రాబర్ట్ డి నీరో ‘ది విస్పర్ మ్యాన్’ రివ్యూ
— సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్: 2.75/5
సీరియల్ కిల్లర్ కథలు హాలీవుడ్ సినిమాలకు కొత్తేమీ కాదు. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేసే కిల్లర్, పోలీసులను ఛాలెంజ్ చేసే మైండ్ గేమ్స్, గతంలో జరిగిన నేరాలకు సంబంధించిన కొత్త కేసులు.. ఇవన్నీ ఎన్నో సినిమాల్లో చూసేశాం. అలాంటప్పుడు అదే జానర్ లో మరో సినిమా వస్తే.. “ఇందులో కొత్తగా ఏం ఉంది?” అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అలెక్స్ నార్త్ రాసిన 2019 బెస్ట్ సెల్లర్ నవల ఆధారంగా జేమ్స్ యాష్క్రాఫ్ట్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా కొత్త అని చెప్పలేం కానీ కొన్ని కొత్త ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. వాటితో ‘ది విస్పర్ మ్యాన్’ నిజంగానే ఒక మంచి థ్రిల్లర్‌గా నిలిచిందా? లేక భారీ తారాగణం ఉన్నా సగటు నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ మూవీగానే మిగిలిపోయిందా?
కథ
టామ్ కెన్నెడీ ( ఆడమ్ స్కాట్) ఒక పేరున్న క్రైమ్ రచయిత. భార్య మరణించిన తర్వాత ఆ బాధ నుంచి బయిటపుడూ, తన ఎనిమిదేళ్ల కొడుకు జేక్తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నిస్తుంటాడు.అయితే జీవితం అతనికి మరో సవాల్ విసురుతుంది. అతని జీవితంలో మరో పెద్ద విషాదం ఎదురవుతుంది. ఓ రోజు అనుకోకుండా జేక్ కనిపించకుండా పోతాడు.
టామ్ పోలీసుల దగ్గరకు వెళ్తారు. కానీ ఈ కిడ్నాప్ వెనుక ఉన్న ఆనవాళ్లు ఒక పాత కేసు వైపు చూపిస్తాయి. ఎన్నో ఏళ్ల క్రితం పిల్లలను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఒక సీరియల్ కిల్లర్ పేరు ‘విస్పర్ మ్యాన్’ ని గుర్తు చేస్తాయి. అతన్ని పట్టుకున్న మాజీ పోలీస్ అధికారి పీట్ విల్లిస్ (రాబర్ట్ డి నీరో) ఇప్పుడు రిటైర్ అయిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఈ పాత కేసు మళ్లీ తెరపైకి రావడంతో టామ్ తన తండ్రి పీట్ విల్లిస్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడే కథలో మరో పొర మొదలవుతుంది. ఒకవైపు కనిపించకుండా పోయిన పిల్లాడిని వెతికే దర్యాప్తు.. మరోవైపు తండ్రి-కొడుకుల మధ్య ఏళ్లుగా పేరుకుపోయిన కోపం, బాధ ని బయిటకు తెస్తాయి. ఇప్పుడు పీట్ విల్లీస్ తన మనవడుని రక్షించటానికి రంగంలోకి దిగుతాడు.
ఇప్పుడు పీట్ విల్లీస్ ఆలోచించేది ఒకటే..అసలు పాత కిల్లర్ మళ్లీ రంగంలోకి వచ్చాడా? లేక అతని పద్ధతిని అనుసరిస్తున్న మరొకరు ఉన్నారా? ఈ ప్రశ్నల చుట్టూనే కథ తిరుగుతుంది. చివరకు ఏం తేలింది…కొత్త హంతకుడా..పాత కిల్లరా మళ్లీ సీన్ లోకి వచ్చారా…ఎలా పీట్ విల్లీస్ ఈ కేసు ఛేదించాడు అనేది మిగతా కథ.
ఎనాలిసిస్
ఈ సినిమా చూస్తూంటే మనకు జైలర్ సినిమా గుర్తు వస్తుంది. రిటైర్ అయిన రజనీ మళ్లీ సీన్ లోకి రావటం, విలన్స్ ని భయపెట్టడం వంటివి గుర్తు వస్తాయి.అలాగే ‘ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’, ‘సెవెన్’ తరహా పాత క్రైమ్ థ్రిల్లర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు “ఇది ఇంతకుముందు ఎక్కడో చూశామే” అనే ఫీలింగ్ వస్తుంది.
ఈ సినిమా స్క్రీన్‌ప్లేలో ప్రధానంగా రెండు ట్రాక్‌లు కనిపిస్తాయి. ఒకటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్. రెండోది తండ్రి-కొడుకుల మధ్య భావోద్వేగ సంఘర్షణ.
ఫస్టాఫ్ లో సినిమా మిస్టరీని బాగానే సెట్ చేస్తుంది. పిల్లల అదృశ్యం, పాత కిల్లర్ కథ, రిటైర్డ్ పోలీస్ అధికారి గతం.. ఇలా ఒక్కో అంశాన్ని పరిచయం చేస్తూ ఆసక్తి పెంచుతుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ కొన్ని విషయాలు ప్రేక్షకులకు ముందుగానే అర్థమయ్యే అయ్యిపోతూంటాయి. కొన్ని ట్విస్టులు కూడా పూర్తిగా షాక్ ఇచ్చే స్థాయిలో ఉండవు.ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనం గతంలో బోలెడు చూసి ఉండి ఉంటాం. ఇదే సినిమాకు ఉన్న ప్రధాన బలహీనత.
అలాగే స్క్రిప్ట్‌లో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే.. విలన్‌ను వెతికే కథ కంటే “ఒక తండ్రి తన కొడుకును ఎంతవరకు కాపాడుకోగలడు?” అనే ప్రశ్నకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. స్క్రీన్ ప్లే లో …పాత కేసు, కొత్త కిడ్నాప్, తండ్రి-కొడుకుల మధ్య దూరం, సీరియల్ కిల్లర్ ప్రభావం.. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిపే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని పాత్రలకు మరింత డెప్త్ ఇచ్చి ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేది. కొన్ని సబ్ప్లాట్లు ప్రధాన కథకు పెద్దగా ఉపయోగపడకుండా కొంత గందరగోళాన్ని తీసుకొచ్చాయి.
అంటే స్క్రిప్ట్ బ్యాడ్ అని కాదు. కానీ ఈ స్టోరీ కు ఉన్న స్పాన్ కు సరపడే గొప్ప డ్రామాగా లేదు.
హైలైట్స్
రాబర్ట్ డి నీరో ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆయన పాత్ర పెద్దగా అరుస్తూ, హడావుడి చేస్తూ ఉండదు. చాలా సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఆ నిశ్శబ్దంలోనే పాత్రకు సంబంధించిన బాధ, పశ్చాత్తాపం కనిపిస్తాయి. ఆడమ్ స్కాట్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కొడుకును కోల్పోయిన తండ్రి ఆందోళనను అతను బాగా చూపించాడు.
మరో పెద్ద హైలైట్ మైఖేల్ కీటన్. జైలులో ఉన్న సీరియల్ కిల్లర్‌గా అతని ఉనికి సినిమాలో ఒక ప్రత్యేకమైన టెన్షన్ తీసుకొస్తుంది. ఇక తండ్రి-కొడుకుల సంబంధాన్ని క్రైమ్ కథతో కలపడం కూడా బాగుంది.
మైనస్‌లు
ప్రెష్ గా కొత్త తరహా సినిమా చూస్తున్నట్లు అనిపించదు
ట్విస్టులు కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో లేవు.
టెక్నికల్ విశ్లేషణ
దర్శకుడు జేమ్స్ యాష్క్రాఫ్ట్ సినిమా వాతావరణాన్ని బాగానే క్రియేట్ చేశారు. చీకటి ఇళ్లు, ఖాళీ ప్రదేశాలు, పిల్లల అదృశ్యం, జైలు సన్నివేశాలు.. వీటన్నింటినీ ఉపయోగించి విజువల్ గా కాస్త డిస్ట్రబ్ చేసే వాతావరణాన్ని సృష్టించారు.
కెమెరా వర్క్‌లో కూడా థ్రిల్లర్‌కు సరిపోయే మూడ్ కనిపిస్తుంది. అయితే 90ల క్రైమ్ సినిమాల స్థాయి విజువల్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నించినప్పటికీ, విజువల్స్ కొంత ఫ్లాట్‌గా అనిపిస్తాయి. ఎడిటింగ్ మాత్రం సినిమాకు ప్లస్. కథ ఎక్కువగా సాగదీయకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లారు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా టెన్షన్‌ను పెంచే విధంగా ఉంది. ముఖ్యంగా కిల్లర్‌కు సంబంధించిన సన్నివేశాల్లో సౌండ్ డిజైన్ మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది.
నటీనటుల నటన
రాబర్ట్ డి నీరో అదరకొట్టారు. పీట్ విల్లిస్ పాత్రలో రాబర్ట్ డి నీరో సినిమాకు వెన్నెముక. ఒకప్పుడు క్రైమ్ కేసులను ఛేదించిన పోలీస్.. ఇప్పుడు రిటైర్ అయిపోయి తన గతంతోనే పోరాడుతున్న వ్యక్తిగా ఆయన నటన చాలా కంట్రోల్డ్‌గా ఉంటుంది. డైలాగ్ కంటే ముఖ కవళికలతో పాత్ర భావాలను చూపించే ప్రయత్నం చేశారు. ఈ పాత్రలో ఆయన నటన సినిమాకు ఉన్న ముఖ్యమైన ప్లస్.
ఆడమ్ స్కాట్
టామ్‌గా ఆడమ్ స్కాట్ చాలా సీరియస్ పాత్రలో కనిపిస్తాడు. కొడుకును కోల్పోయిన తండ్రిగా అతని ఆందోళన, కోపం, నిస్సహాయత బాగా కనిపిస్తాయి.
మైఖేల్ కీటన్
సినిమాలో ఎక్కువ సమయం కనిపించకపోయినా.. మైఖేల్ కీటన్ కనిపించినప్పుడు మాత్రం స్క్రీన్‌పై టెన్షన్ పెరుగుతుంది. జైలులోని సన్నివేశాలు సినిమాకు గుర్తుండిపోయే భాగాల్లో ఒకటి.
ఫైనల్ థాట్
‘ది విస్పర్ మ్యాన్’లో మంచి క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన అన్ని దినుసులూ ఉన్నాయి. పిల్లల కిడ్నాప్, సీరియల్ కిల్లర్, పాత కేసు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, కుటుంబ గొడవ, మైండ్ గేమ్స్.. అన్నీ ఉన్నాయి. కానీ సమస్య ఏమిటంటే.. వీటిలో చాలా అంశాలను మనం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. అయినప్పటికీ రాబర్ట్ డి నీరో, ఆడమ్ స్కాట్ల నటన, మంచి పేసింగ్, కొన్ని టెన్షన్ సీన్లు సినిమాను పూర్తిగా నిరాశపరిచే స్థాయికి వెళ్లకుండా కాపాడతాయి. అందుకే ఇది “అద్భుతమైన సీరియల్ కిల్లర్ సినిమా” కంటే “ఒకసారి కూర్చొని చూడగలిగే మంచి క్రైమ్ థ్రిల్లర్” అనడం కరెక్ట్.
అసలు చూడచ్చా?
చూడొచ్చు. కానీ అంచనాలు ఎక్కువగా పెట్టుకోకుండా చూస్తేనే బెటర్. సీరియల్ కిల్లర్ కథలు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మిస్టరీ థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువ. అదే సమయంలో ‘సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్’ తరహాలో ఒక సంచలనాత్మక కొత్త థ్రిల్లర్‌ను ఆశిస్తే మాత్రం నిరాశ రావచ్చు.
ఎక్కడ చూడచ్చు?
‘ది విస్పర్ మ్యాన్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగులో కూడా ఉంది.








