అన్ని రంగాల్లో మంగళగిరి నెం.1గా ఉండాలనేది లక్ష్యం : మంత్రి లోకేష్
ఇళ్ల పట్టాల పంపిణీ విజయవంతానికి కృషిచేసిన అధికారులకు ధన్యవాదాలు
కలిసికట్టుగా పనిచేస్తే చేస్తే ఏదైనా సాధించగలుగుతాం
భవిష్యత్ లోనూ అధికారుల సహకారం ఉండాలని ఆశిస్తున్నా
ఇళ్ల పట్టాల పంపిణీలో భాగస్వాములైన సిబ్బందితో మంత్రి లోకేష్ ఆత్మీయ విందు సమావేశం
నూతన వస్త్రాలు బహూకరించి ఘనంగా సత్కారం
ఉండవల్లి: అన్ని రంగాల్లో మంగళగిరి నెం.1గా ఉండాలనేది లక్ష్యమని, ఇందుకు అధికారుల సహకారం కావాలని నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన అధికారులు, ఎంటీఎంసీ, రెవెన్యూ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసం వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికలో ఆత్మీయ విందు సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన అధికారులకు మంగళగిరి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేను మంగళగిరిలో పుట్టలేదు, మంగళగిరిలో పెరగలేదు. 2019లో మంగళగిరిని నా సొంతం చేసుకున్నా. ఎన్నికలకు 21 రోజుల ముందు వచ్చాను. నేనేంటో ప్రజలకు అర్థం కాలేదు. ప్రజల సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. ఇంటి పట్టా హామీ ఇస్తే గెలుస్తానని చాలా మంది నాయకులు చెప్పారు. సమస్యను అర్థం చేసుకోకుండా హామీ ఇవ్వలేనని చెప్పా. హామీ ఇస్తే నిలబెట్టుకోవడం నాకున్న అలవాటు. ఫలితంగా 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఐదేళ్లు ప్రజలతో కలిసి ప్రయాణించా. వారి సమస్యలు నేరుగా అర్థం చేసుకున్నా. అందులో ప్రధాన సమస్య శాశ్వత ఇంటి పట్టాల పంపిణి. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత భూహక్కు కల్పించాలని ఇక్కడి ప్రజలు కోరారు. శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తామని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చా. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. 91వేల మెజార్టీతో మంగళగిరి ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని పరిగెత్తించాను.
కలిసికట్టుగా పనిచేస్తే చేస్తే ఏదైనా సాధించగలుగుతాం
నీతి, నిజాతీయలతో మీరు ప్రజల వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఆ డేటాతో రెండు విడతల్లో మంగళగిరి ప్రజలకు శాశ్వత ఇంటి పట్టాలు అందించాం. సుమారు 6వేల కుటుంబాలకు అందరం కలిసికట్టుగా న్యాయం చేశాం. ఇదొక చరిత్ర. పట్టాల పంపిణీని ఏవిధంగా చేశారని అనేక మంది ప్రజాప్రతినిధులు నన్ను అడిగారు. మంగళగిరికి వచ్చి చూడాలని చెప్పాను. నేను బలంగా నమ్మేది టీమ్ వర్క్ ని. కలిసికట్టుగా పనిచేస్తే చేస్తే ఏదైనా సాధించగలుగుతాం.
మంగళగిరి ప్రజల తరపున అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా
దేశం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చా. ప్రభుత్వం నుంచి పైసా తీసుకోకుండా నిడమర్రు పాఠశాలను అభివృద్ధి చేశాం. పార్క్ లు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ సెంటర్లు అభివృద్ధి చేస్తున్నాం. అంగన్వాడీ సెంటర్ల ఆధునీకరణ, పీఎం సూర్యఘర్ కింద కార్యక్రమాలు చేస్తున్నాం. సమిష్టిగా పనిచేస్తే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో ఇదో ఉదాహరణ. భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభించాం. తాగునీటి పైప్ లైన్ కార్యక్రమం చేపడుతున్నాం. ఏ పని చేసినా పట్టుదల, అంకితభావంతో చేస్తున్నాం. అందరూ సహకరిస్తున్నారు కనుకనే మనం చరిత్ర సృష్టించగలుగుతున్నాం. ఇది ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు. టీమ్ తో సాధ్యం. అందుకే మిమ్మల్నందరినీ కలిసి గౌరవించాలని భావించా. మీరు చేసిన మంచి పనికి మిమ్మల్ని కలిసి గౌరవించడం జరుగుతోంది. మనందరం కలిసి మరో వందడుగులు ముందుకు వేయాలి. మంగళగిరి ప్రజల తరపున ఇక్కడున్న అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ కృషి వల్ల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతం అయింది. అన్ని రంగాల్లో మంగళగిరి నెం.1గా ఉండాలనేది లక్ష్యం. ఇటీవల మోడల్ రైతు బజార్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశాం. భవిష్యత్ లోనూ మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అనంతరం అధికారులు, ఎంటీఎంసీ, రెవెన్యూ సిబ్బందికి నూతన వస్త్రాలు బహూకరించి మంత్రి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ కే.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఈ-సెక్షన్ సూపరింటెండెంట్ రవి కుమార్, మంగళగిరి తహశీల్దార్ కే.దినేష్ రాఘవేంద్ర, తాడేపల్లి తహశీల్దార్ ఎం.శ్రావణ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ పి.శ్రీనివాసరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ కే.అశోక్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జీ.వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎం.అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








