90 ఏళ్ల వృద్ధురాలిని కలిసిన సీఎం చంద్రబాబు
ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. ఇదే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ చేనేత కుటుంబాన్నీ ముఖ్యమంత్రి కలిశారు. ఇటీవల చీరాలకు చెందిన పుష్పావతి(Pushpavathi) (90) అనే వృద్ధురాలు సీఎం చంద్రబాబును కలవాలనే తన ఆకాంక్షను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది సోషల్ మీడియా (Social media)లో పోస్టు చేయగా అది వైరల్ అయ్యింది. ఆ వీడియో కాస్తా సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చాలని భావించారు. అంతర్జాతీయ చేనేత దినోత్సవం నాడు ఆమెను చీరాల (Chirala)లో కలిసి మాట్లాడతానంటూ హామీ ఇచ్చారు. ఈ మేరకు నేడు చీరాలలో తన అభిమాని అయిన ఆ వృద్ధురాలిని చంద్రబాబు కలిశారు. ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె కోరిక మేరకు ఫొటో దిగారు. సీఎం చంద్రబాబుతో ఫొటో దిగడంపై ఆ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. జీవితకాల కోరిక నెరవేరిందంటూ సంబరపడ్డారు.








