుడు మరో ట్విస్ట్ ఇవ్వబోతోందన్న వార్త బయటకు వచ్చింది.
అయితే ఈసారి మాత్రం టార్గెట్ ఉద్యోగులు కాదు… వాళ్లతో కలిసి అమెరికా వెళ్లిన జీవిత భాగస్వాములు! అవును..నిజం.
ఇంతకాలం అమెరికాలో ఉండటమే కాదు, తమకంటూ ఉద్యోగం సంపాదించుకుని కెరీర్‌ను మళ్లీ మొదలుపెట్టిన వేలాది మంది మహిళల జీవితాల్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది.
“అమెరికాలో ఉండొచ్చు… కానీ ఉద్యోగం మాత్రం చేయకూడదు!”
ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకురావాలని చూస్తున్న మార్పు ఇదే అయితే… దీని దెబ్బ ఎక్కువగా తగిలేది ఎవరికి తెలుసా? భారతీయులకే… అందులోనూ ఎక్కువగా భారతీయ మహిళలకే!
అసలు ఏం జరుగుతోంది? ట్రంప్ ప్రభుత్వం ఏం మార్చాలనుకుంటోంది?
అమెరికాలో H-1B వీసాపై ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు H-4 వీసా ఇస్తారు. దీంతో వారు అమెరికాలో కలిసి ఉండవచ్చు. కానీ H-4 వీసా ఉన్నంత మాత్రాన ఉద్యోగం చేయలేరు. కొన్ని ప్రత్యేక అర్హతలు ఉన్న జీవిత భాగస్వాములకు మాత్రం EAD అనే ఉద్యోగ అనుమతి ఇస్తారు. దీని ద్వారా వారు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయవచ్చు. ఇప్పుడు ఈ అవకాశాన్నే తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
అంటే… అమెరికాలో ఉండటానికి అనుమతి ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఇదే ఇప్పుడు వేలాది కుటుంబాలను టెన్షన్లో పడేస్తోంది.
భారతీయ మహిళలకే ఎందుకు పెద్ద దెబ్బ?
ఈ ప్రతిపాదనలో భారతీయుల పేరు ఎక్కువగా వినిపించడానికి కారణం ఒకటే. 2014 నుంచి 2017 మధ్య H-4 EADకు ఆమోదం పొందిన వారిలో 93 శాతం మంది భారతీయులు కావటం . వారిలో 94 శాతం మంది మహిళలు . అంటే ఈ ఉద్యోగ అనుమతి రద్దయితే దాని ప్రభావం ఎక్కువగా భారతీయ మహిళలపైనే పడే అవకాశం ఉంది. అందుకే ఈ వార్త అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబాల్లో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. కేవలం నెల జీతం ఆగిపోవడం కాదు. ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న కెరీర్‌కు బ్రేక్ పడటం.
“భర్త సంపాదిస్తున్నాడుగా… ఇంకేం సమస్య?”
ఇది బయటివాళ్లకు చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ అమెరికాలో జీవితం అలా ఉండదు. ఇద్దరి సంపాదనను బట్టి చాలా కుటుంబాలు ఇంటి అద్దె, హోమ్ లోన్, పిల్లల చదువు, ఇతర ఖర్చులను ప్లాన్ చేసుకుంటాయి. ఒక్కరి ఆదాయం తగ్గితే కుటుంబ బడ్జెట్ మొత్తం మారిపోవచ్చు. అంతకంటే ముఖ్యంగా, ఒక మహిళకు ఉద్యోగం అంటే కేవలం జీతం కాదు. అది ఆమె చదువుకు విలువ. ఆమె కెరీర్. ఆమె ఆర్థిక స్వాతంత్ర్యం. ఆమెకంటూ ఒక గుర్తింపు. అందుకే ఈ ప్రతిపాదనపై ఆందోళన అంత ఎక్కువగా ఉంది.
తెలుగు కుటుంబాలకు కూడా ఇది ఎందుకు దగ్గరి విషయం?
అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మన బంధువుల్లోనో, స్నేహితుల్లోనో, తెలిసిన వాళ్లలోనో అమెరికాలో H-1B వీసాపై పనిచేసే కుటుంబం ఉండటం ఇప్పుడు చాలా సాధారణం. అందుకే ఇది మనకు సంబంధం లేని అమెరికా వార్త కాదు.
భర్త H-1Bపై ఉద్యోగం చేస్తూ, భార్య కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు ఈ మార్పు నేరుగా సంబంధించిన అంశం.
ఇప్పుడే ఉద్యోగాలు పోతాయా?
అలాంటిదేం లేదు. ప్రస్తుతానికి ఎవరి ఉద్యోగం వెంటనే పోదు. ఇది ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ ప్రతిపాదన మాత్రమే. దీనిపై అధికారిక నిబంధన రావాలి. తర్వాత ప్రజల అభిప్రాయాలు తీసుకునే ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న H-4 EADతో ఉద్యోగం చేస్తున్నవారు ఇప్పటికైతే తమ ఉద్యోగాలను కొనసాగించవచ్చు.
ఇలాంటి ప్రయత్నం గతంలో కూడా జరిగింది!
ఇది ట్రంప్ ప్రభుత్వం మొదటిసారి చేస్తున్న ప్రయత్నం కాదు. ట్రంప్ గత అధ్యక్ష పదవీకాలంలో కూడా H-4 జీవిత భాగస్వాముల ఉద్యోగ అనుమతిని తొలగించాలని ప్రయత్నించారు. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. చివరకు ఆ ప్రతిపాదనను 2021లో వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే విషయం తెరపైకి రావడంతో పాత టెన్షన్ తిరిగి మొదలైంది.
ఫైనల్ గా …
ఈ ప్రతిపాదన భారతీయ మహిళల్లో ఎందుకు ఇంత ఆందోళన కలిగిస్తోందో అర్థం చేసుకోవడం కష్టం కాదు. ఎందుకంటే వాళ్లు అమెరికాకు కేవలం ఎవరికో భార్యగా, కుటుంబ సభ్యురాలిగా వెళ్లలేదు. అక్కడికి వెళ్లి మళ్లీ చదువుకున్నారు. ఉద్యోగాలు వెతుక్కున్నారు. కొత్త దేశంలో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు. ఏళ్ల తరబడి కష్టపడి తమ కెరీర్‌ను నిలబెట్టుకున్నారు.
ఇప్పుడు ఆ కెరీర్ కొనసాగుతుందా లేదా అన్నది… వాళ్ల ప్రతిభ, వాళ్ల పని, వాళ్ల నిర్ణయం మీద కాకుండా ఒక వీసా నిబంధనపై ఆధారపడే పరిస్థితి రావచ్చు. అదే అసలు భయం.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








