పుట్టిన గడ్డను, సంస్కృతిని మర్చిపోవద్దని ఎన్నారైలకు పిలుపునిచ్చిన మంత్రి సీతక్క
చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అమెరికాలో వేలాది మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు చూస్తుంటే తాను తెలంగాణ గడ్డపైనే ఉన్నాననే భావన కలిగిందని ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో స్థిరపడి, తమ కలలను సాకారం చేసుకుంటున్న ప్రవాసులు, తమ మూలాలను, భాషను, సంస్కృతిని మర్చిపోకుండా కాపాడుతున్నందుకు ఆమె ప్రశంసించారు.
ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ, భారత్‌లో ఉన్న కన్నవారికి కేవలం ఆర్థిక సహాయం పంపడం మాత్రమే కాకుండా, తమ కుటుంబ సభ్యులపై ప్రేమను, ఆప్యాయతను పంచాలని సూచించారు. తాత ముత్తాతలను, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలని, ఎప్పటికప్పుడు స్వగ్రామాలకు వచ్చి వెళ్తూ సంబంధాలను బలపరుచుకోవాలని కోరారు. ఎన్ని విదేశీ సంస్కృతుల్లో జీవిస్తున్నా, మన మూలాలను మాత్రం విస్మరించకూడదని గాంధీజీ మాటలను గుర్తు చేశారు.
అభివృద్ధి చెందిన దేశాలలో నేర్చుకున్న కొత్త ఆవిష్కరణలను, నైపుణ్యాలను రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలని ఆమె కోరారు. ఒక ఊరును దత్తత తీసుకోవడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం లేదా విద్యార్థులకు మెంటార్‌గా వ్యవహరించడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వాలని (Pay Back to Society) ఆమె పిలుపునిచ్చారు. అడవిలో పుట్టిన తాను, ఇవాళ అసెంబ్లీ నుండి అమెరికా దాకా ప్రయాణించానని, అదే స్ఫూర్తితో మన వనదేవతలను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె భావోద్వేగంతో తెలిపారు. మీకు ఏ సమస్య ఉన్నా ‘మీ ఆడబిడ్డ సీతక్క ఉంది’ అని గుర్తుపెట్టుకోవాలని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.








