టెర్రరిస్టుల కొత్త కమాండర్ AI? తుపాకీ పక్కనే ChatGPT!!
రాత్రి… 2 గంటలు. ఆఫ్రికా అడవి.
చుట్టూ దట్టమైన పొగమంచు. ఆ అడవి మధ్యలో ఆ పచ్చని చెట్ల మధ్య దాక్కున్నుందో చిన్న టెంట్. ఎక్కడో దూరంలో పక్షుల అరుపులు, జంతువుల అలికిడి ఉండుండి వినపిస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఓ పాత జనరేటర్ నిరంతరం గర్జిస్తోంది. టెంట్లో వినిపిస్తున్నది రెండే శబ్దాలు. జనరేటర్ గర్జన…కీబోర్డ్‌పై పడుతున్న వేళ్ల చప్పుడు.
అలాగే ఆ టెంట్ లోపల వెలుగుతున్నది ఒక్కటే. అది ఓ ల్యాప్‌టాప్ స్క్రీన్. టేబుల్‌పై…దుమ్ము పట్టిన AK-47. మడతలు పడిన పాత మ్యాప్. ఓ శాటిలైట్ ఫోన్. కొన్ని ఖాళీ బుల్లెట్ షెల్స్. వాటి మధ్యలో… మన ప్రపంచానికి చెందిన ఆ ఒకే ఒక్క వస్తువు ల్యాప్‌టాప్ పైనే అందరి దృష్టి ఉంది. అది అలాంటి వాతావరణానికి చెందని వస్తువు అనుకుంటాం. కానీ చిత్రంగా ఆ రాత్రి అక్కడ ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం అదే!
ఆ స్క్రీన్ వెలుతురు ఎదురుగా కూర్చున్న వ్యక్తి కళ్లపై పడుతోంది. అతని వేళ్లు కీబోర్డ్‌పై వేగంగా కదులుతున్నాయి. టెంట్లో ఉన్న మిగతావాళ్లంతా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ స్క్రీన్ వైపే ఆత్రుతగా చూస్తున్నారు. కొన్ని సెకన్లు గడిచాయి కాసేపట్టికి ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ‘టింగ్’మనే శబ్దం.
స్క్రీన్‌పై ఏదో ప్రత్యక్షమైంది. అది చదివిన వెంటనే…అతని పెదవులపై చిరునవ్వు మెరిసింది.పక్కనే ఉన్న వ్యక్తి నెమ్మదిగా తుపాకీని చేతిలోకి తీసుకున్నాడు. టెంట్ బయట వాహనాల ఇంజిన్లు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి.అసలు అక్కడ ఏ జరుగుతోంది?
ఆ స్క్రీన్‌పై కనిపించిన ఆ ఒక్క వాక్యం చూసి అంతా ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది? ఇది ఏ సినిమా సీనో కాదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రచురించిన ఒక సంచలన పరిశోధనా వ్యాసంలో బయటపడిన పచ్చి నిజం!
ఆ స్క్రీన్‌పై ఏం కనిపించింది !
ఇవి కూడా చదవండి
మనలో చాలామంది ఆఫీసు ఇమెయిళ్లు రాయడానికో, పద్ధతిగా వ్యాసాలు పూర్తిచేయడానికో వాడుతున్న అదే ChatGPT, Claude, Grok, DeepSeek లాంటి ఏఐ టూల్స్… ఆ రాత్రి ఆఫ్రికన్ అడవుల్లోని ఆ ఉగ్రవాద శిబిరంలో కూడా తెరుచుకున్నాయి.అందులో ఉన్న విషయాలే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి.
నైజీరియాలో విధ్వంసం సృష్టిస్తున్న బోకో హరామ్, ISWAP (ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్) గ్రూపుల్లో పనిచేసి బయటికొచ్చిన పాత సభ్యులను కేంబ్రిడ్జ్ పరిశోధకురాలు ఆంటోనియా జూలిచ్ నేరుగా మాట్లాడించారు. వారు చెప్పిన దిగ్భ్రాంతికర నిజాలే ఈ రిపోర్టు!
నిన్న మొన్నటి వరకు ఉగ్రవాదులు ఏఐని కేవలం ఆన్లైన్ ప్రచారం కోసమో, కొత్త కుర్రవాళ్లను తన గ్రూప్ లలో జాయిన్ చేసుకునే ప్రాసెస్ లో బ్రెయిన్ వాష్ చేయడానికో వాడుతున్నారని అంతా అనుకున్నారు. కానీ, సీన్ ఎప్పుడో మారిపోయింది. ఏఐని కేవలం ప్రచారం కోసమే కాకుండా నేరుగా ఉగ్రవాద దాడులకు పథకాలు వేయడానికి, స్కెచ్‌లు గీయడానికి వాడుతున్నారని తేలింది.
‘Force Multiplier’గా..?
ఈ అధ్యయనంలో నిపుణులు ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పారు. AI ఉగ్రవాదులకు కొత్త రకం ఆయుధాలను తయారు చేసి ఇవ్వడం లేదు. కానీ ఇది ఒక “Force Multiplier” (సామర్థ్యాన్ని రెట్టింపు చేసే సాధనం)గా పనిచేస్తోంది. దాడులు చేసి ప్రాణాలు పోగొట్టుకుని నేర్చుకునే అవసరం లేకుండా, స్క్రీన్ ముందే ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ చేసుకునే వెసులుబాటును ఏఐ వీళ్లకు ఇచ్చేసింది.
‘జెయిల్ బ్రేకింగ్’… అడవుల్లో డిజిటల్ క్లాసులు!
సరే, అసలు ఆఫ్రికా అడవుల్లో నక్కిన ఉగ్రవాదుల చేతికి ఈ హైటెక్ విద్య ఎలా అబ్బింది? అదే కదా మీ సందేహం.ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన ట్రైనర్లు ఈ నైజీరియన్ ముఠాలకు డిజిటల్ తరగతులు చెప్పారట.
ఏఐకి సాధారణంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ‘బాంబు ఎలా తయారు చేయాలి?’ అనో ‘దాడి ఎలా చేయాలి?’ అనో అడిగితే అవి సమాధానం చెప్పవు. దాన్ని సెక్యూరిటీ వాల్ అంటారు. కానీ ఈ ఉగ్రవాద డిజిటల్ ట్రైనర్స్… ‘జెయిల్ బ్రేకింగ్’ (Jailbreaking) అనే విద్యను వీళ్లకు నూరిపోశారు. అంటే, ప్రశ్నను నేరుగా అడగకుండా, ఏఐ కళ్లకు గంతలు కట్టి, దాని భద్రతా వ్యవస్థను దాటుకుని మనకు కావాల్సిన సమాచారాన్ని రాబట్టే ప్రాంప్టింగ్ టెక్నిక్ అన్నమాట.
ఇక ప్రతి బ్యాచ్ లోనూ ఏఐ కోసమే ప్రత్యేకంగా కొన్ని విభాగాలు ఏర్పాటయ్యాయి. వాళ్లకు వేరే పనులేమీ ఉండవు. గ్రౌండ్లో ఉన్న మిలిటెంట్లు అడిగే ప్రశ్నలకు ఏఐ ద్వారా సమాధానాలు వెతికి పంపడమే వాళ్ల పని.
కొత్త ఆయుధాల గైడ్‌లా మారిన చాట్‌బాట్
ఎక్కడైనా సైన్యాన్ని దెబ్బతీసి కొత్త ఆయుధాలు లాక్కుంటే… వాటిని ఎలా వాడాలో తెలియక ఉగ్రవాదులు తడబడేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ కొత్త ఆయుధాల ఆపరేటింగ్ గైడ్‌ను ఏఐ క్షణాల్లో ఇచ్చేస్తోంది. డ్రోన్లకు అమర్చే బాంబుల తీవ్రతను పెంచడం దగ్గర్నుంచి, లైవ్ దాడుల ప్లానింగ్ వరకు అంతా ఏఐ వేలిముద్రలే!
నైజీరియన్ సైన్యం తమ క్యాంపుల చుట్టూ ఉగ్రవాదులు బైక్‌లపై రాకుండా పెద్ద పెద్ద గోతులు (ట్రెంచెస్) తవ్వింది. ఆ గోతులను మోటార్ సైకిళ్లతో ఎలా జంప్ చేయాలో కూడా ఏఐని అడిగి మరీ స్కెచ్ వేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
“ఒకప్పుడు 200 మందిని దాడికి పంపితే సైన్యం ఎదురుదాడిలో 60 మంది చనిపోయేవాళ్లు. కానీ ఏఐ ఇచ్చిన ప్లాన్‌తో కేవలం 20 మందితో వెళ్లి, పక్కాగా దాడి చేసి వస్తున్నాం” అని లొంగిపోయిన ఒక మాజీ మిలిటెంట్ చెప్పిన మాటలు భద్రతా దళాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, లైవ్ దాడి ప్లానింగ్ మొత్తాన్ని ఏఐ ఇస్తోంది. శాసిస్తోంది.
అసలు ప్రమాదం ఎక్కడుంది?
అయితే రసాయన, బయోలాజికల్ (క్రిమి) ఆయుధాలను ఏఐ సాయంతో తయారుచేసేయగలరా అంటే… దానికి కావలసిన ప్రమాదకర రసాయనాలు, ఫిజికల్ మెటీరియల్స్ సంపాదించడం అంత తేలిక కాదు కాబట్టి అంతవరకు ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ సాధారణ దాడుల ముప్పు మాత్రం వెయ్యి రెట్లు పెరిగింది.
చేతిలో ఉన్న చాకుతో కూరగాయలు కోయొచ్చు, కంఠమూ తెంచొచ్చు. సాంకేతికత కూడా అంతే!
టెక్నాలజీ రయ్‌మని పరిగెడుతుంటే… దాన్ని ఆపే భద్రతా వ్యవస్థలు మాత్రం ఇంకా ఆయాసపడుతూ వెనుకే వస్తున్నాయి. ఈ గ్యాప్‌ని భర్తీ చేయకపోతే, రేపు మనం సృష్టించిన డిజిటల్ మేధస్సే మనకు పెద్ద ముప్పుగా మారినా ఆశ్చర్యం లేదు!
ఇవి కూడా చదవండి








