వేల ఏళ్ల ‘ట్రోజన్ హార్స్’… ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్‌పై యుద్ధం!
“కొన్ని కథలు… చరిత్ర పుస్తకాల పేజీల్లోనే మిగిలిపోవు”
కాలం మారినా…వాటిలో దాగి ఉన్న ఆలోచనలు కొత్త రూపంలో మళ్లీ పుడతాయి. వేల ఏళ్ల క్రితం…ఒక యుద్ధంలో గెలవడానికి ఉపయోగించిన ఓ ఎత్తుగడ… ఈ రోజు… బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న శాస్త్రవేత్తలకు ప్రేరణగా మారింది. ఆ ఎత్తుగడ పేరు… ‘ట్రోజన్ హార్స్’.
దాని కథ మొదలైంది ఇలా…
ఎన్నో సంవత్సరాల యుద్ధం తర్వాత… శత్రువు ఓడిపోయినట్టే కనిపించాడు. వెళ్తూ… “యుద్ధం ముగిసింది… ఇది మా చివరి కానుక.” అన్నట్లుగా ఒక భారీ చెక్క గుర్రాన్ని కోట గేటు ముందు వదిలి వెళ్లాడు. మెల్లిగా అ శత్రు సైన్యం వెనుదిరిగింది.
కోటలో సంబరాలు మొదలయ్యాయి. “విజయానికి సాధించాం ఇదిగో అదే ఈ గుర్తు…” అంటూ ఆ భారీ గుర్రాన్ని కోట లోపలికి తీసుకెళ్లారు.
ఆ రాత్రి… నిశ్శబ్దంగా… ఆ చెక్క గుర్రం కడుపు తెరుచుకుంది. దానిలో దాక్కున్న సైనికులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కోట గేట్లు తెరిచారు. బయట వేచి ఉన్న శత్రు సైన్యం లోపలికి దూసుకొచ్చింది. ఉదయం అయ్యేసరికి… విజయం జరుపుకున్న రాజ్యం శత్రువుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
చరిత్రలో ఈ ఎత్తుగడనే ‘ట్రోజన్ హార్స్’ అని పిలుస్తారు.
ఇవి కూడా చదవండి
వేల ఏళ్ల తర్వాత… అదే వ్యూహాన్ని ఇప్పుడు అమెరికా శాస్త్రవేత్తలు బ్రెయిన్ క్యాన్సర్‌పై ప్రయోగించారు. ఇప్పటివరకు మెదడులోకి ప్రవేశించలేకపోయిన క్యాన్సర్ మందును… చక్కెర అణువులతో కప్పిన నానోపార్టికల్స్లో దాచి మెదడులోకి పంపించారు. అదే ఇప్పుడు వైద్య రంగంలో ఆశలు రేపుతున్న కొత్త పరిశోధన. ఆ పరిశోధన ఏమిటి..కాన్సర్ రోగులకు అది ఏ మేరకు ఉపయోగం?
బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స ఎందుకంత కష్టం?
మన శరీరంలో అత్యంత కఠినమైన రక్షణ వ్యవస్థల్లో ఒకటి బ్లడ్-బ్రెయిన్ బారియర్ (Blood-Brain Barrier – BBB). దీన్ని మెదడుకు ఉండే ‘సెక్యూరిటీ గేట్’గా చెప్పొచ్చు. రక్తంలో ఉండే వైరస్లు, బ్యాక్టీరియా, విషపదార్థాలు మెదడులోకి వెళ్లకుండా ఇది నిరోధిస్తుంది. అయితే అదే రక్షణ… వైద్యులకు పెద్ద సమస్యగా మారింది.
ఎందుకంటే, క్యాన్సర్‌ను చంపే చాలా మందులు కూడా ఈ గోడను దాటలేవు. అందుకే గ్లియోబ్లాస్టోమా అనే అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్‌కు చికిత్స ఇప్పటికీ ప్రపంచ వైద్యరంగానికి పెద్ద సవాలుగా ఉంది.
సర్జరీ…రేడియేషన్…కీమోథెరపీ… ఇలా ఎన్ని చేసినా చాలా మంది రోగుల్లో వ్యాధి మళ్లీ తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు శాస్త్రవేత్తలకు వచ్చిన ఆలోచన ఒక్కటే… “గేటు బద్దలు కొట్టడం కాదు… ఆ గేటే తెరిచేలా చేయాలి.” అక్కడే పుట్టింది ఈ ‘ట్రోజన్ హార్స్’ ట్రిక్.
చక్కెర ట్రిక్… ‘ట్రోజన్ హార్స్’ ప్లాన్!
శత్రువుల కోటలోకి సైన్యాన్ని పంపడానికి ఒక పెద్ద చెక్క గుర్రాన్ని (ట్రోజన్ హార్స్) బహుమతిగా ఇచ్చి, దాని లోపల సైనికులను దాచి పంపిన కథ లో మాదిరిగానే ఆలోచించి శాస్త్రవేత్తలు ఇక్కడ అదే పనిచేశారు.
ఎర వేయడం: మెదడు నిరంతరం పనిచేయడానికి గ్లూకోజ్ (చక్కెర) అత్యవసరం. కాబట్టి మెదడు కాపలాదారులు చక్కెరను చూడగానే ఏమాత్రం తనిఖీ చేయకుండా లోపలికి అనుమతిస్తారు.
చికిత్సను దాచడం: ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు మందును కవర్ చేస్తూ నానోపార్టికల్స్ ఉపరితలంపై ‘మానోస్’ (Mannose) అనే చక్కెర పూతను దట్టంగా పూశారు.
మోసం ఫలించింది: మెదడు ఈ మందును చూసి, తనకి కావాల్సిన శక్తినిచ్చే “చక్కెర” అనుకుని ఆహ్వానించింది!
క్యాన్సర్ ఆకలి: పైగా, సాధారణ కణాల కంటే క్యాన్సర్ కణాలకు చక్కెర అంటే విపరీతమైన ఆకలి. దీంతో మెదడులోకి వెళ్లిన ఈ చక్కెర మందును క్యాన్సర్ కణాలు వెంటపడి మరీ లాక్కున్నాయి.
చక్కెర ఎలా ఆయుధంగా మారింది?
ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఉపయోగించినది మనం టీలో వేసుకునే చక్కెర కాదు. పరిశోధకులు ‘మానోస్’ (Mannose) అనే చక్కెర అణువులతో ప్రత్యేకంగా తయారు చేసిన నానోపార్టికల్స్‌ను ఉపయోగించారు. అంటే… మందు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లలేదు. తలుపు తెరుచుకునే సరైన మార్గాన్నే ఎంచుకున్నారు.
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది!
మెదడులోకి చేరిన ఆ నానోపార్టికల్స్ నేరుగా క్యాన్సర్ కణాల వద్దే ఎక్కువగా చేరాయి. అక్కడ అవి ఒక ప్రత్యేకమైన mRNAను విడుదల చేశాయి. దాని పని… క్యాన్సర్ కణాల్లో మళ్లీ PTEN అనే ట్యూమర్‌ను అణిచివేసే ప్రొటీన్ ఉత్పత్తి అయ్యేలా చేయడం. దీంతో క్యాన్సర్ పెరుగుదలపై నియంత్రణ ఏర్పడింది.
ప్రయోగాల్లో వచ్చిన ఫలితాలు ఎంత పెద్దవంటే…
ఎలుకలపై చేసిన పరీక్షల్లో…సాధారణ నానోపార్టికల్స్‌తో పోలిస్తే… ఈ చక్కెర పూత పూసిన నానోపార్టికల్స్ 9.9 రెట్లు ఎక్కువగా మెదడులోకి చేరాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం…చికిత్స చేయని ఎలుకల్లో 28 రోజుల తర్వాత… మెదడులో 52 శాతం భాగాన్ని ట్యూమర్ ఆక్రమించింది. అదే… కొత్త చికిత్స పొందిన ఎలుకల్లో ఆ సంఖ్య కేవలం 2.3 శాతానికి పడిపోయింది. అంతేకాదు…సగటు జీవన కాలం 33 రోజుల నుంచి 49 రోజులకు పెరిగింది.
పరిశోధకులు గమనించిన మరో ముఖ్యమైన విషయం… కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాల్లో గణనీయమైన విషప్రభావాలు కనిపించలేదు.
ఇది మనుషులకు ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతానికి ఈ ప్రయోగం కేవలం లాబొరేటరీలో ఎలుకలపై మాత్రమే విజయవంతమైంది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ (Clinical Trials) పూర్తయి, అవి పూర్తి సురక్షితమని తేలిన తర్వాతే ఇది సాధారణ చికిత్సగా అందుబాటులోకి వస్తుంది. దానికి ఇంకా కొంత సమయం పడుతుంది.
బ్రెయిన్ క్యాన్సర్ మాత్రమేనా?
ఖచ్చితంగా కాదు! మెదడు సెక్యూరిటీ గేట్‌ను దాటే ఈ టెక్నాలజీ ఒక రహదారి లాంటిది. భవిష్యత్తులో ఈ ‘చక్కెర మార్గం’ ద్వారా: అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి కోల్పోవడం), పార్కిన్సన్స్ (నరాల బలహీనత) వంటి ఇతర తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధులకు కూడా మందులను నేరుగా మెదడులోకి పంపించేందుకు ఈ రీసెర్చ్ ఒక కొత్త బాట వేసింది.
అలాగే…
“చక్కెర తింటే బ్రెయిన్ క్యాన్సర్ తగ్గుతుంది” అనే అర్థం అస్సలు ఈ ఆర్టికల్ ఇవ్వటం లేదని గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధనలో ఉపయోగించినది ప్రత్యేకంగా రూపొందించిన మానోస్-కోటెడ్ నానోపార్టికల్స్.
ఏదైమైనా
కొన్ని చారిత్రక కథలు… పుస్తకాల పేజీల్లోనే మిగిలిపోవు. కాలం మారినా… వాటిలో దాగి ఉన్న ఆలోచనలు సైన్స్‌కు కొత్త దారులు చూపిస్తాయి. ‘ట్రోజన్ హార్స్’ కూడా అలాంటి ఆలోచనే. ఒకప్పుడు… ఓ రాజ్యాన్ని జయించడానికి ఉపయోగించిన వ్యూహం… ఇప్పుడు…ప్రాణాలను కాపాడే శాస్త్రానికి మార్గదర్శకంగా మారుతోంది.
గమనిక (Disclaimer): ఇది జర్నల్ ఆఫ్ కంట్రోల్డ్ రిలీజ్ (Journal of Controlled Release) లో ప్రచురితమైన ప్రాథమిక పరిశోధనాత్మక కథన సారాంశం మాత్రమే. ఇది ఇంకా రోగులకు అందుబాటులో కి వచ్చిన వైద్య చికిత్స కాదు. ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా అర్హులైన వైద్యులను సంప్రదించాలి.
ఇవి కూడా చదవండి








