టీమిండియా ఓటమికి బ్యాటింగ్ ఆర్డరే కారణమా? శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ప్రయోగాలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కీలకమైన మూడో వన్డేలో 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) నేతృత్వంలోని వ్యూహాలు ఆటగాళ్ల ప్రదర్శనను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. రన్ ఛేజింగ్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న కేఎల్ రాహుల్‌ను(K L Rahul) నంబర్ 6 స్థానానికి పరిమితం చేయడంపై శ్రీకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
“అంత పెద్ద స్కోరును ఛేజ్ చేస్తున్నప్పుడు ఎవరైనా రాహుల్‌ను ఆ స్థానంలో పంపుతారా? అతను ఏమైనా లోయర్ ఆర్డర్ ఫినిషరా?” అని తన యూట్యూబ్ ఛానెల్లో ప్రశ్నించారు. మ్యాచ్ చేజారిపోయి, ఓవర్‌కు 15 పరుగులు కావాల్సిన ఉత్కంఠ భరిత స్థితిలో రాహుల్‌ను గ్రౌండ్లోకి పంపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. టీమ్ మేనేజ్మెంట్ వైఖరిపై శ్రీకాంత్ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. “మీరు ఇప్పటికే సంజూ శాంసన్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్లను ఎలాగైతే గందరగోళంలో పడేశారో.. ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయంలోనూ అదే తప్పు పునరావృతం చేస్తున్నారు. ఇది అతనికి జరుగుతున్న ఘోర అన్యాయం” అని పేర్కొన్నారు.
రాహుల్‌ను నంబర్ 4 లో పంపి ఉంటే విరాట్ కోహ్లీతో(Virat Kohli) కలిసి జట్టును గెలిపించేవాడని అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకం (138)తో రాణించగా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు సాధించారు. అయితే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ త్వరగానే అవుట్ కావడంతో మిడిల్ ఆర్డర్ విఫలమైంది. గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి రాహుల్‌ను అక్షర్ పటేల్ కంటే వెనుకకు నెట్టడంపై చర్చ నడుస్తోంది. చివరకు భారత్ 27 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఈ సిరీస్ 1-2 తో ఇంగ్లాండ్ పరం అయింది.








