దేశ చరిత్రలో ఈలాంటి కేసు చూడలేదు : ఏబీ వెంకటేశ్వరరావు
దేశ చరిత్రలో జెత్వానీ (Jethwani) లాంటి కేసును తానెప్పుడూ చూడలేదని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు (AB Venkateswara Rao) వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు, తర్వాత కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కట్టకముందే ముంబయి వెళ్లి జెత్వానీ, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేశారు. ఎన్నికలు ముగిశాక ఈ కథ వెనుక అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది అని పేర్కొన్నారు. పోలీసులు దీనిపై రెండు కేసులు నమోదు చేసి, సీఐడీ (CID)కి బదిలీ చేశారని గుర్తు చేశారు. కోర్టులో వేసిన పత్రాలను బట్టి చూస్తే జెత్వానీపై తప్పుడు కేసు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఇటీవల జెత్వానీ, పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ (Kukkala Vidyasagar)ను బ్లాక్మెయిల్ చేసి రూ.కోట్లు దోచుకున్నట్లు కథనాలొచ్చాయని అన్నారు. గతంలో ఆమె బాధితురాలు కాగా, ఇప్పుడు నిందితురాలిగా ఎలా మారారని ప్రశ్నించారు. గతంలో అమాయకురాలని రాసి, ఇప్పుడు బ్లాక్ మెయిల్, హానీట్రాప్ అంటున్నారని, వీటిల్లో ఏది నిజమని నిలదీశారు. విద్యాసాగర్‌పై 17 కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో చూపారని, ఆయన పారిశ్రామికవేత్తగా ఎలా మారారని ప్రశ్నించారు. మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చిన ఇదే కేసులో బాధితులను నిందితులుగా మార్చారన్నారు.








