Blinkit, Zepto నుంచి ఆర్డర్ చేసారా? ముందు ఈ ఒక్కటి చూడండి.. FDA వార్నింగ్!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
రాత్రి. ఇంట్లో పిల్లలు ఆకలితో ఎదురుచూస్తున్నారు.
వెంటనే ఫోన్లో Blinkit లేదా Zepto లేదా వేరే ఓ యాప్ లో ఒక ఆర్డర్ ప్లేస్ చేసారు. కొన్ని నిమిషాల్లో డోర్‌బెల్ మోగుతుంది.
తలుపు తీస్తే చేతిలో ఒక చిన్న ప్యాకెట్. “ఇంత ఫాస్ట్‌గా వచ్చేసిందా!” అంటూ ఆనందంగా తీసుకుని వంటగదిలో పెట్టేస్తాం.పిల్లలకు ఇచ్చేసారు.
అంతేకానీ ఆ ప్యాకెట్‌ను ఎవరు తయారు చేశారు? ఎక్కడ నిల్వ చేశారు? దాని ఎక్స్పైరీ ఎప్పుడు ముగిసింది? అసలు మనకు తెలియదు. కానీ ఒక విషయం మాత్రం మనకు నమ్మకం—“యాప్‌లో ఆర్డర్ చేశాం కదా.. సేఫ్‌గానే ఉంటుంది!”
ఇప్పుడు దేశవ్యాప్తంగా బయటపడుతున్న ఘటనలు ఆ ఒక్క నమ్మకాన్నే ప్రశ్నిస్తున్నాయి.
మీ ఇంటి తలుపు దగ్గరికి పది నిమిషాల్లో చేరిన ఆ ప్యాకెట్.. నిజానికి గడువు ముగిసిన ఆహారాన్ని దాచుకున్నదైతే? మనకు కనిపించకుండా నిల్వ చేసిన గోడౌన్లో బొద్దింకలు తిరుగుతున్నా, అదే ప్రొడక్ట్ మన పిల్లల చేతిలోకి వస్తే? డెలివరీ వేగం మాత్రం పది నిమిషాలు.. కానీ ఆ తప్పు వల్ల వచ్చే నష్టం జీవితాంతం ఉండొచ్చు.
మహారాష్ట్ర Food and Drug Administration అధికారులు క్విక్-కామర్స్ కంపెనీలకు చెందిన డార్క్ స్టోర్లపై నిర్వహించిన తనిఖీల్లో గడువు ముగిసిన ఉత్పత్తులు బయటపడటం, కొన్ని చోట్ల పరిశుభ్రత పరిస్థితులు దారుణంగా ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోలు ఈ భయాన్ని మరింత పెంచాయి.
అందుకే మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే వినియోగదారులకు ఒక సింపుల్ కానీ చాలా కీలకమైన మాట చెప్పారు. ఆన్లైన్లో వచ్చిన ఆహార పదార్థంపై తయారీ తేదీ లేదా ఎక్స్పైరీ తేదీ స్పష్టంగా కనిపించకపోతే.. ఆ డెలివరీని తీసుకోవద్దు.
ఎందుకంటే పది నిమిషాల్లో మీ ఇంటికి చేరడం ఒక సౌకర్యం మాత్రమే. కానీ ఆ ప్యాకెట్లో ఏముందో తెలుసుకోవడం.. మీ కుటుంబ భద్రత.








