విరాట్ కోహ్లీ సలహాలే నాకు శ్రీరామరక్ష:జోర్డాన్ కాక్స్..!
పాకిస్తాన్‌తో ప్రారంభం కాబోయే కీలకమైన టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై(Virat Kohli) తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. పాక్‌తో జరిగే సిరీస్‌లో తనకు లభించిన భారీ అవకాశాన్ని విజయవంతంగా ఉపయోగించుకోవడానికి కోహ్లీ ఇచ్చిన విలువైన సలహాలే తనకు మార్గదర్శకంగా నిలుస్తాయని 25 ఏళ్ల కాక్స్ వెల్లడించాడు. ఇంగ్లాండ్ జట్టులోని కీలక ఆటగాడు జాకబ్ బెథెల్ మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరం కావడంతో.. హెడింగ్లే వేదికగా బుధవారం నుండి ప్రారంభం కాబోయే మొదటి రెండు టెస్టుల్లో కాక్స్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.
ఈ కీలక బాధ్యతను ఎదుర్కొనేందుకు తాను కోహ్లీ మాటల నుండే స్ఫూర్తి పొందుతున్నట్లు కాక్స్ తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో సభ్యుడిగా ఉన్న జోర్డాన్ కాక్స్.. ఆ సమయంలో విరాట్ కోహ్లీతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. “ఐపీఎల్ సమయంలో నేను కోహ్లీతో దాదాపు నాలుగు నెలల పాటు ప్రయాణించాను. అప్పుడు నా టెస్ట్ అరంగేట్రం గురించి కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ‘తొలి మ్యాచ్ అనుభూతి జీవితంలో ఒక్కసారే వస్తుంది, కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ క్షణాన్ని ఆస్వాదించు. నీ వెనుక నీ కుటుంబం, స్నేహితులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ వారికి గర్వకారణంగా నిలువు’ అని కోహ్లీ నాకు ధైర్యం చెప్పాడు” అని కాక్స్ వివరించాడు.
ఆ మాటలను తాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, ఇప్పటికీ తనకు ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా నిరాశకు గురైనా కోహ్లీకి మెసేజ్ చేస్తుంటానని, ఆయన ఎప్పుడూ ఫోన్ లైన్లో అందుబాటులో ఉంటాడని కాక్స్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం, బెథెల్ గాయపడటంతో ఇంగ్లాండ్ సరికొత్త మిడిలార్డర్‌తో పాకిస్తాన్‌ను ఢీకొట్టబోతోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఎసెక్స్ కౌంటీ జట్టు తరఫున నంబర్ 4 లో బ్యాటింగ్ చేస్తూ ఏకంగా 68 సగటుతో పరుగుల వరద పారించిన కాక్స్‌కు.. ఇప్పుడు నేరుగా వన్‌డౌన్ పొజిషన్లో ఆడటం ఒక పెద్ద సవాలు కానుంది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌పై టెస్ట్ అరంగేట్రం చేసిన కాక్స్.. పాకిస్తాన్‌పై జరిగే ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో తన స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్ ఇచ్చిన సలహాలతో మానసికంగా సిద్ధమైన కాక్స్.. లీడ్స్ మైదానంలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.








