అమెరికా ఆర్థిక యుద్ధానికి సిద్ధం…! రెండేళ్ల ప్రణాళికతో ఇరాన్ కౌంటర్..!
ఇరాన్ అంతు చూస్తాం.. ఆర్థిక వ్యవస్థ వెన్నువిరుస్తామంటూ ట్రంప్ సర్కార్ బెదిరింపులకు ఇరాన్ గట్టిగా కౌంటరిచ్చింది. మీరు ఎప్పుడో ప్రకటించే యుద్ధానికి .. రెండేళ్ల ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ఇరాన్ ఆర్థిక బంధాన్ని తెంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు బెదిరేది లేదని తేల్చి చెప్పింది.టెహ్రాన్‌తో సంబంధాలు కొనసాగిస్తూ, నగదు అక్రమ చలామణిలో దానికి తోడ్పడే దేశాలను డాలరు వ్యవస్థ నుంచి దూరం చేస్తామని యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. దీనికి ధీటుగా స్పందించిన ఇరాన్.. ప్రతీకార చర్యలు తప్పవని బదులిచ్చింది.
యూఎస్ నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తమ వాణిజ్య భాగస్వాములు గట్టిగా వ్యతిరేకిస్తారని టెహ్రాన్ విశ్వాసం వ్యక్తంచేసింది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇతర దేశాలతో ఇరాన్‌కున్న సంబంధాలను తెగ్గొట్టే స్థితిలో అమెరికా లేదన్నారు. ‘‘అమెరికన్ల ప్రగల్భాలను ఎవరూ నమ్మరు. అమెరికా ఆంక్షల (USA sanctions on Iran) ప్రకటనను పరిగణనలోకి తీసుకోబోమని మా వాణిజ్య భాగస్వాములు ఇప్పటికే మాకు సందేశాలు పంపారు’’ అని పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానీజాదేహ్ కూడా ఇదే తరహ వ్యాఖ్యలు చేశారు. ‘‘అమెరికాకు మరో ఓటమి తప్పదు. వాషింగ్టన్ విధించిన కొత్త ఆంక్షలను ఎదుర్కోవడానికి మా వద్ద రెండేళ్ల ప్రణాళిక ఉంది. ఇరాన్ ప్రజలు, దేశ అధికారుల సంకల్పాన్ని పరీక్షించడానికి వారు చేయగలిగిందంతా చేశారు. కానీ ప్రతిసారీ విఫలమయ్యారు’’ అని యూఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.
ఇరాన్‌పై అమెరికా విధించిన తాజా ఆంక్షలను ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు సమర్థించారు. ఇరాన్‌తో పాటు దానికి మద్దతుగా నిలిచిన వారినే లక్ష్యంగా చేసుకొంటూ తీసుకువచ్చిన ఈ ఆంక్షలతో భారీ మూల్యం వసూలు చేసేందుకు వీలుందని పేర్కొన్నారు. సోమవారం ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ పేరిట 60 సంస్థలు, వ్యక్తులు, నౌకలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ వాటిని ప్రకటించింది.








