తిరుమలలో ‘దర్శనం అయిపోయింది… ఇంటికి వెళ్దాం’ అని ఇంక అనలేరు
ఉదయం ఏడున్నర.
ఎటు చూసినా గోవింద నామస్మరణ.
తిరుమలలో చాలా మందికి దర్శనం పూర్తయింది.
లడ్డూ కౌంటర్ దగ్గర క్యూలు క్రమంగా తగ్గుతున్నాయి. బయట పార్కింగ్ వైపు నడుస్తున్న కుటుంబాల్లో కొందరు హిందీలో మాట్లాడుతున్నారు. కొంచెం దూరంలో మరాఠీ. ఇంకో వైపు గుజరాతీ.ఇలా దేశం నలుమూలలు కనపుడుతున్నాయి. పిల్లల చేతుల్లో లడ్డూ సంచులు. పెద్దల మనస్సులో తిరుగు ప్రయాణం ఆలోచనలు,ప్లాన్ లు.
వాళ్ళలో కొందరు తిరుపతి నుంచి ప్రక్కునే ఉన్న తమిళనాడు వైపు వెళ్లి అక్కడ దేవాలయాలు చూసి రావటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
మరికొందరు బెంగళూరు దారి పడుతున్నారు.
ఇంకొందరు శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ (వెల్లూరు) వంటి సమీప క్షేత్రాలను తమ ప్రయాణంలో చేర్చుకున్నారు.
అదే సమయంలో…
విశాఖ సముద్రతీరంలో అలలు ఎప్పటిలాగే ఒడ్డును తాకుతూనే ఉన్నాయి. అరకు లోయలో ఉదయం పొగమంచు ఇంకా పూర్తిగా తొలగ లేదు.గోదావరి ఒడ్డున పడవలు ప్రయాణానికి సిద్ధమవుతుంటాయి.
అయితే ఆ తిరుపతి ప్రయాణీకీల లిస్ట్ లో విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ లోని మిగతా పుణ్య క్షేత్రాలు లేదా పర్యాటక ప్రదేశాలు ఉండటం లేదు. అరకు ఉండదు. గోదావరి ఉండదు. వాళ్ల ప్రయాణం ఇక్కడితో ముగిసిపోతుంది.
ఇవి కూడా చదవండి
ఎందుకిలా జరుగుతోంది?
ఈ ప్రదేశాలన్నీ ఒకే రాష్ట్రంలో ఉన్నాయని, ఒకే ట్రిప్ లో చూడొచ్చని దేశం నలుమూలల నుంచి వచ్చిన ఆ యాత్రికుల్లో చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసినా, ఆ ప్రయాణాన్ని అలా ప్లాన్ చేసుకునే అవకాశం, ఆలోచన ఇప్పటివరకు జరగటం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు మార్చాలని చూస్తున్నది అదే. ఇది కొత్త బీచ్‌లు నిర్మించే ప్రణాళిక కాదు. కొత్త దేవాలయాలు కట్టే ప్రాజెక్ట్ కూడా కాదు. ఇప్పటికే ఉన్న ప్రదేశాలను… ఒకే జర్నీగా మార్చే ప్రయత్నం.
ఇన్నాళ్లూ ఉన్న పాత పద్ధతులను పక్కన పెట్టి, రాష్ట్రం ఒక పెద్ద “టూరిజం ఎక్స్పెరిమెంట్” చేస్తోంది. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే… ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకం అంటే కేవలం ఒక రోజు యాత్ర కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే మార్చే ఒక సరికొత్త వీకెండ్ అనుభవంగా మారవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కే ఈ సమస్య ఎందుకు?
దేశంలో ప్రతి రాష్ట్రం పర్యాటక పరంగా ఒక గుర్తింపును సంపాదించుకుంది. గోవా అంటే బీచ్‌లు. కేరళ అంటే బ్యాక్‌వాటర్స్. రాజస్థాన్ అంటే కోటలు. హిమాచల్ అంటే మంచు కొండలు..ఇలా లిస్ట్ కొనసాగుతూనే ఉంటుంది.
కానీ ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం ఒకే మాటలో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక్క ఎట్రాక్షన్ మీద నిలబడలేదు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన తిరుమల ఉంది. వెయ్యి కిలోమీటర్లకు చేరువైన సముద్ర తీరం ఉంది. అరకు లోయ ఉంది. బొర్రా గుహలు ఉన్నాయి. గోదావరి ఉంది. బౌద్ధ వారసత్వం ఉంది…ఇంకా చాలా ఉన్నాయి.
లోటు ఎక్కడుంది?
లోటు ప్రకృతిలో లేదు. లోటు… ఈ ప్రదేశాలన్నింటినీ ఒకే కథగా చెప్పడంలో ఉంది. ఇప్పటివరకు ప్రయాణాలు విడివిడిగానే జరిగాయి. తిరుమలకు వచ్చే వారు తిరుమలనే చూసి వెళ్లిపోతున్నారు. విశాఖకు వచ్చే వారు బీచ్ వరకే పరిమితమవుతున్నారు. అరకు ఒక ప్రత్యేక ట్రిప్‌గా మారింది. గోదావరి ఇంకో ప్రయాణంగా మిగిలిపోయింది.
ఇలా ప్రతి ప్రాంతం తనదైన పర్యాటకాన్ని సృష్టించుకుంది. కానీ రాష్ట్రం మొత్తం కలిసి ఒక పర్యాటక అనుభవంగా మారలేదు. ఇప్పుడు ఆ ఖాళీని పూరించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది.
తిరుమలకు వచ్చి… ఆంధ్రప్రదేశ్‌ను చూడకుండానే వెళ్లిపోతున్నారు! ఇప్పుడు అదే మార్చాలని చూస్తోంది ఈ రాష్ట్రం ఆలయాలు, సముద్రం, కొండలు, నదులు… అన్నీ ఉన్నా దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుడిని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తన టూరిజం కథను కొత్తగా రాయాలని చూస్తోంది.
ఢిల్లీ నుంచి వచ్చిన కుటుంబం తిరుమల దర్శనం తర్వాత విశాఖలో రెండు రోజులు గడపాలి. ముంబయి నుంచి వచ్చిన పర్యాటకుడు అరకు వరకు వెళ్లాలి. కోల్‌కతా నుంచి వచ్చిన యాత్రికుడు గోదావరి ఒడ్డున ఒక సాయంత్రం గడపాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి ఒక గమ్యస్థానంగా గుర్తుండిపోతుంది.
టూరిజం లెక్క మారింది
ఒకప్పుడు రాష్ట్రాలు వచ్చిన పర్యాటకుల సంఖ్యను చెప్పుకునేవి. ఇప్పుడు ఇంకో సంఖ్యకు విలువ పెరిగింది. ఒక పర్యాటకుడు తమ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు? అనే లెక్కలు వేస్తున్నాయి. ఎందుకంటే అదనపు రోజు అంటే ఒక హోటల్ గది మాత్రమే కాదు. ఉదయం ఒక టిఫిన్ సెంటర్లో అల్పాహారం. మధ్యాహ్నం స్థానిక రెస్టారెంట్లో భోజనం. సాయంత్రం ఒక ఆటో ప్రయాణం. రాత్రి ఒక హోటల్ బుకింగ్. మరుసటి రోజు స్థానిక మార్కెట్లో షాపింగ్.
ఒక రోజు పెరిగితే… ఆ డబ్బు ఒక పెద్ద కంపెనీ దగ్గర కాదు, వందల చిన్న వ్యాపారాల మధ్య తిరుగుతుంది. ఇదంతా గమనించిన ప్రభుత్వం పెట్టుబడుల దృష్టి మారింది. టూరిజానికి పరిశ్రమ హోదా ఇవ్వడం, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం, కొత్త హోటళ్లు, రిసార్టులకు అవకాశాలు కల్పించడం… ఇవన్నీ ఈ ఆలోచనలో భాగమే.
ప్లాన్ పరిమాణం ఎంత?
ఈ ప్రయోగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం పర్యాటకరంగానికి “పరిశ్రమ హోదా” (Industry Status) కల్పించింది. అంటే తయారీ రంగానికి ఇచ్చినట్టే సబ్సిడీలు, పన్ను మినహాయింపులు లభిస్తాయి.
రూ. 25,000 కోట్ల లక్ష్యం: ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా ఈ స్థాయి క్యాపిటల్‌ను ఆకర్షించాలని అంచనా వేస్తున్నారు.
పెద్ద బ్రాండ్ల ఆసక్తి: Taj, Marriott, Hyatt, Hilton వంటి ప్రముఖ గ్రూపుల ద్వారా దాదాపు 7,700 కి పైగా కొత్త హోటల్ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాథమిక చర్చలు, ఒప్పందాలు జరిగాయి.
50,000 గదుల టార్గెట్: రాబోయే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 50 వేల హోటల్ గదులను అందుబాటులోకి తేగలగడం ఈ విధానం ప్రధాన లక్ష్యం.
ఈ విధానం అమలైతే: బీచ్ కల్చర్ & కనెక్టివిటీ
బీచ్ షాక్స్ (Beach Shacks): గోవా మోడల్‌ను పరిశీలిస్తూ, పర్యావరణ నిబంధనలకు లోబడి తీరప్రాంతాల్లో ఓపెన్ కేఫ్‌లు, రెస్టారెంట్లు అనుమతించే ఆలోచన చేస్తున్నారు.
ఈవెంట్ టూరిజం: విశాఖ వంటి నగరాల్లో పెద్ద స్థాయి సంగీత కచేరీలు, జాతీయ లేదా అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించే అవకాశాలను ఆకర్షించడాన్ని ఒక వ్యూహంగా ఎంచుకున్నారు.
సీప్లేన్ కనెక్టివిటీ: కేంద్ర ప్రభుత్వ సాయంతో సీప్లేన్ కనెక్టివిటీ అమలైతే… బీచ్ ప్రాంతాల నుంచి అరకు, బొర్రా గుహల వంటి లోపలి పర్యాటక ప్రాంతాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
అఖండ గోదావరి: రాజమండ్రి రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ద్వారా 2027 గోదావరి పుష్కరాల నాటికి లక్షలాది మందికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు.
విశాఖ నుంచి గోదావరి వరకు…
విశాఖను కేవలం సముద్రతీర నగరంగా కాకుండా, ఎక్కువ రోజులు గడిపే తీర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. అదే సమయంలో గోదావరి ప్రాంతంలో పుష్కరాల నేపథ్యంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. సింహాచలం వంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచే పనులు కొనసాగుతున్నాయి.
ఒకే దారం
ఈ ఆలోచనలు,ప్లాన్ లు అన్నిటికి మూలం… రాష్ట్రానికి వచ్చిన పర్యాటకుడు త్వరగా వెళ్లిపోకుండా,కొంచెం ఎక్కువ రోజులు ఇక్కడే ఉండాలే చూడటమే.
చివరికి…
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఆకర్షణలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి అవసరమైనవి ఇప్పటికే ఉన్నాయి.కావాల్సిందల్లా… దేశం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకుడు తన ప్రయాణాన్ని కొత్తగా ఊహించుకునేలా ఒక కథ చెప్పడం.
ఏదో ఒకరోజు…
తిరుమల దర్శనం ముగించుకుని కారులో కూర్చున్న ఒక కుటుంబంలో… “ఇప్పుడే ఇంటికి ఎందుకు…? విశాఖ కూడా చూసి వెళ్దాం.లేదా అంతర్వేది వెళ్దాం”అనే మాట సహజంగా వినిపిస్తే…ఆంధ్రప్రదేశ్ కొత్త టూరిజం కథ ..ఆ రోజు అప్పుడే నిజంగా మొదలైనట్టు.








