ఏపీ మున్సిపల్ శాఖ యూకే ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం
అమరావతిని వరల్డ్ క్లాస్ స్మార్ట్, లివబుల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నైపుణ్యం, సాంకేతిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. దీనికోసం ఎపి మున్సిపల్‌శాఖ, యూకే (UK) ప్రభుత్వాల మధ్య పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంఒయు చేసుకున్నారు. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, ఆధునిక టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయనున్నాయి. వెలగపూడిలోని సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ (Minister Narayana) సమక్షంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ (Suresh Kumar), యుకె ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ డిప్యూటీ డైరెక్టర్ చాజ్ వాలియా ( Chaz Walia) ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను చేపడుతున్నామన్నారు. ఈ పనుల్లో యుకెకు చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను వినియోగించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టుల ప్రణాళిక, ప్రాధాన్యత క్రమం, ఆర్థిక సాధ్యాసాధ్యాల అంచనా, పెట్టుబడులకు అనుకూలమైన బిజినెస్ రూపకల్పన, ప్రాజెక్ట్ డిజైన్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, అమలు వంటి అంశాల్లో ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నగరాలను మెరుగైన అర్బన్ స్ట్రక్చర్‌తో స్మార్ట్, లివబుల్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు యూకే నైపుణ్యాన్ని వినియోగించుకోనున్నుట్లు తెలిపారు.








