ఇలాంటి వింత ఫుడ్ యాప్ గురించి మీరు ఎప్పుడూ విని ఉండరు!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి పది దాటింది. ఇంట్లో వంట చేయాలనిపించడం లేదు. బయటికి వెళ్లే ఓపిక లేదు. కాసేపు ఆలోచించి ఫోన్ తీస్తాం. మనలో చాలామందికి తర్వాత ఏం జరుగుతుందో తెలుసు.
Swiggy ఓపెన్ చేస్తాం. Zomato ఓపెన్ చేస్తాం.
ఏం తినాలో తెలియకపోయినా మెనూ చూస్తాం. బిర్యానీ ఫొటో కనిపిస్తుంది. తర్వాత పిజ్జా. ఇంకో రెస్టారెంట్లో ఆఫర్ కనిపిస్తుంది. కూపన్ ఉందేమో చూస్తాం. చివరికి ఏదో ఒకటి కార్ట్‌లో పడుతుంది.
“Place Order” నొక్కిన తర్వాతే కథ మొదలవుతుంది. ఆర్డర్ ఎక్కడ ఉంది? రెస్టారెంట్లో తయారవుతోందా? డెలివరీ బాయ్ బయలుదేరాడా?
ఇంకెంత సేపు? మ్యాప్‌లో ఆ చిన్న బైక్ కదులుతుంటే మనం కూడా దానితో పాటు కదులుతున్నట్టే ఉంటుంది. అదో కిక్కు. ఇది ఇప్పుడు మన నగర జీవితంలో అంత సహజమైన అలవాటైపోయింది. ఇది రొటీన్ గా జరిగే వ్యవహారం. అయితే ఒక్కసారి రివర్స్ లో ఆలోచించండి.
మీరు ఇదంతా చేస్తారు. ఆర్డర్ కూడా పెడతారు. డెలివరీని కూడా ట్రాక్ చేస్తారు. కానీ ఫుడ్ మాత్రం ఎప్పటికీ రాదు. అలాంటి యాప్ నిజంగానే ఉంది. దాని పేరు FoodNeverComes.
ఎందుకిలాంటి యాప్
పేరు చూస్తేనే విషయం అర్థమవుతుంది. మెనూ ఉంటుంది. వంటకాలు ఎంచుకోవచ్చు. ఆర్డర్ పెట్టవచ్చు. డెలివరీని ట్రాక్ చేయవచ్చు. కానీ తలుపు దగ్గరికి డెలివరీ బాయ్ మాత్రం రాడు.
వింతగా అనిపిస్తోంది కదా?
ఇక్కడ ఫుడ్ డెలివరీ చేయడం లక్ష్యం కాదు. ఫుడ్ ఆర్డర్ చేసే అనుభూతిని ఇవ్వడమే అసలు ఐడియా. ఇంకా వింత విషయం ఏమిటంటే… ఈ ఐడియాను దాదాపు పది లక్షల మంది ఇప్పటికే ఉపయోగించారు.
అంటే వాళ్లకు ఫుడ్ కావాలనిపించిందని కాదు. ఫుడ్ ఆర్డర్ చేస్తున్నామనే అనుభూతి కావాలనిపించింది. ఇక్కడే ఈ చిన్న యాప్ వెనుక ఉన్న పెద్ద కథ మొదలవుతుంది. మనకు నిజంగా ఆకలి లేకపోయినా ఫుడ్ యాప్‌లోకి వెళ్లడం కొత్త విషయం కాదు. ఇంట్లో ఏం తినాలో తెలియకపోయినా మెనూ చూస్తాం. ఆఫీసులో పని మధ్యలో ఫుడ్ యాప్ ఓపెన్ చేస్తాం. రాత్రి పడుకునే ముందు కూడా ఏదో ఒక రెస్టారెంట్ చూస్తుంటాం. కొన్నిసార్లు ఆర్డర్ కూడా చేయం. కానీ చూస్తూనే ఉంటాం.
ఎందుకు?
అందులో ఒక చిన్న ఆనందం ఉంది. ఏం తినాలి అనే ఆలోచన. ఏది ఎంచుకోవాలి అనే ఉత్సాహం. ఆర్డర్ చేసిన తర్వాత అది ఇంటికి వచ్చే వరకు ఉండే ఎదురుచూపు. ఈ మొత్తం ప్రక్రియే మనకు నచ్చుతోంది. FoodNeverComes ఆ పాయింట్‌నే పట్టుకుంది. ఫుడ్ అవసరం లేకుండా ఫుడ్ ఆర్డర్ చేసే అనుభూతిని అమ్ముతోంది.
ఇదే కాన్సెప్ట్‌తో మరికొన్ని “dopamine apps” కూడా వచ్చాయి. కొన్ని యాప్స్‌లో బట్టలు కొనుగోలు చేసినట్టు చేయొచ్చు. కానీ అవి ఎప్పటికీ ఇంటికి రావు. మరికొన్ని వర్చువల్‌గా స్మోకింగ్ అనుభూతిని ఇస్తాయి. నికోటిన్ లేదు. పొగాకు లేదు. కానీ ఆ అనుభవాన్ని మాత్రం సిమ్యులేట్ చేస్తాయి.
మొత్తానికి ఐడియా ఒక్కటే.
వస్తువు అవసరం లేదు. దాన్ని కోరుకునే అనుభూతి చాలు. ఈ ట్రెండ్ దక్షిణ కొరియాలో మొదలై ఇప్పుడు ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. ఇవన్నీ ఉచితంగా ఉంటే ఈ యాప్స్‌కు డబ్బులు ఎలా వస్తాయి?. సమాధానం మనం అనుకున్నదానికంటే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.
మన డేటా.
మీరు ఏ ఫుడ్‌ను ఎంచుకున్నారు? ఏది ఎక్కువసేపు చూశారు? ఏదాన్ని కార్ట్‌లో వేసి తీసేశారు? ఏ ధర దగ్గర వెనక్కి తగ్గారు?. ఇవి చిన్న విషయాల్లా అనిపించవచ్చు. కానీ ప్రకటనల ప్రపంచంలో ఇవి చాలా ఉపయోగపడే సంకేతాలు.
మీరు ఈరోజు FoodNeverComesలో బిర్యానీ ఎంచుకున్నారు అనుకోండి. మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. బిర్యానీ మీ ఇంటికి కూడా రాలేదు. కానీ యాప్‌కు ఒక విషయం మాత్రం తెలిసిపోయింది.
మీకు బిర్యానీ మీద ఆసక్తి ఉంది. రేపు మీరు నిజంగా ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఫోన్ తీసుకున్నప్పుడు అదే తరహా ప్రకటన మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ యాప్స్ పూర్తిగా “ఉచితం” అని చెప్పడం అంత సులభం కాదు.
మీరు డబ్బులు చెల్లించకపోవచ్చు. కానీ మీ ప్రవర్తన గురించి సమాచారం మాత్రం అక్కడ మిగిలిపోతుంది. ఇదే ఈ కథలో నాకు ఆసక్తికరంగా అనిపించే విషయం.
FoodNeverComes అనేది ఒక వింత ఫుడ్ యాప్ మాత్రమే కాదు. మన షాపింగ్ అలవాట్లు ఎలా మారుతున్నాయో చూపించే చిన్న ఉదాహరణ.
ఒకప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు షాపింగ్ చేసేవాళ్లం. ఇప్పుడు షాపింగ్ చేయడం కూడా ఒక వినోదంగా మారింది. ఫుడ్ యాప్‌లో స్క్రోల్ చేయడం, ఆఫర్లు చూడటం, కార్ట్‌లో వేయడం, ధరలు పోల్చడం… ఇవన్నీ కలిపి ఒక చిన్న కాలక్షేపం. అందుకే ఈ యాప్ మనకు ఒక ఇంట్రస్టింగ్ గా మారింది. సక్సెస్ అయ్యింది.








