ప్రాంతాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒక్కటే: లక్ష్మా రెడ్డి
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా ఘనంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్, ఇతర కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ, ఇలాంటి వేదికల ద్వారా తెలుగు ప్రజలందరూ ఒకేచోట కలిసిగట్టుగా ఉంటున్నారని, తెలుగువారంతా ఎప్పటికీ ఒక్కటే అనే భావనను చాటుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక అపోహలు ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పోటీపడి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో అభివృద్ధి సాధిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్న పరిస్థితుల వల్లే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆటా సభలకు హాజరుకాలేదని చెప్పారు. అమెరికాకు వచ్చి ప్రవాస తెలుగువారందరితో కలిసి వేదికపంచుకునే అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








