డాక్టర్ అవ్వాలంటే ఏడాది గ్రామంలో సేవ చేయాల్సిందేనా?
దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు ఒక సంవత్సరం గ్రామీణ సేవను తప్పనిసరి చేసే ఏకరీతి జాతీయ విధానం అవసరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది. కర్ణాటకలో అమల్లో ఉన్న తప్పనిసరి గ్రామీణ సేవా నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా, వైద్య విద్యలో ప్రభుత్వ సబ్సిడీల ప్రాధాన్యతను కోర్టు ప్రస్తావించింది. వైద్య విజ్ఞానం కూడా దేశానికి అవసరమైన ఒక వనరు అని, సమాజ సంక్షేమం, దేశ నిర్మాణంలో వైద్యులకు బాధ్యత ఉందని జస్టిస్ నరసింహ వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో ప్రభుత్వ సీట్లు మాత్రమే కాకుండా ప్రైవేట్ సీట్లలో చదివిన వైద్య విద్యార్థులకు కూడా గ్రామీణ సేవను తప్పనిసరి చేయడాన్ని పిటిషనర్ సవాలు చేశారు. భారీ ఫీజులు చెల్లించే ప్రైవేట్ విద్యార్థులను ప్రభుత్వ సబ్సిడీతో చదివిన వారితో సమానంగా చూడటం సరికాదని ఆయన వాదించారు. అయితే ఈ నిబంధనను దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలా అనే అంశంపై కేంద్రం అభిప్రాయాలను తెలుసుకోవాలని సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.








