ఇక రైల్వేలో AI War Room, మనకేంటి ఉపయోగం?
ఇంతకాలం రైల్వే స్టేషన్ అంటే మనకు కనిపించేది ప్లాట్‌ఫామ్, రైలు, టికెట్ కౌంటర్, అనౌన్స్మెంట్లు. కానీ ఇకపై ప్రతి స్టేషన్ వెనుక మనకు కనిపించని మరో ‘డిజిటల్ లేయర్’ కూడా ఉండబోతోంది. మనం ఒక ప్లాట్‌ఫామ్‌పై నిలబడి రైలు కోసం ఎదురుచూస్తుంటే.. అదే సమయంలో దేశ రాజధానిలోని War Roomలో ఆ స్టేషన్ పరిస్థితి లైవ్‌గా కనిపిస్తుంటుంది. ప్రయాణికుల రద్దీ ఎలా ఉంది? రైళ్లు ఎక్కడ ఉన్నాయి? ఏదైనా సమస్య తలెత్తిందా? ఏ రైలు ఆలస్యమవుతోంది? వంటి వివరాలను AI ఆధారంగా అధికారులు ఒకే చోట నుంచి గమనించగలరు.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ War Room పనితీరును Parliamentary Affairs Minister కిరెన్ రిజిజు, Labour Minister మన్సుఖ్ మాండవీయాలకు ప్రత్యక్షంగా చూపించారు. లైవ్ స్టేషన్ ఫీడ్స్, AI ఆధారిత విశ్లేషణ, రైళ్ల ఆపరేషనల్ డేటా వంటి అంశాలను వారికి వివరించారు.
ఈ వ్యవస్థను తొలుత కుంభమేళా సమయంలో భారీ రద్దీని పర్యవేక్షించేందుకు ఉపయోగించగా, ఇప్పుడు దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లకు విస్తరించారు. దీని వల్ల రద్దీ పెరగడం లేదా రైళ్ల ఆలస్యం వంటి సమస్యలను గుర్తించి అధికారులు ముందుగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.అవసరమైతే ఒక నిర్దిష్ట కెమెరా ఫీడ్‌ను జూమ్ చేసి అక్కడి పరిస్థితిని దగ్గరగా పరిశీలించవచ్చు.
ఫలితం ఏమిటి
రైల్వేలో దీని అసలు ఉపయోగం ‘రద్దీని చూడటం’ కంటే చాలా పెద్దది. ఒక స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగితే, మరో చోట రైలు ఆలస్యం వల్ల ప్లాట్‌ఫామ్‌పై జనసమ్మర్థం ఏర్పడితే.. అధికారులు పరిస్థితిని వేగంగా అంచనా వేసి చర్యలు తీసుకోవచ్చు. ఒక చిన్న సమస్య పెద్ద ఆపరేషనల్ సమస్యగా మారకముందే దాన్ని గుర్తించడం ఈ వ్యవస్థకు ఉన్న ముఖ్యమైన ప్రయోజనం.
ఇక నుంచి AI రైల్వే కెమెరా ఫీడ్స్‌ను విశ్లేషిస్తోంది. రేపు ఏ స్టేషన్లో రద్దీ పెరగబోతోందో ముందే అంచనా వేస్తుది. ఏ రైలు ఆలస్యం అయితే దాని ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో గుర్తిస్తుంది. అవసరమైన చోట సిబ్బంది, ప్లాట్‌ఫామ్‌లు, రైళ్ల నిర్వహణపై సూచనలు కూడా ఇవ్వొచ్చు.
అంటే రైల్వేలో AI కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పటివరకు మనం రైలును ట్రాక్ చేసేవాళ్లం. ఇకపై రైల్వే వ్యవస్థే మన కంటే ముందుగా పరిస్థితిని గమనించే రోజులు వస్తున్నాయి. అదే ఈ కొత్త AI War Room అసలు కథ.








