Gen Zకి ప్రేమలో ఇదే పెద్ద సమస్య.. ఫస్ట్ డేట్లోనే ఫెయిల్! ఎందుకంటే
—సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒక అబ్బాయి, ఒక అమ్మాయి మొదటిసారి డేట్‌కి వెళ్ళారు.
టేబుల్‌పై కాఫీ ఉంది. ఇద్దరి మధ్య చిన్న నిశ్శబ్దం. సాధారణంగా అయితే ఆ నిశ్శబ్దంలోనే కొత్తదనం, ఓ రకమైన ఉత్సుకత ఉండాలి. “అసలు ఇతను ఎలా ఉంటాడో?”, ఆమె ఎలా మాట్లాడుతుందో అనే ఆసక్తి ఉండాలి.
కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త వేరుగా ఉంది.ఇద్దరూ క్యాజువల్ గా ఒకరినొకరు చూసుకున్నారు. మధ్యలో సెల్ ఫోన్ చూస్తున్నారు. రొటీన్ వ్యవహారంలా ఉంది.
ఎందుకంటే ఫస్ట్ డేట్ లో కలిసి కాఫీ ఆర్డర్ చేసేలోపే ఆమెకి అతని గురించి బోలెడు తెలుసు. అలాగని ఇద్దరూ చాలా కాలంగా తెలిసున్న కుటుంబాల వాళ్ళు కాదు. కామన్ ఫ్రెండ్స్ లేరు. మరి ఎలా అంటే?
ఆమె ఆల్రెడీ అతని ఫేస్ బుక్ , ఇనిస్ట్రా ప్రొఫైల్స్ చూసింది. వీడియోలు చూసింది. ట్విట్టర్ లో అతని పోస్ట్ లు చదివింది.ఇప్పుడు అతను ఎక్కడ చదివాడో తెలుసు. ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసు. అతని స్నేహితులు ఎవరో తెలుసు. అతను ఎలాంటి ఫొటోలు పెడతాడో తెలుసు. ఎలా మాట్లాడతాడో తెలుసు. బహుశా అతని ఐదేళ్ల క్రితం ఫొటో కూడా చూసి ఉంటుంది.
అతనికీ సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. అంటే ఇద్దరూ మొదటిసారి కలుసుకుంటున్నారు. కానీ ఒకరికి మరొకరు పూర్తిగా కొత్త కాదు. ఇదే Gen Z ప్రేమలో కనిపిస్తున్న ఒక చిత్రమైన సమస్య.
మొదటి డేట్లో ఒకరినొకరు తెలుసుకోవడం కంటే.. ముందే తెలుసుకున్న విషయాలను కన్ఫర్మ్ చేసుకోవడమే ఎక్కువైపోతోంది. ఒకప్పుడు ఫస్ట్ డేట్ అంటే కొత్త మనిషిని కలవడం. గతంలో డేట్‌కి వెళ్లేంతవరకు ఎదుటి వ్యక్తి గురించి పెద్దగా ఏమీ తెలిసేది కాదు. పేరు తెలుసు. చదువు తెలుసు. ఉద్యోగం తెలుసు. ఎవరో పరిచయం చేశారు. అంతే. మిగతాదంతా ఎదురుగా కూర్చున్నాకే తెలిసేది.
అతను ఎలా నవ్వుతాడు?
ఎలా మాట్లాడతాడు?, ఎదుటివారి మాట వింటాడా?, చిన్న విషయాలకు ఎలా స్పందిస్తాడు?, ఒకసారి నవ్వితే మళ్లీ నవ్వించాలనిపిస్తుందా? అలాగే ఎదుటివారిని ఎట్రాక్ట్ చేయటానికి చిన్న చిన్న జోక్స్ వేసుకునేవారు. సరదా మాటలు మాట్లాడుకునేవారు. కొద్దిగా సిగ్గు, బిడియం ఉండేది. అలాంటి చిన్న విషయాల్లోనే ఆకర్షణ మొదలయ్యేది. ఇప్పుడు ఆ ఆసక్తిలో కొంత భాగాన్ని సోషల్ మీడియా ముందే తినేస్తోంది. ఎదుటి వ్యక్తిని కలవకముందే అతని గురించి ఒక అభిప్రాయం తయారైపోతుంది.
ఆ తర్వాత డేట్‌కి వెళ్లి… “మనకు తెలిసిన ఈ వ్యక్తి నిజంగా ఇలాగే ఉన్నాడా?” అని చెక్ చేస్తున్నారు. అంటే డేట్ అనేది పరిచయం కాదు. వెరిఫికేషన్.
మరో కొత్త సమస్య
ఇది చాలదన్నట్లు … డేట్ కు వెళ్లాక దాన్ని ఎంజాయ్ చేయటం మానేసి చిన్న ఫైనాన్స్ ఆడిట్ మొదలెడుతున్నారు. అంటే ప్రేమకు ఆర్థిక లెక్కలు కూడా జతయ్యాయి. “ఏం చేస్తావు?”, “ఎక్కడ ఉంటావు?”, “పేరెంట్స్‌తో ఉంటున్నావా?”, “సొంత ఇల్లు ఉందా?”, “లోన్ ఉందా?”, “భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు?” ఇంకాస్త సీరియస్‌గా వెళ్తే క్రెడిట్ స్కోర్ అడిగినా ఆశ్చర్యం లేదు.
ఒకప్పుడు ఫస్ట్ డేట్లో “నీకు ఏ సినిమా ఇష్టం?” అనేవారు. ఇప్పుడు “నీ కెరీర్ ప్లాన్ ఏంటి?” అంటే డేట్ వెళ్లటం అనేది ఓ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టుగా తయారైంది.
కాఫీతాగుదామా అంటే జడ్జిమెంట్. “ఇంతేనా?”
డిన్నర్‌కి తీసుకెళ్తే: “అందరినీ ఇలాగే తీసుకెళ్తాడేమో.”
బిల్ పంచుకుందాం అంటే సమస్య. మొత్తం కడితే కూడా సమస్య. పాపం అవతలి వ్యక్తి ప్రేమించడానికి వచ్చాడా, లేక పరీక్ష రాయడానికి వచ్చాడా అనేది అతనికే అర్థం కాకపోవచ్చు. కొన్ని సార్లు ఆమెదీ అదే పరిస్ధితి కావచ్చు.
తెలివి పెరిగిందా? లేక భయం పెరిగిందా?
Gen Zకి గత తరాల కంటే రిలేషన్ షిప్స్ గురించి ఎక్కువ అవగాహన ఉంది. రెడ్ ఫ్లాగ్స్ తెలుసు. విషపూరిత సంబంధాలు తెలుసు. మోసం ఎలా జరుగుతుందో తెలుసు. ఎవరైనా మానసికంగా నియంత్రిస్తున్నారా అనేది తెలుసుకునే మార్గాలు తెలుసు. ఇది మంచి పరిణామమే.
కానీ అదే సమయంలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. ప్రతి ప్రవర్తనను అనుమానించే అలవాటు కూడా పెరిగింది. అతను ఆలస్యంగా స్పందిస్తే — “ఆసక్తి లేదా?” , ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే — “ఇది లవ్ బాంబింగ్నా?”, కొంచెం దూరంగా ఉంటే — “ఎమోషనల్‌గా సమస్యలో ఉన్నాడేమో?”
మాట ఎక్కువైతే ఒక సమస్య. మాట తక్కువైతే ఇంకో సమస్య. అంటే మనిషి సహజంగా ఉండే అవకాశం కూడా తగ్గిపోయింది.
భవిష్యత్తు గురించి భయపడుతూ వర్తమానాన్ని మర్చిపోతున్నారా?
ఇక్కడే అసలు సమస్య మరింత డీప్ గా ఉంటుంది. ఫస్ట్ డేట్లోనే “ఇది ఎంతకాలం ఉంటుంది?”, “ఇతను నిజంగా సీరియస్‌నా?”, “రేపు పెళ్లి వరకు వెళ్తుందా?”, “విడిపోతే?”, “నేను ఎక్కువగా అటాచ్ అయితే?” అంటూ భవిష్యత్తులోకి చాలా ముందుకు వెళ్లిపోతున్నారు.ఇంకా రెండోసారి కలవనేలేదు. అప్పటికే బ్రేకప్ గురించి భయపడుతున్నారు.
ఇది ఒక రకంగా చూస్తే జాగ్రత్త. కానీ మరో రకంగా చూస్తే ప్రస్తుతం అక్కడ సరదాగా ఎంజాయ్ చెయ్యాల్సిన అనుభూతిని మిస్సవటం. భవిష్యత్తుని భయానికి తాకట్టు పెట్టడం.
ఫస్ట్ డేట్ అంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసే ఆఖరి పరీక్ష కాదు. కొన్నిసార్లు అది కేవలం ఒక మంచి సాయంత్రం. ఒక మంచి సంభాషణ. కొత్త మనిషి. కొంచెం నవ్వు. కొంచెం సంకోచం. మళ్లీ కలవాలనిపించే చిన్న ఆసక్తి. అంతే.
కొంచెం తెలియకపోవడం కూడా ప్రేమలో భాగమే
ఈ మాట Gen Zకి చెప్పడం సులభం కాదు. ఎందుకంటే వాళ్లకు అన్నీ తెలుసుకోవాలనే అలవాటు ఉంది. కానీ ఒక మనిషి గురించి ముందే అన్నీ తెలుసుకోవడం, అతన్ని నిజంగా అర్థం చేసుకోవడం రెండూ ఒకటే కాదు. ప్రొఫైల్ అతని గురించి కొన్ని విషయాలు మాత్రమే చెబుతుంది. డేట్ అతని వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. ఫొటోలు అతను ఎలా కనిపిస్తాడో చెబుతాయి. ఎదురుగా కూర్చున్నప్పుడు అతను ఎలా అనిపిస్తాడో మాత్రం చెప్పలేవు. అందుకే గతంలో ఉన్న ఆ చిన్న “తెలియదు” అనే భావనలో ఒక మధురమైన ఉత్కంఠ ఉండేది. ఇప్పుడు ఆ తెలియనితనాన్ని మనమే భయపడుతున్నాం.దూరం చేసుకుంటున్నాం.
Gen Zకి ప్రేమ కావాలి..కానీ
Gen Zకి అనంతమైన ప్రేమ కావాలి. కానీ ముందుగా హామీ కావాలి. ఇదే అసలు వైరుధ్యం. ప్రేమలోకి వెళ్లాలి. కానీ ముందే గ్యారంటీ కావాలి. మనసు పెట్టాలి. కానీ గాయపడకూడదు. కొత్త మనిషిని కలవాలి. కానీ ముందే అతని గురించి మొత్తం తెలుసుకోవాలి. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ప్రేమలో కొంత ప్రమాదం ఉంటుంది. కొంత అనిశ్చితి ఉంటుంది. కొంత అమాయకత్వం కూడా ఉంటుంది.
ప్రతి వ్యక్తిని అనుమానంతో చూడటం తప్పు. అలాగే ప్రతి ఒక్కరినీ నమ్మేయడం కూడా తప్పే. అసలు సమతుల్యత అక్కడే ఉంది. రెడ్ ఫ్లాగ్ కనిపిస్తే గుర్తించాలి. కానీ ప్రతి మనిషిలో రెడ్ ఫ్లాగ్ కోసం వెతకకూడదు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ భవిష్యత్తు భయంతో వర్తమానాన్ని పాడుచేసుకోకూడదు. ఎందుకంటే ఒక మంచి డేట్‌కి పరమార్దం వెంటనే పెళ్లి కాదు. ఒక పరిచయం జీవితాంతం కొనసాగాల్సిన అవసరం కూడా లేదు.
కొన్నిసార్లు జీవితంలో కొన్ని మధురమైన క్షణాలు… అవి ఎక్కడికి దారితీస్తాయో తెలియనప్పుడే మరింత అందంగా ఉంటాయి.
Gen Z చెయ్యాల్సింది
ప్రేమ మొదలయ్యే ముందు ఉండే ఆ కొత్తదనం. అందుకే వచ్చే ఫస్ట్ డేట్లో ఒకసారి ప్రొఫైల్‌ను, లెక్కలను, ఐదేళ్ల భవిష్యత్తును పక్కన పెట్టి… ఎదురుగా కూర్చున్న మనిషిని మాత్రమే చూడండి. ఎక్కడికి వెళ్తుందో తర్వాత చూద్దాం. ముందు ఆ క్షణం ఎక్కడుందో చూడాలి కదా.








