స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో ఘన కీర్తిని చాటుదాం : ప్రధాని మోదీ పిలుపు
ప్రజలంతా స్వాతంత్ర దినోత్సవాన్ని సగౌరవంగా జరుపుకోవాలని, ఘన కీర్తిని చాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఈ మేరకు మంగళవారం ఇన్స్టాగ్రామ్లో వీడియో సందేశం పోస్టు చేశారు. ‘మన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పిద్దాం. భారత అభివృద్ధికి ప్రతినబూనుదాం. ఇంటింటా మువ్వన్నెల పతాకం ఎగురవేద్దాం.. ప్రతి మనసులో త్రివర్ణ పతాకం ప్రతిష్టించుకుందాం. భారత్ మాతా కీ జై.. వందేమాతరం’ అని మూడుసార్లు ఆయన నినదించారు. అందులో మంగళవారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం వీడియోను కూడా తన పోస్టుకు జతచేశారు. ఆ భేటీకి ఆయన వస్తుండగా.. కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ.. ‘వందేమాతరం, భారత్ మాతా కీ జై’ అనే నినాదాలతో స్వాగతించారు. ఆయన కూడా మువ్వన్నెల జెండాను పట్టుకుని ఊపుతూ ఎంపీల ముందుకు సాగారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతి వారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలాన్’ సమావేశం జరుపుతున్న సంగతి తెలిసిందే.
మరో వైపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధులకు నివాళులర్పించాలని కోరారు. ‘‘హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా.. హర్ మన్ తిరంగా’’ అంటూ దేశప్రజల్లో జాతీయభావాన్ని, స్ఫూర్తిని నింపారు.ఈ ఏడాది నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందని, దీనిని ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశభక్తిని, త్రివర్ణ పతాకంపై ఉన్న గౌరవాన్ని, మాతృభూమిపై ప్రేమను చాటుకునేలా ఈ వేడుకలను నిర్వహించాలని సూచించారు.








