టీమిండియా మిడిలార్డర్లో మార్పులు.. గంభీర్, గిల్ కొత్త వ్యూహం..!
2027 వన్డే ప్రపంచకప్(World Cup) టార్గెట్‌గా భారత క్రికెట్ జట్టు ప్రక్షాళనకు ముహూర్తం ఖరారైంది. ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ల నేతృత్వంలో సరికొత్త వన్డే సెటప్‌ను సిద్ధం చేసేందుకు సెలెక్టర్లు కసరత్తులు ప్రారంభించారు. ఈ క్రమంలో మిడిలార్డర్లో స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు(Shreyas Iyer) ప్రత్యామ్నాయంగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మను ప్రధాన ఎంపికగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఒత్తిడిలోనూ అద్భుతమైన బ్యాటింగ్ చేయగలగడం, అవసరమైనప్పుడు బౌలింగ్‌లోనూ నాలుగైదు ఓవర్లు వేసి ఆల్‌రౌండ్ సపోర్ట్ ఇవ్వగలగడం తిలక్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారింది.
గత కొద్దికాలంగా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆల్‌రౌండర్లు తరచూ గాయాల బారిన పడుతుండటంతో.. జట్టు సమతుల్యతను కాపాడేందుకు టాప్ లేదా మిడిలార్డర్లో బౌలింగ్ చేయగల నమ్మకమైన బ్యాటర్ కోసం మేనేజ్మెంట్ అన్వేషిస్తోంది. మరోవైపు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో(Virat Kohli) పాటు కేఎల్ రాహుల్ కూడా తదుపరి ప్రపంచకప్ నాటికి వయసు రీత్యా గాయాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. పైగా ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ ఇటీవలి కాలంలో పేస్, బౌన్స్‌లను ఎదుర్కొనే విషయంలో ఇంకా పూర్తిస్థాయిలో పరీక్షించబడలేదు.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా లాంటి పిచ్‌లపై ఉపయోగపడేలా, ఇప్పటి నుంచే యువ బ్యాకప్ ఆటగాళ్లను సన్నద్ధం చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. వచ్చే అక్టోబర్‌లో జరగబోయే న్యూజిలాండ్ ఐదు వన్డేల సిరీస్ నుంచి ఈ ప్రపంచకప్ రోడ్‌మ్యాప్ ప్రణాళికలు మరింత వేగవంతం కానున్నాయి. అంతకంటే ముందు సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్నప్పటికీ.. అదే సమయంలో జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పూర్తి స్థాయి టీ20 జట్టు పాల్గొనాల్సి ఉండటంతో పలువురు సీనియర్లకు ఈ సిరీస్ నుండి విశ్రాంతి లభించే అవకాశం ఉంది. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఫీల్డింగ్ ప్రమాణాలు, ఫిట్నెస్ను మెరుగుపరిచేందుకు యువ రక్తాన్ని జట్టులోకి తీసుకురావాలన్న కోచ్ గంభీర్ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.








