టీడీపీ ఎంపీకి చైనాతో లింకులు: అనిల్ కుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు..!
నెల్లూరు జిల్లాలో మైనింగ్ రంగానికి సంబంధించిన వ్యవహారాల్లో విదేశీ వ్యాపారుల ప్రమేయం, క్వార్ట్జ్ వ్యాపారం, మైనింగ్ లీజులు, స్థానిక ఎక్స్‌పోర్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చైనా వ్యాపారులతో ఉన్న సంబంధాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంబంధిత పత్రాలు, లేఖలు, వీసా వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను మీడియా ముందుంచారు.
తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం, సంబంధిత ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో మైనింగ్ రంగాన్ని కొంతమంది వ్యక్తులు, సంస్థలు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మైనింగ్‌పై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు, చిన్న వ్యాపారులు, స్థానిక ఎక్స్‌పోర్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చైనా వ్యాపారుల ప్రమేయంతో మైనింగ్ వ్యాపారంలో ఒక సిండికేట్ ఏర్పడుతోందన్న ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసారు.
ఈ వ్యవహారంలో నెల్లూరు(Nellore) ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తులు, సంస్థలు తమ వివరణను ప్రజల ముందు ఉంచాలన్నారు. క్వార్ట్జ్ సిండికేట్‌కు సంబంధించిన కార్యాలయంగా పేర్కొంటున్న ఫ్లాట్ నంబర్ 101 వ్యవహారాన్ని అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ కార్యాలయంపై ప్రశ్నలు, ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఫర్నిచర్‌ను హుటాహుటిన ఊటుకూరుకు తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని అనీల్ కుమార్ యాదవ్ నిలదీశారు.
అక్కడ ఏ కార్యకలాపాలు జరిగాయి? ఎవరెవరు ఆ కార్యాలయానికి వచ్చేవారు? అక్కడ నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు ఏమిటి? ఫర్నిచర్‌ను ఎందుకు తరలించారు? వంటి ప్రశ్నలకు సంబంధిత వ్యక్తులు, అధికారులు సమాధానం చెప్పాలని అనీల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. 50 ఏళ్లకు పైబడిన మైన్స్ లీజులు, వాటి రివిజన్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలపై కూడా అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నలు లేవనెత్తారు. మైనింగ్ లీజులకు సంబంధించిన నిబంధనలు, రివిజన్లు, వాటిపై తీసుకున్న నిర్ణయాలు, సంబంధిత వ్యక్తులకు కలిగిన ప్రయోజనాలపై సమగ్రంగా విచారణ జరగాలని కోరారు.








