QR కోడ్ ఒక్కసారి స్కాన్ చేశారంటే.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ?!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రెస్టారెంట్లో భోజనం చేశారు. బిల్లు వచ్చింది.
టేబుల్‌పై ఉన్న QR కోడ్ స్కాన్ చేశారు. రెండు నిమిషాల్లో పేమెంట్ అయిపోయింది. అంతే.. మన పని అయిపోయిందనుకుంటాం.
కానీ అదే QR కోడ్ వెనుక ఒక సైబర్ నేరగాడి వల ఉంటే?
మీరు స్కాన్ చేసింది మెనూ కోసం అనుకున్న QR కోడ్ కావచ్చు. పార్కింగ్ ఫీజు కోసం అనుకున్న కోడ్ కావచ్చు. లేదంటే మీ కారును ఛార్జ్ చేసుకోవడానికి పెట్టిన QR కోడ్ కావచ్చు. కానీ అది మిమ్మల్ని అసలైన వెబ్‌సైట్‌కు కాకుండా హ్యాకర్ తయారు చేసిన నకిలీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్లి ఉండొచ్చు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
QR కోడ్ కనిపిస్తే చాలు.. స్కాన్ చేస్తున్నారా?
మనలో చాలామందికి QR కోడ్ అంటే ఇప్పుడు ఒక సాధారణ అలవాటు. టీ తాగినా పది రూపాయలు ఇవ్వటానికి QR కోడ్. రెస్టారెంట్లో బిల్లు కట్టాలన్నా QR కోడ్. పార్కింగ్‌లో పేమెంట్ చేయాలన్నా QR కోడ్. ఆన్లైన్లో ఏదైనా ఆఫర్ చూసినా QR కోడ్. అంతగా అలవాటైపోయింది కాబట్టి.. దాన్ని స్కాన్ చేసే ముందు అది నిజమైనదేనా అని ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈ నిర్లక్ష్యాన్నే ఆయుధంగా మార్చుకుంటున్నారు.
ఈ కొత్త తరహా మోసానికి ‘క్విషింగ్’ అని పేరు. అంటే QR Code + Phishing. ఫిషింగ్‌లో నకిలీ లింక్ పంపి మనల్ని మోసం చేస్తారు. క్విషింగ్లో అదే పని QR కోడ్ ద్వారా చేస్తారు.
ఫోన్‌ను హ్యాక్ చేయకుండానే మీ డేటా దొంగిలించొచ్చు
ఇక్కడే ఈ మోసం మరింత ప్రమాదకరం. హ్యాకర్ మీ ఫోన్లోకి చొరబడాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. మీ ఫోన్లో వైరస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ సెక్యూరిటీని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. మీ చేతులతోనే మీ వివరాలను మీరే ఇచ్చేసినట్లు. కొన్ని సందర్భాల్లో చెల్లింపును కూడా మీ చేతులతోనే ఆమోదించేలా చేస్తారు.
అంటే దొంగ మీ ఇంటి తలుపు పగలగొట్టి లోపలికి రావడం లేదు. మీరు తలుపు తీసి లోపలికి ఆహ్వానించినట్టే.
‘ఇప్పుడే చెల్లించండి’ అనే ఒక్క మాట చాలు!
క్విషింగ్లో మరో ప్రమాదకరమైన ఆయుధం అత్యవసర పరిస్థితి. ‘ఇప్పుడే పార్కింగ్ ఫైన్ చెల్లించండి.’ ‘మీ పార్సిల్ డెలివరీ ఆగిపోయింది.’ ‘మీ EV ఛార్జింగ్ పేమెంట్ పెండింగ్‌లో ఉంది.’ ‘ఇప్పుడే పేమెంట్ చేయకపోతే అదనపు ఛార్జ్ పడుతుంది.’ ఇలాంటి మెసేజ్ కనిపిస్తే మనం ఆలోచించం. ముందు భయపడతాం. తర్వాత స్కాన్ చేస్తాం. అదే హ్యాకర్‌కు కావాల్సింది.
EV ఛార్జింగ్ స్టేషన్లు.. రెస్టారెంట్లు కూడా టార్గెట్
ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల దగ్గర ఇలాంటి మోసాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు డ్రైవర్‌కు ఒక్క నిమిషం కూడా వృథా చేయాలని అనిపించదు. QR కోడ్ కనిపించింది.. స్కాన్ చేశాడు.. పేమెంట్ చేశాడు. అదే తొందరను నేరగాడు ఉపయోగించుకుంటాడు.
రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి.
టేబుల్‌పై QR కోడ్ ఉంది కాబట్టి అది రెస్టారెంట్‌దే అనుకుంటాం. కానీ అసలైన కోడ్‌పై నకిలీ స్టిక్కర్ ఉంటే? మీరు మెనూ చూడటానికి స్కాన్ చేస్తారు. అవతలివాడు మీ డబ్బు కోసం ఎదురుచూస్తుంటాడు.
మరి QR కోడ్‌ను పూర్తిగా వాడకూడదా?
అలాంటిదేం లేదు. QR కోడ్ ప్రమాదకరం కాదు. దాన్ని ఎక్కడి నుంచి స్కాన్ చేస్తున్నామన్నదే ముఖ్యం. పబ్లిక్ ప్లేస్‌లో కనిపించిన QR కోడ్ అయితే ఒక్కసారి పరిశీలించండి. దానిపై మరో స్టిక్కర్ అతికించినట్టు కనిపిస్తే స్కాన్ చేయకండి. స్కాన్ చేసిన తర్వాత ఓపెన్ అయిన వెబ్సైట్ అడ్రస్‌ను చూడండి. బ్యాంకింగ్ వివరాలు, OTP, CVV, పాస్వర్డ్ అడిగితే వెంటనే ఆపేయండి. సాధ్యమైనంత వరకు సంబంధిత సంస్థ అధికారిక యాప్‌ను ఉపయోగించండి. అనుమానం వస్తే QR కోడ్‌ను వదిలేసి.. అధికారిక వెబ్‌సైట్‌ను మీరే బ్రౌజర్లో టైప్ చేసి ఓపెన్ చేయండి.
చివరికి గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే..
ఇప్పటివరకు మనం ‘తెలియని లింక్ క్లిక్ చేయొద్దు’ అని నేర్చుకున్నాం.ఇక నుంచి మరో జాగ్రత్త కూడా గుర్తుపెట్టుకోవాలి. ‘తెలియని QR కోడ్‌ను స్కాన్ చేయొద్దు.’








