అమరావతిలో మంత్రుల సెల్ఫీ వైరల్..!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న మౌలిక వసతులు, భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, వంగలపూడి అనిత(Vangalapudi Anitha), కొండపల్లి శ్రీనివాస్(Kondapalli Srinivas) బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. రాజధాని పరిధిలో మళ్లీ పుంజుకున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని, నిర్మాణ దశలను మున్సిపల్ మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ తన సహచర మంత్రులకు స్వయంగా దగ్గరుండి వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులలో సాధించిన వేగాన్ని, భవిష్యత్తు ప్రణాళికలను ఈ సందర్భంగా మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. “అమరావతి” అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, అది ఐదు కోట్ల ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాటు నిర్వీర్యమైన రాజధానిని మళ్లీ గాడిలో పెట్టి, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు.
ఐకానిక్ భవనాల నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడం సంతోషకరమన్నారు. మరోవైపు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి అభివృద్ధి పనులను నేరుగా వీక్షించడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ఇంతటి భారీ, ప్రపంచస్థాయి అత్యాధునిక రాజధానిని మనం నిర్మించుకుంటున్నందుకు ఒక ఆంధ్రుడిగా తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా అమరావతి నిర్మాణ విశేషాలకు గుర్తుగా ‘ఐకానిక్ టవర్స్’ ముందర సహచర మంత్రులతో కలిసి ఆయన దిగిన సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.








