భాష అంతరిస్తే జాతి అంతరిస్తుంది
భాష అంతరిస్తే జాతి అంతరిస్తుందని, భావ వ్యక్తీకరణకు భాషే ప్రధానమని ‘ఈనాడు’ దినపత్రిక ఎడిటర్ మానికొండ నాగేశ్వరరావు అన్నారు. తమ మూలాలను కాపాడుకోవడానికి మాతృభాషను పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు.
గురువారం డల్లాస్ లోని మెలిస్సాలో శుభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలజల నాగరాజు తన తండ్రి స్మారకార్థం నిర్వహిస్తున్న ఎన్వీఎల్ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు అన్నమనేని శ్రీరామ్‌తో కలిసి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగేశ్వరరావు గారు హాజరైన వారందరి సందేహాలకు సమగ్రంగా సమాధానమిచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలు తదుపరి తరాలకు అందాలని, అందుకోసం పిల్లలను వారి పెద్దలకు దగ్గర చేయాలని సూచించారు.
ఒకప్పుడు సమాజానికి దిశానిర్దేశం చేసిన జర్నలిజం కూడా అన్ని రంగాల మాదిరిగానే విశ్వాసాన్ని కోల్పోతోందని, ముఖ్యంగా ముద్రణా రంగం ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని సీనియర్ జర్నలిస్టు అన్నమనేని శ్రీరామ్ అన్నారు. శాటిలైట్, డిజిటల్ మీడియా రాకతో చోటుచేసుకున్న మార్పులను ఆయన వివరించారు.
ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని హాజరైన వారందరూ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉమాదేవి గారు, కిశోర్, సాయిచంద్, గోపీచంద్, నిర్మల యద్దులపల్లి, సాయి, సురేష్ మండువ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో లెనిన్, అనంత్ మల్లవరపు, బద్రి, రవి, వెంకట్ కీలక పాత్ర పోషించారు.








