ఐపిఎల్ లో పాకిస్తాన్ ప్లేయర్ ఎంట్రీ..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ ఐపీఎల్లో ఆడటంపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవలే బ్రిటిష్ పౌరసత్వం (UK Citizenship) మరియు యూకే పాస్‌పోర్ట్‌ను అధికారికంగా పొందిన అమీర్.. గ్లోబల్ లీగ్స్‌లో ఆడేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ముంబై ఉగ్రదాడుల తర్వాత ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం ఉన్నప్పటికీ, అమీర్ ఇప్పుడు బ్రిటన్ పౌరుడిగా మారడంతో టెక్నికల్‌గా ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకోవడానికి అర్హత సాధించాడు. దీంతో అతను భవిష్యత్తు ఐపీఎల్ సీజన్లలో కనిపిస్తాడా లేదా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ (The Hundred) టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు లోకల్ ప్లేయర్‌గా ఆడుతున్న అమీర్‌ను ఐపీఎల్ ఎంట్రీపై మీడియా ప్రశ్నించింది. దీనిపై స్పందించిన అమీర్, ప్రస్తుతానికి ఐపీఎల్ వేలంలో పాల్గొనడంపై తాను ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పాడు. “నేను 2027 పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో ఓవర్సీస్ ప్లేయర్‌గా ఆడబోతున్నాను, కానీ ఐపీఎల్లో పాల్గొనడంపై ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేదు, ఏం జరుగుతుందో చూడాలి” అంటూ ఎటూ తేల్చకుండా సమాధానమిచ్చాడు.
గతంలో కూడా పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఆల్‌రౌండర్ అజహర్ మహమూద్ బ్రిటిష్ పౌరసత్వం పొందిన తర్వాతే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడిన దాఖలాలు ఉన్నాయి. మహ్మద్ అమీర్ భవిష్యత్తులో ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకుంటే, బీసీసీఐ మరియు లీగ్ నిబంధనల ప్రకారం అతనికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. 34 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం పేసర్ 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ప్రస్తుతం కేవలం ఫ్రాంచైజీ లీగ్స్పైనే దృష్టి సారించాడు.








