గోవిందా: ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ రివ్యూ
అడ్డూ, అదుపూ లేని కష్టాలకు కేరాఫ్ ఎడ్రస్ లాంటి మనిషి వెంకటరమణ(శ్రీకాంత్). ఈ మిడిల్ క్లాస్ మహానుభావుడు పేరుకు తగ్గట్లే వెంకటేశ్వరస్వామి భక్తుడు. పద్మావతి(లయ)అనే పేరు ఉందనే ఆమెను భార్యగా తెచ్చుకునేటంత భక్తి ఉన్న భర్త అతను. ఇక ఇతను తండ్రి ఏడుకొండలు(మురళి గాడ్), చెల్లి(కరుణ), బావ(భూపాల్), పిల్లలతో కలిసి సంసార సాగరాన్ని ఈదుతూంటాడు. కానీ ఎప్పటికీ ఒడ్డున పడడు. దాంతో తను నమ్మి కొలిచే వెంకన్నబాబు మీద కోపం తెచ్చేసుకుంటాడు.
అలిగేసి ఆయన్ని ప్రక్కన పెట్టేస్తాడు. అయితే ఆయన ఊరుకుంటాడా..తన గుడి దగ్గరే వెంకట రమణకు ఉద్యోగం ఇప్పించి ప్రక్కనే పెట్టుకుంటాడు. ఖాళీగా ఉన్న ఓ రోజు అతనికి దర్శనం కూడా ఇస్తాడు. దర్శనం ఒకటే బాగోదని ఒక వరంగా అతనికో పుస్తకం ఇస్తాడు. ఆ పుస్తకంలో ఏం రాస్తే అది జరిగిపోతుందన్నమాట. ఆ వరం వెంకటరమణకు మొదట బాగానే ఉన్నా,తర్వాత కష్టాలు కారేసుకుని మరీ వెంటబడతాయి. ఆ వరం వెంకట రమణకు ఎలా రివర్స్ అయ్యింది. వరం ఇచ్చినప్పుడు వెంకటేశ్వరస్వామి పెట్టిన కండీషన్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఈ సినిమాలో మొదట అరగంట రొటీన్ అయినా సెటప్ కాబట్టి ఎమోషనల్ డ్రామా ని చూస్తాడు. ఆ తర్వాత వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమవుతాడు. ఇక్కడి నుంచి సినిమా ఫాంటసీ డ్రామా అవుతుంది. ఇక్కడే రచయితకు పెద్ద బాధ్యత మొదలవుతుంది. వెంకటేశ్వరస్వామి ఎందుకు వచ్చాడు. సమస్యలు పరిష్కరించడానికి రాలేదు. పరీక్ష పెట్టడానికి వచ్చాడు అన్నట్లుండాలి. ఈ ఒక్క లైన్ మీద సినిమా మొత్తం నడవొచ్చు.
అప్పుడు కథలో అసలు విలన్ ఎవరు? చాలా సినిమాలు ఇక్కడే తప్పు చేస్తాయి. బయట విలన్ పెడతాయి. కానీ… ఇలాంటి సినిమాల్లో విలన్… Book కాదు.దేవుడు కాదు. యముడు కాదు. మనిషి అత్యాశ.అదే ఈ కథ చెప్పాలనుకున్నది… “దేవుడు అవసరాన్ని ఇస్తాడు.. అత్యాశను కాదు.” అప్పుడు ఇది చాలా మంచి థీమ్ అవుతుంది.
అలాగే కథలో కాంప్లిక్ట్ ఉండాలి. అంటే Stakes పెరగాలి హీరో కొరుకునే ప్రతి కోరిక… కొత్త ప్రమాదం తెచ్చాలి.
పుస్తకం ఎంత ఎక్కువ ఉపయోగిస్తే… అంత పెద్ద ధర చెల్లించాలి. అప్పుడు ప్రేక్షకుడు…”అయ్యో రాయొద్దు…” అని అనుకుంటాడు. అదే కథనం. ఉదాహరణకు Bookతో డబ్బు వచ్చింది.కానీ…కొడుకు ప్రేమ పోయింది. లేదా…భార్య నమ్మకం పోయింది. లేదా…మనశ్శాంతి పోయింది ఇలా చూపెడితే డబ్బు vs జీవితం అనే Conflict వస్తుంది.కామెడీ సినిమాకు ఇంత ఆలోచించటం అవసరమా అనుకుంట చేసేదేమీ లేదు. దీనికి తోడు దేవుడి సినిమాలో Double meaning కామెడీ. దాన్ని ఎందుకు పెట్టారో మరి.
ఎవరెలా చేసారు
టెక్నికల్ గా గొప్పగా ఏమీ లేదు. దర్శకుడు నాగేశ్వరరెడ్డి గతంలో మంచి కామెడీ సినిమాలు చేసాడు. మరి ఎందుకో అప్పటి పల్స్ ని వదిలేసాడు. ఇక శ్రీకాంత్, లయ, రాజేంద్రప్రసాద్‌లు పరిధి మేరకు న్యాయం చేశారు. ఉన్నంతలో వెన్నెల కిషోర్ నవ్విస్తాడు. సునీల్‌కి గ్యాంగ్‌స్టర్ పాత్ర మ్యాడ్ స్క్వేర్ లోదే మళ్లీ చూస్తున్నట్లు ఉంది.
ఫైనల్ థాట్
ఈ సినిమా కు వెంకన్నబాబు మహత్యం అని టైటిల్ పెడితే బాగుండేది. ఆయన భక్తులు అయినా కరుణిద్దురేమో.








