23 ఏళ్ళ నిరీక్షణకు తెర.. బంగ్లా హిస్టారికల్ విక్టరీ వెనుక..!
అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఒక అద్భుతమైన సంచలనం నమోదైంది. క్రికెట్ దిగ్గజం ఆస్ట్రేలియాకు(Australia) వారి సొంతగడ్డపైనే ఊహించని షాక్ తగిలింది. డార్విన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడించి బంగ్లాదేశ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా భూభాగంపై బంగ్లాదేశ్‌కు ఇదే మొట్టమొదటి విజయం కావడం విశేషం. బంగ్లాదేశ్ జట్టు మొదటిసారిగా 2003లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఏ డార్విన్ వేదికపై అయితే తొలిసారి ఆస్ట్రేలియాతో తలపడిందో, అదే వేదికపై ఈ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ బంగ్లా టైగర్స్ తమ తొలి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఈ చారిత్రాత్మక విజయానికి పునాది మొదటి ఇన్నింగ్స్‌లోనే పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహ్మూద్ తన అద్భుతమైన బౌలింగ్‌తో వణికించాడు. ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 198 పరుగులకే కుప్పకూల్చాడు. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (71) ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారి నుంచి సహకారం అందలేదు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. తన కెరీర్లో కేవలం రెండో టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్న యువ బ్యాటర్ తంజీద్ హసన్ తమీమ్ (101) అద్భుత శతకంతో కదంతొక్కాడు.
అతనికి తోడుగా నజ్ముల్ హుస్సేన్ శాంటో (84), మెహిదీ హసన్ మిరాజ్ (65), మోమినుల్ హక్ (49) రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగుల భారీ స్కోరు సాధించి, 228 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో కెమరూన్ గ్రీన్ (104) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఆ జట్టు 284 పరుగులకే పరిమితమైంది. దీనితో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే నిలిచింది. నాలుగో రోజు ఆటలో ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ తంజీద్ హసన్ డకౌట్ అయినప్పటికీ, బంగ్లాదేశ్ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఘనవిజయం సాధించింది. టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ అద్భుత విజయంతో బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.








