రాష్ట్రపతి చేతులమీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గుమ్మడి గోపాలకృష్ణ
తెలుగు నాటకరంగానికి, ముఖ్యంగా పద్య నాటక రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘సంగీత నాటక అకాడమీ (2024)’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ డాక్టర్ ఆర్జ శ్రీకాంత్ అభినందనలు తెలియజేశారు.
నాలుగు దశాబ్దాల సేవకు తగిన గుర్తింపు…
నాలుగు దశాబ్దాలుగా తెలుగు నాటకరంగానికి, పద్య నాటక సాంప్రదాయానికి గోపాలకృష్ణ చేసిన కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును అందజేసింది. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, శ్రీనాథుడు వంటి పౌరాణిక, చారిత్రక పాత్రల్లో ఆయన జీవించేవారని అంటారు. ఆయన గంభీరమైన స్వరం, పద్య పఠనం, సాంస్కృతిక అవగాహన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. అమెరికాలో ఆయన ఇప్పటికీ తెలుగు నాటక వైభవాన్ని వివిధ చోట్ల తన ప్రదర్శనల ద్వారా జనరంజకం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్గా ఉన్న గోపాలకృష్ణ అనుభవం, యువ కళాకారులను ప్రోత్సహించడానికి మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటానికి ఎంతగానో దోహదపడుతుందని డాక్టర్ ఆర్జ శ్రీకాంత్ అంటూ ఆయన మరింతగా నాటకరంగానికి సేవలందించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అవార్డు కేవలం ఒక కళాకారునికి దక్కిన గుర్తింపు మాత్రమే కాదని, తెలుగు నాటకరంగం సాధించిన గొప్ప విజయమని డాక్టర్ ఆర్జ శ్రీకాంత్ కొనియాడారు. పలువురు అభిమానులు కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు.
డిజిటల్ సాంకేతికతతో కళను యువతకు చేరువచేస్తూ, మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు గోపాలకృష్ణ చర్యలు తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ప్రవాసాంధ్రుల కోసం విదేశాల్లోనూ పద్య నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దేశ, విదేశాల్లో యువతకు పద్య నాటకంలో శిక్షణ ఇచ్చి, వారితో ప్రదర్శనలు ఇప్పించి కళకు ప్రాణం పోస్తున్నారు.








