అమెరికాలో చదువంటే ఉలిక్కి పడుతున్న భారతీయ యువత..!
అవకాశాల స్వర్గం.. ఇప్పుడు నరకప్రాయంగా కనిపిస్తోంది. డాలర్ల పంట దేముడెరుగు.. ఏదో ఉద్యోగం వస్తే అన్న భావన .. భారతీయ యువతలో కనిపిస్తోంది.ఫలితంగా అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తులు సైతం గణనీయంగా తగ్గుతున్నాయి. ఎందుకంటే అమెరికాలో చదువంటే మాటలు కాదు.. లక్షల డాలర్లు ఖర్చు చేయాలి.. ఆపై అక్కడే ఓపీటీ చేసి జాబ్ వెతుక్కోవాలి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ఓవిధంగా చెప్పాలంటే అమెరికా సర్కార్.. తమ దేశంలో జాబ్స్ .. అమెరికా యూత్ కే దక్కాలన్నట్లుగా ప్రవర్తిస్తోంది. నిబంధనలు కఠినతరం చేస్తోంది.
అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు భారతీయ విద్యార్థులు విముఖత చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యలో 15 శాతం తగ్గుదల నమోదైంది.2024-25 విద్యా సంవత్సరంలో సుమారు 3.63 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ యూజీ ప్రోగ్రామ్లలో ప్రవేశాలు పొదారు. అయితే, తదుపరి విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. కేవలం భారతీయ విద్యార్థులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కూడా సుమారు 1.1 లక్షల మేర క్షీణించింది. అంచనాల ప్రకారం 11.69 లక్షలుగా ఉండాల్సిన ఈ సంఖ్య, ప్రస్తుతం 10.57 లక్షలకు పరిమితమైంది.
భారత విద్యార్థులలో కనిపిస్తున్న ఈ విముఖతకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాలే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వీసాల జారీలో కఠిన నిబంధనలు, సామూహిక అరెస్టులు, బహిష్కరణలు, సోషల్ మీడియా ఖాతాల పరిశీలన వంటి అంశాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు చదువు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలపై నెలకొన్న అనిశ్చితి కూడా వారిని పునరాలోచనలో పడేస్తోంది.
ఇదే తరుణంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్-1బీ వీసాలపై విధించిన కొత్త రుసుములను సమర్థించారు. విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా, అమెరికన్ కంపెనీలు స్థానికులకే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.








