‘జనరిక్ మందు’ లే ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయా?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు మెడికల్ షాప్‌కు వెళ్లి ఒక కొత్త మందు అడిగారు అనుకోండి. అదే మందు మూడు కంపెనీల పేర్లతో కనిపిస్తే.. మీకు ఆనందమే. “పోటీ పెరిగింది కాబట్టి ధర తగ్గుతుంది” అనుకుంటారు. కానీ ఆ మందును కనిపెట్టిన కంపెనీ మాత్రం అలా అనుకోదు.
ఎందుకంటే ఆ మందును కనిపెట్టడానికి ఏళ్లపాటు, భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసిన తర్వాత.. అదే మందు మార్కెట్లోకి తాము కాకుండా వేరే కంపెనీలు జనరిక్ పేరుతో తెచ్చేస్తే, పరిశోధన చేసిన తమ కంపెనీకి మిగిలేది ఏమిటి? అని ఆలోచనలో పడతాయి. బెంగ పెట్టుకుంటాయి. ఇప్పుడు భారత్‌లో ఫార్మా రంగాన్ని ఆలోచనలో పడేస్తున్న అసలు విషయం ఇదే.
ఇది కేవలం ఫార్మా కంపెనీల మధ్య జరుగుతున్న గొడవ కాదు. రేపు మీరు మెడికల్ షాప్‌లో కొనబోయే మందు ధరతో కూడా దీనికి సంబంధం ఉంది.
ఎక్కడ మొదలైందీ విషయం
భారత్ ప్రపంచంలోనే పెద్ద జనరిక్ మందుల తయారీ కేంద్రంగా ఎదగడానికి ఒక కారణం మన ఔషధ విధానమే. ఒక కంపెనీ కొత్త మందును కనిపెట్టిన తర్వాత, పేటెంట్ గడువు ముగిసినప్పుడు ఇతర కంపెనీలు అదే ఔషధాన్ని తక్కువ ధరకు తయారు చేయగలిగాయి. పోటీ పెరిగింది. ధరలు తగ్గాయి. కోట్లాది మంది రోగులకు చౌకైన మందులు అందాయి. అంటే జనరిక్ మందులు భారత ఫార్మా రంగానికి సమస్య కాదు.. అవి మన బలం. అయితే ఇప్పుడు అదే బలంలో ఒక కొత్త చిక్కు కనిపిస్తోంది.
ఒక కొత్త మందును మార్కెట్లోకి తీసుకురావడం అంటే కేవలం మందును తయారు చేయడం కాదు. అది సురక్షితమా? నిజంగా పనిచేస్తుందా? ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? అనే విషయాలను నిరూపించడానికి సంవత్సరాల పాటు క్లినికల్ ట్రయల్స్ చేయాలి. దీనికి భారీగా డబ్బు ఖర్చవుతుంది.
ఇక్కడే అసలు పాయింట్ ఉంది. భారత్‌లో మందుకు పేటెంట్ రక్షణ ఉన్నప్పటికీ, ఆ మందును అనుమతించేందుకు కంపెనీ సమర్పించిన క్లినికల్ డేటాకు ప్రత్యేకమైన ‘డేటా రక్షణ’ లేదు. దీంతో ఇతర కంపెనీలు ఆ డేటాను ఆధారంగా చేసుకుని తమ మందులకు అనుమతులు పొందే అవకాశం ఉంటుంది.
ఉత్సాహం చచ్చిపోతోంది
ఒక కంపెనీ ఏళ్ల తరబడి పరిశోధన చేసి, భారీగా డబ్బు ఖర్చు చేసి కొత్త మందును తీసుకొచ్చింది. ఇంకో కంపెనీకి మాత్రం ఆ పరిశోధనలో అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తక్కువ స్థాయి అధ్యయనాలతో మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంటే.. మొదటి కంపెనీకి కొత్త మందులపై మళ్లీ అంత పెద్ద పెట్టుబడి పెట్టే ఉత్సాహం ఉంటుందా? ఇదే భయం ఇప్పుడు కొత్త మందులను అభివృద్ధి చేస్తున్న కంపెనీల్లో ఉంది.
ఇటీవల సెమాగ్లుటైడ్ విషయంలో కనిపించిన పరిణామం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. పేటెంట్ గడువు ముగిసే సమయానికి దాని సంబంధిత డేటా అందుబాటులో ఉండటంతో, పేటెంట్ ముగిసిన వెంటనే దాదాపు 50 బ్రాండ్లు మార్కెట్లోకి రావడానికి సిద్ధమయ్యాయి. రోగికి చూస్తే ఇది మంచి విషయమే. ఎక్కువ కంపెనీలు వస్తే పోటీ పెరుగుతుంది. ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొత్త మందును అభివృద్ధి చేసిన కంపెనీ కోణంలో చూస్తే.. ఇదే పరిస్థితి అంత సంతోషకరమైనది కాదు.
ఇక్కడే భారత ఫార్మా రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు జనరిక్ మందుల ద్వారా ప్రపంచాన్ని గెలిచిన భారత కంపెనీలే ఇప్పుడు కొత్త మందులు కనిపెట్టడం మొదలుపెట్టాయి. అంటే నిన్నటి వరకు “జనరిక్ కంపెనీ”గా ఉన్న సంస్థకు, ఈరోజు “ఇన్నోవేటర్”గా మారినప్పుడు అదే నిబంధనలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి.
ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మాస్యూటికల్స్ దీనికి ఒక ఉదాహరణ. సంస్థ అభివృద్ధి చేసిన మయోపియా మందు ప్రపంచంలోనే తొలిదని కంపెనీ చెబుతోంది. కానీ దానికి ప్రత్యేకమైన క్లినికల్ రక్షణ లేకపోవడంతో, కొద్ది నెలల్లోనే మరో పెద్ద భారతీయ ఫార్మా కంపెనీ అదే మందుకు అనుమతి పొంది మార్కెట్లోకి వచ్చిందని సంస్థ అధిపతి నిఖిల్ కే. మసూర్కర్ తెలిపారు.
అందుకే అంతర్జాతీయ పరిశోధనా ఔషధ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు ఇప్పుడు భారత్‌లో రెగ్యులేటరీ డేటా ప్రొటెక్షన్ కోరుతున్నాయి. అంటే ఒక కొత్త మందుకు అనుమతి పొందేందుకు కంపెనీ సమర్పించిన క్లినికల్ డేటాను కొంతకాలం పాటు ఇతర కంపెనీలు తమ అనుమతుల కోసం ఉపయోగించుకోకుండా రక్షణ ఇవ్వాలి అన్నమాట. ఈ రక్షణను 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
అయితే దీనికి మరో వైపు కూడా ఉంది.
డేటాకు ఎక్కువకాలం రక్షణ ఇస్తే జనరిక్ కంపెనీలు వెంటనే పోటీకి రావడం ఆలస్యం కావచ్చు. పోటీ ఆలస్యమైతే కొన్ని మందులు ఎక్కువకాలం ఖరీదుగానే ఉండొచ్చు. అందుకే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి కూడా ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు: కొత్త విధానం పేరుతో భారత్ తన ప్రపంచ స్థాయి జనరిక్ బలాన్ని దెబ్బతీయకూడదని. మరి ఏం జరుగుతుందో చూడాలి.








