ఎన్నో దశాబ్ధాల పోరాటం.. ఎన్నో తరాల ఉద్యమం: సీఎం చంద్రబాబు
మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాజధాని అమరావతి (Amaravati)లోని రాయపూడి (Rayapudi) పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు సీఎం హాజరై జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్య్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాట ఫలితమే మన స్వాతంత్య్రమని అన్నారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. దేశం మనకు హక్కులు (Rights), గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది. నా దేశం, నా బాధ్యత అని ముందుకుసాగాలి. దేశం నాకు ఏం చేసిందని కాదు, దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్ (India) స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్య్రం నుంచి సమృద్ధి వైపు, వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.










