నెల్లూరు పాలిటిక్స్‌లో సెగలు.. ఎంపీకి, ప్రసన్నకుమార్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్..!
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) నేతల మధ్య మాటల యుద్ధం మరియు ఆధిపత్య పోరు ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. ముఖ్యంగా జిల్లాలో సాగుతున్న క్వార్ట్జ్ మైనింగ్ వివాదం మరియు అంతర్గత రాజకీయ విభేదాల నేపథ్యంలో, వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని(Vemireddy Prabhakar Reddy) టార్గెట్ చేస్తూ అత్యంత ఘాటు వ్యాఖ్యలతో సవాల్ విసిరారు.
“ప్రభాకర్ రెడ్డి.. నువ్వు నిజంగా మొగోడివైతే వెనక ఉండి రాజకీయం చేయడం ఆపి, నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు” అంటూ బహిరంగంగా సవాల్ చేశారు. తనపై లేదా వైఎస్సార్సీపీ నేతలపై ఎలాంటి ఆరోపణలు చేయాలన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు. మీ ఇంట్లో బాత్రూమ్లు కడిగే వాళ్లతోనో, సమాజంలో తిరిగే బ్రోకర్ గాళ్లతోనో ప్రెస్ మీట్లు పెట్టించి మాపై మాట్లాడించడం నీకు పద్ధతి కాదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెరవెనుక ఉండి ఇతరుల ద్వారా ఇంటర్వ్యూలు ఇప్పించే దొంగచాటు రాజకీయాలు మానుకొని ధైర్యంగా తలపడాలని ఆయన హితవు పలికారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి, వైస్సార్సీపీ కీలక నేత అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తావనను నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గట్టిగా లేవనెత్తారు. “నీకు అనిల్ కుమార్ యాదవ్ అంటే ఎందుకంత భయం? ఆయన పేరు వింటేనే ఎందుకు వణికిపోతున్నావు?” అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అనిల్ కుమార్ యాదవ్ గతంలో మైనింగ్ వ్యవహారాలపై సంధించిన ప్రశ్నలకు, చేసిన విమర్శలకు చేతనైతే మీడియా ముందుకు వచ్చి నేరుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆర్థిక, మైనింగ్ మరియు రాజకీయ అక్రమాలకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమయం వచ్చినప్పుడు వాటన్నింటినీ ఆధారాలతో సహా ప్రజల ముందు బయటపెడతామని, మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులపై వైఎస్సార్సీపీ నేతలు చేసిన విమర్శలు, ఆ తర్వాత జరిగిన దాడుల నేపథ్యంలో ఈ తాజా కౌంటర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.








