విశాల్ డైరెక్షన్ డెబ్యూకి ప్రశంసలు
విశాల్(Vishal) దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా మకుటం(Makutam) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. సినిమా టేకింగ్, కథనం, విజువల్ మేకింగ్‌పై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ గా విశాల్ చూపించిన కాన్ఫిడెన్స్, సన్నివేశాల నిర్మాణం, యాక్షన్ ఎలిమెంట్స్‌ను హ్యాండిల్ చేసిన తీరు ఆడియన్స్ ను ఆకట్టుకుంటోందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. నటుడిగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విశాల్, ఈ సినిమాతో డైరెక్టర్‌గానూ విజయవంతమైన ఆరంభం చేశారని పలువురు పేర్కొంటున్నారు.
వాస్తవానికి మకుటం మరో డైరెక్టర్ తో మొదలైన ప్రాజెక్ట్. అయితే మధ్యలో అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో సినిమా పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాంటి సమయంలో విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సినిమాను పూర్తి చేశారు. ఒకేసారి హీరోగా నటిస్తూ, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించడం పెద్ద సవాల్‌గా భావించినా, ఆ బాధ్యతను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినట్లు ఆడియన్స్ రెస్పాన్స్ సూచిస్తుంది. ఈ సినిమాలో దుషారా విజయన్(Dushara Vijayan), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటించగా, విశాల్ త్రిపాత్రాభినయం చేయడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
సినిమా చూసిన ఆడియన్స్, సినీ విశ్లేషకులు విశాల్ దర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కథను ఎమోషనల్‌గా చెప్పడంతో పాటు కమర్షియల్ అంశాలను సమతుల్యంగా మిళితం చేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్, త్రిపాత్రాభినయానికి సంబంధించిన ట్రీట్మెంట్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా మకుటంతో విశాల్ డైరెక్టర్ గా చేసిన తొలి ప్రయత్నం ఆయన కెరీర్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.








