సీఎస్కేలో 25 శాతం వాటా అడిగిన ధోనీ..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఎంఎస్ ధోనీల(Ms Dhoni) బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఐపీఎల్ 2027 రిటెన్షన్ నిబంధనలపై స్పష్టత వచ్చే ముందే.. ధోనీ సీఎస్కే ఫ్రాంచైజీలో ఏకంగా 25 శాతం వాటా అడిగారంటూ నెట్టింట ఒక వార్త హల్చల్ చేస్తోంది. తొలుత 25 శాతం అడిగి, ఆ తర్వాత దానిని 20 శాతానికి తగ్గించారని, కానీ యాజమాన్యం ఆయనకు 5.5 శాతం వాటా మాత్రమే ఆఫర్ చేసిందనేది ఆ నివేదికల సారాంశం.
ఈ సంచలన ప్రచారంపై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంట్లెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ వార్తలపై ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. ఇదంతా కేవలం ఎవరో ప్లాన్ చేసి వదిలిన ఒక కల్పిత కథ అని కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆర్సీబీ లాంటి జట్ల విలువనే దాదాపు 1.8 బిలియన్ డాలర్లుగా ఉందని, ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో పాటు విదేశాల్లోనూ ఫ్రాంచైజీలు ఉన్న సీఎస్కే బ్రాండ్ వాల్యూ చాలా పెద్దదని ఆయన గుర్తుచేశారు.
ఇంత భారీ మార్కెట్ విలువ ఉన్న జట్టులో ఎవరైనా 25 శాతం వాటాను ఊరికే అడగడం అనేది అస్సలు నమ్మశక్యంగా లేదని, అంత వాటా కావాలంటే సుమారు 400 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని విశ్లేషించారు. ఐపీఎల్ చరిత్రలో ఏ ఫ్రాంచైజీ కూడా ఏ ఒక్క ఆటగాడికి అంత పెద్ద మొత్తంలో షేర్లు ఇవ్వదని స్పష్టం చేశారు. ఆఖరికి సీఎస్కే ఆఫర్ చేసిందని చెబుతున్న 5.5 శాతం వాటా కూడా అత్యంత భారీ మొత్తం అని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డారు.
ధోనీకి మరియు ఫ్రాంచైజీకి మధ్య విభేదాలు వచ్చాయని, ఆ తర్వాతే ఈ వాటాల వ్యవహారం నడిచిందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చిచెప్పారు. పూర్తి అధికారిక సమాచారం లేనందున దీనిని తప్పుడు వార్త అని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తన అంతరాత్మ చెబుతోందని చోప్రా ముగించారు. ఐపీఎల్ 2026 సీజన్లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, ఆయన చుట్టూ ఉన్న క్రేజ్ కారణంగానే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.








