వైసీపీ తీరు కుక్క తోక వంకర.. సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..!
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ‘పేదల సేవలో’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయింది సరిగ్గా ఇదే రోజు. నాటి నుండి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలకు నాంది పలికాం, ఎన్నో ప్రజాచైతన్య కార్యక్రమాలను తీసుకొచ్చాం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలుగా మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీకు ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను” అంటూ చంద్రబాబు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే వేదికపై నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) విమర్శలు, రాజకీయంపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని విధంగా భారీ నష్టం జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. ఆ విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు, అభివృద్ధి పథంలో నడిపించేందుకే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మరియు బీజేపీతో కలిసి తాము కూటమిగా ఏర్పడ్డామని గుర్తు చేశారు. ప్రస్తుతం మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేస్తుంటే.. వైసీపీ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు అనవసర విమర్శలు చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. “కుక్క తోక వంకర అన్నట్లుగా వైసీపీ నేతల తీరు కూడా మార్పు లేకుండా అలాగే ఉంది. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ‘డీఎస్సీ-2025’ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. కానీ నిరుద్యోగులకు మేలు జరుగుతుంటే ఓర్వలేక ఈ డీఎస్సీపై వందల కొద్దీ కోర్టు కేసులు వేశారు. కష్టపడి రాత్రింబగళ్లు చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను వైసీపీ నేతలు దారుణంగా అవమానిస్తున్నారు” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.








