ఆటా మహా సభల గ్రాండ్ సక్సెస్‌పై జయంత్ చల్లా భావోద్వేగ ప్రసంగం
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ వేడుకలకు విచ్చేసిన బాల్టిమోర్ ప్రజలకు, తెలుగు వారందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వహణలో ఎదురైన అనుభవాలను, వాలంటీర్లు అలాగే కార్యవర్గ సభ్యుల సేవలను ఆయన కొనియాడారు.
సవాళ్లు – అనుభవాలు
ఈ మహాసభలను విజయవంతం చేయడానికి ఏడాది కాలంగా తాము ఎంతగానో శ్రమించామని, ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడానికి పడిన కష్టాలను జయంత్ చల్లా గుర్తుచేసుకున్నారు. ముందుగా అనుకున్న వీకెండ్‌ను కొన్ని కారణాల వల్ల కోల్పోవలసి వచ్చిందని, ఆ తర్వాత హోటళ్లు, కన్వెన్షన్ కాంట్రాక్టులు, వెండర్లతో మాట్లాడడం సవాల్‌తో కూడుకున్న పని అని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, మార్కెట్ ఒడుదొడుకుల మధ్య ఈ స్థాయి సదుపాయాలతో సభను నిర్వహించడం చాలా కష్టమైనప్పటికీ, వర్జీనియా, మేరీల్యాండ్, భారత్ నుంచి ఎంతోమంది మంచి మిత్రులు తమకు అండగా నిలిచారని పేర్కొన్నారు. గత ఆరు నెలలుగా తన అసలు ఉద్యోగం ఏంటో మర్చిపోయేలా రోజుకు 12 నుండి 14 గంటలు ఆటా కోసమే పనిచేశానని, అర్ధరాత్రి కూడా ఆలోచిస్తూ గడిపానని భావోద్వేగానికి గురయ్యారు.
కుటుంబం, కోర్ టీమ్ సహకారం
ఈ ప్రయాణంలో తనకు అన్ని విధాలుగా అండగా నిలిచిన తన సతీమణి కవిత చల్లాకు, తన పిల్లలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను పడుతున్న ఒత్తిడిని చూసి ఆమె ఎన్నో ఉపవాసాలు, పూజలు చేస్తూ మద్దతుగా నిలిచారన్నారు. కన్వీనర్ శ్రీధర్, సతీష్, కోర్ టీమ్ సభ్యులు అందరినీ ఆయన గుర్తుచేసుకున్నారు.
వాలంటీర్లు, కార్యవర్గ సభ్యుల సేవలకు ప్రశంసలు
అమెరికాలోని నార్త్ ఈస్ట్ బోస్టన్ నుండి సౌత్ వెస్ట్ శాండియాగో వరకు, నార్త్ వెస్ట్ సియాటెల్ నుండి సౌత్ ఈస్ట్ మయామి వరకు ఉన్న అన్ని ప్రాంతాల నుండి ఆటా కార్యకలాపాలు ఎంతో అద్భుతంగా సాగుతున్నాయని జయంత్ చల్లా తెలిపారు. రీజినల్ కోఆర్డినేటర్లు, డైరెక్టర్లు , స్టాండింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా అంకితభావంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీరి సహాయ సహకారాలు లేకపోతే ఆటా సంస్థ ఇవాళ ఈ స్థాయిలో విజయాలు సాధించి ఉండేది కాదని పేర్కొంటూ, సంస్థ కోసం సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
సంస్కృతితో సమన్వయం…
అమెరికాలో తెలుగు గుర్తింపును ఎప్పటికీ కాపాడుకుంటూనే, స్థానిక అమెరికన్ సంస్కృతితో , కమ్యూనిటీతో మరింతగా కలిసిపోవాలని మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మహాసభల విజయవంతం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.








