కృష్ణ చైతన్యంతోనే ప్రపంచంలో శాంతి సాధ్యం: మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, నిరాశ్రయులకు స్వయంగా ఆహారాన్ని అందిస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచంలో పెరుగుతున్న విభేదాలు, ఘర్షణలను రూపుమాపి అందరినీ ఏకం చేసే అద్భుత శక్తి ఒక్క కృష్ణ చైతన్యానికే ఉందని ఉద్ఘాటించారు. మనుషుల మధ్య ఎన్ని తేడాలు ఉన్నా, అంతిమంగా అంతా కృష్ణమయమనే భావన ప్రతి ఒక్కరి హృదయంలో నిండినప్పుడే ప్రపంచం స్వర్గధామంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల పర్యటనలో భాగంగా న్యూయార్క్ చేరుకున్న ఆయన.. మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగనున్న ‘యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్’ వేడుకలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. బహుళ సంస్కృతులు, భిన్న మతాల కలయికగా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంపై కొందరు నిరసనలు తెలుపుతున్నప్పటికీ, వసుధైవ కుటుంబకం అనే భారతీయ సనాతన సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే తమ ముఖ్య ఉద్దేశమని ఈ వేడుకకు హాజరవుతున్న ఆధ్యాత్మిక గురువు ఆచార్య మహామండలేశ్వర్ శ్రీ స్వామి అవధేశానంద గిరి జీ మహారాజ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో హిందూ అమెరికన్ ఫౌండేషన్ భద్రతాపరమైన సూచనలను జారీ చేసింది.








